Congress: కారు పార్టీ కనుమరుగేనా..?
ABN, Publish Date - Jul 12 , 2024 | 08:24 PM
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు రాగా.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బై ఎలక్షన్‌లో ఆ సీటు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్ ఒక్కో నేత కారు దిగుతున్నారు.
హైదరాబాద్: ఉద్యమ సమయంలో ఆ పార్టీకి తిరుగులేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్లు అధికారంలో ఉంది. ఆ తర్వాత గులాబీ పార్టీ చతికిల బడింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షానికే పరిమితమైంది. కేవలం 39 సీట్లు మాత్రమే గెలుచుకొని ప్రజల తిరస్కరణకు గురయ్యింది. 64 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఆ తర్వాత ప్రలోభాల పర్వానికి తెరలేచింది. రకరకాల కారణాలతో ఎమ్మెల్యేలు జంప్ అవుతున్నారు. గతంలో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ వెళ్లగా.. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు క్యూ కడుతున్నారు. కీలకమైన నేతలు పార్టీ వీడటంతో గులాబీ బాస్‌ను టెన్షన్‌కు గురిచేస్తోంది. కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస రెడ్డి, కే కేశవరావు లాంటి నేతలు కారు పార్టీకి టాటా చెప్పేశారు. హస్తమే మా నేస్తం అని ప్రకటించేస్తున్నారు.
39 నుంచి.. 25..?
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి 39 సీట్లు రాగా.. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. బై ఎలక్షన్‌లో ఆ సీటు కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, ప్రకాష్ గౌడ్ ఒక్కో నేత కారు దిగుతున్నారు. ఎమ్మెల్యేలు చేజారడటంతో కేసీఆర్ దిద్దుబాటు చర్యలకు దిగారు. ఫామ్ హౌస్‌కు పిలిపించి మాట్లాడారు. అయినప్పటికీ ఎమ్మెల్యేల మనసు మారడం లేదు. వారంలో ఒకరిద్దరూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్నారు. ఎమ్మెల్యేలకు సీఎం, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సాదర స్వాగతం పలుకుతున్నారు. అభివృద్ధి పనులు అని ఒకరు, పెండింగ్ బిల్లులు అని మరొకరు పార్టీ వీడుతున్నారు. శుక్రవారం ప్రకాష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేపు అరికెపూడి గాంధీ చేరతారని తెలిసింది. చేరబోయే ఇద్దరు, ముగ్గురు నేతలతో కలిపి 13 మంది బీఆర్ఎస్ పార్టీని వీడినట్టు అవుతుంది. కారు పార్టీకి ఉండే ఎమ్మెల్యేల సంఖ్య 25 అవుతోంది.
అందరూ ఓకేసారి కాకుండా..
వాస్తవానికి అందరూ నేతలను ఒకేసారి చేర్చుకోవాల్సి ఉంది. శుభ సమయం చూసుకోవడంతో ఒక్కో రోజు ఒక్కో ఎమ్మెల్యే పార్టీలో చేరాల్సి వస్తోంది. గతంలో సీఎల్పీని విలీనం చేసిన విధంగా.. ఇప్పుడు బీఆర్ఎస్‌ఎల్పీని విలీనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. ఈ నెల 24వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఆ లోపు కారు పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని, బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది. గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన ఐదారుగురు ఎమ్మెల్యేలు ఇటీవల మంత్రి శ్రీధర్ బాబుతో సమావేశం అయ్యారు. పైకి అభివృద్ధి పనులని ప్రకటించారు. లోన మాత్రం.. పార్టీలో చేరిక గురించి చర్చ జరిగిందనే వార్త గుప్పుమంది. అందుకు సంబంధించిన కార్యాచరణను క్రమంగా అనుసరిస్తోంది.
MLA Prakash Goud: కాంగ్రెస్ గూటిలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్
దానం నాగేందర్ సంచలనం
కారు పార్టీ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు కాంగ్రెస్ పార్టీలో చేరుతుండగా.. దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరతారని బాంబ్ పేల్చారు. ఆ లెక్కన చూస్తే ఇప్పటికే ఐదారుగురు చేరగా.. మిగతా 15 మంది వరకు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరేందుకు ఛాన్స్ ఉంది. పదవులు, పనులు, ఇతర అంశాలతో కారు పార్టీ ఖాళీ అవనుంది. ఆ లెక్కన చూస్తే బీఆర్ఎస్ పార్టీకి 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు మిగిలే అవకాశం ఉంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సన్నిహితంగా మెలిగే పళ్లా రాజేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు గుప్పు మన్నాయి. సీనియర్లు, కీలక నేతలు, బంధువులు బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నారు. ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఆ పార్టీకి కష్టం అవుతోందని ఆనలిస్టులు విశ్లేషిస్తున్నారు.
For more Telangana News and Telugu News
Updated Date - Jul 12 , 2024 | 08:24 PM