CM Revanth:మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం. మా వాదం గాంధేయవాదం
ABN, Publish Date - Aug 15 , 2024 | 12:37 PM
స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఎందరో మహనీయుల త్యాగ ఫలం స్వాతంత్య్రమని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొని జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు.
హైదరాబాద్: నేటి స్వేచ్ఛ, స్వాతంత్య్రాలు ఎందరో మహనీయుల త్యాగ ఫలం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సాంస్కృతిక ప్రదర్శనలను సీఎం తిలకించారు.
ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. తెలంగాణ సాధించుకొని దశాబ్ద కాలమైనా రాష్ట్ర గీతం లేని పరిస్థితి మొన్నటి వరకు ఉందని సీఎం రేవంత్ అన్నారు. ప్రముఖ ప్రజాకవి అందెశ్రీ రాసిన "జయ జయహే తెలంగాణ..." గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించి ఆ లోటును భర్తీ చేశామని, తద్వారా సాంస్కృతిక పునరుజ్జీవనానికి నాంది పలికామని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో సీఎం రేవంత్ పాల్గొని ప్రసంగించారు.
మాది గాంధీ సిద్ధాంతం: రేవంత్ రెడ్డి
‘‘మా సిద్ధాంతం గాంధీ సిద్ధాంతం. మా వాదం గాంధేయవాదం. తెలంగాణ రాష్ట్ర పేరును సూచించే సంక్షిప్త అక్షరాల విషయంలో TS స్థానంలో TGని ప్రభుత్వం పునరుద్ధరించింది. ఇది ప్రజల ఆకాంక్ష. మా ప్రభుత్వం అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విధ్వంసమై ఉంది. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అప్పు దాదాపు 10 రెట్లు పెరిగింది. రాష్ట్ర ఆవిర్భావ సమయంలో రూ.75,577 కోట్లుగా ఉన్న అప్పు, గత ఏడాది డిసెంబరు నాటికి దాదాపు రూ.7 లక్షల కోట్లకు చేరింది. దీనిపై శ్వేతపత్రం కూడా విడుదల చేశాం. దయనీయ స్థితిలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచేందుకు ఆర్థిక పునరుజ్జీవనం అవసరం అని భావించాం. ఆ దిశగా రాష్ట్ర అప్పులను రీస్ట్రక్చర్ చేయించే ప్రయత్నంలో ఉన్నాం.
ఇటీవల అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడితో సమావేశమయ్యాం. తక్కువ వడ్డీలతో రాష్ట్రాభివృద్ధికి అవసరమైన నిధులు సమకూర్చుకునే అంశంపై మా మధ్య సానుకూల చర్చలు జరిగాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. గతంలో మాదిరిగా అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి... రాష్ట్ర ప్రజల నెత్తిన మోయలేని భారం మోపే పనులు మేం చేయబోం. ఆర్థిక అవరోధాలు ఉన్నా ప్రతి ఇంటా సౌభాగ్యాన్ని నింపాలనే మహాసంకల్పంతో రూపొందించిన అభయహస్తం హమీలన్నీ తూ.చ తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు..
వ్యయసాయం, పారిశ్రామికం రెెండు కళ్లు
‘‘పంచవర్ష ప్రణాళికలు రచించి, ఈ దేశానికి వ్యవసాయ, పారిశ్రామిక అభివృద్ధి అన్నవి రెండు కళ్లు అని నమ్మి ఆ దిశగా తొలి అడుగులు వేయించిన దార్శనికుడు పండిట్ నెహ్రూ, ఆయన ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను మనం ఈ రోజు ఆధునిక దేవాలయాలుగా పిలుచుకుంటున్నాం. ఈ దేశంలో కోట్లాది ఎకరాలు పంటలతో పచ్చతోరణాన్ని కట్టుకున్నాయంటే దానికి కారణం నెహ్రూ ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులే. నాగార్జున సాగర్, శ్రీశైలం, భాక్రానంగల్, శ్రీరాం సాగర్ లాంటి ప్రాజెక్టులు నెహ్రూ ప్రారంభిస్తే... ఆ తర్వాత వాటిని పూర్తి చేసి, కోట్లాది మంది రైతుల పొలాలకు సాగు జలాలు పారించిన ఘనత స్వర్గీయ ఇందిరాగాంధీకి దక్కుతుంది. అంతేకాదు, పారిశ్రామికంగా BHEL, ECIL, IDPL, మిథాని వంటి ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలు ఆ స్వర్ణయుగంలో నెలకొల్పబడినవే. హరిత విప్లవం, శ్వేత విప్లవం, నీలి విప్లవం చేపట్టి అన్నిరంగాల సమగ్రాభివృద్ధికి కృషిచేసిన ఘనత నాటి ప్రభుత్వాలది. బడా పారిశ్రామిక వేత్తలకు మాత్రమే తెలిసిన బ్యాంకింగ్ వ్యవస్థను జాతీయీకరణతో గ్రామీణ ప్రజల చెంతకు చేర్చిన ఘనత, ప్రతి పౌరుడుకి బ్యాంకును అందుబాటులోకి తెచ్చిన గొప్పతనం ఆ నాటి దార్శనికుల వల్లనే జరిగింది.1947 వరకూ ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకున్న మనదేశం, ఈ నాడు ప్రపంచంలో ఆహారధాన్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశాలలో ఒకటిగా ఎదగడానికి కారణం స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ ప్రవేశ పెట్టిన హరిత విప్లవమే. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టిన 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమం ప్రజల సామాజిక, ఆర్థిక పునరుజ్జీవనానికి గీటురాయిగా మారింది. స్వర్గీయ రాజీవ్ గాంధీ ప్రధానిగా దేశం టెలికమ్యూనికేషన్స్ రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు. అంతరిక్ష, అణుశక్తి కార్యక్రమాల్లో స్వదేశీ పరిజ్ఞానాన్ని వినియోగించే అతికొద్ది దేశాల సరసన భారతదేశాన్ని ఆనాడే నిలుపగలిగారు’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
Updated Date - Aug 15 , 2024 | 12:55 PM