Share News

Hyderabad: కర్ణాటకకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..

ABN , Publish Date - Dec 26 , 2024 | 08:27 AM

తెలంగాణ: కర్ణాటక రాష్ట్రం బెలగావిలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ వెళ్లనున్నారు.

Hyderabad: కర్ణాటకకు వెళ్లనున్న సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..
CM Revanth Reddy

హైదరాబాద్: కర్ణాటక (Karnataka) రాష్ట్రం బెలగావి (Belagavi)కి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వెళ్లనున్నారు. ఇవాళ(గురువారం) ఉదయం 11గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఆయన బయలుదేరనున్నారు. బెలగావిలో రెండ్రోజులపాటు సీడబ్ల్యూసీ (CWC) సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఈ సమావేశాల్లో సీఎం పాల్గొనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, సీడబ్ల్యూసీ సభ్యుడు వంశీచందర్ రెడ్డి వెళ్లనున్నారు. వీరంతా ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి బెలగావికి చేరుకోనున్నారు.


మహాత్మాగాంధీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించి వందేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 26, 27 తేదీల్లో ప్రత్యేక సీడబ్ల్యూసీ సమావేశాలు నిర్వహించాలని కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయించింది. బెలగావిలోనే గాంధీజీ ఏఐసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. అందుకే అక్కడ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాలకు "నవ సత్యాగ్రహ భైఠక్‌" అని కాంగ్రెస్ అధిష్ఠానం నామకరణం చేసింది. ఈ మేరకు సీడబ్ల్యూసీ సభ్యులు, శాశ్వత ఆహ్వానితులు, ప్రత్యేక ఆహ్వానితులు, పీసీసీలు, సీఎల్పీ నేతలు, పార్లమెంటరీ పార్టీ ఆఫీస్‌ బేరర్లు, సీఎంలు, మాజీ సీఎంలు సహా దాదాపు 200 మంది కీలక నేతలకు ఆహ్వానం పంపింది. ఈ మేరకు తెలంగాణ నుంచి కాంగ్రెస్ నేతలు పెద్దఎత్తున వెళ్లనున్నారు.


అయితే బెలగావికి వెళ్లడానికి ముందే టాలీవుడ్ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి నేడు సమావేశం నిర్వహించనున్నారు. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత టాలీవుడ్‌పై తెలంగాణ ప్రభుత్వం ఆంక్షలు పెట్టేందుకు నిర్ణయించింది. ప్రీమియర్, బెనిఫిట్ షోలు వంటివి రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. దిల్ రాజు నేతృత్వంలో 36 మంది సభ్యులు రేవంత్‌తో సమావేశం కానున్నారు. హీరోలు వెంకటేశ్, నితిన్, వరుణ్ తేజ్, శివబాలాజీ.. దర్శకులు త్రివిక్రమ్, హరీశ్ శంకర్, అనిల్, బాబీ, వంశీ.. నిర్మాతలు అల్లు అరవింద్, దగ్గుబాటి సురేశ్, సునీల్ నారంగ్, సుప్రియ, నాగవంశీ, నవీన్ ఎర్నేని, రవిశంకర్ కలవనున్నట్లు తెలుస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

Kamareddy: దారుణం.. చెరువులో దూకిన ముగ్గురు పోలీసులు, చివరికి ఏమైందంటే..

Hyderabad: జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులు నిజమే

Updated Date - Dec 26 , 2024 | 08:43 AM