ఈస్ట్ బైపాస్‌ను బతికిద్దాం
ABN , Publish Date - Mar 15 , 2025 | 01:07 AM
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)కు అతి సమీపంలో వెళుతుందన్న కారణంతో మంజూరైన విజయవాడ ఈస్ట్ బైపాస్ ప్రాజెక్టుకు సమాధి కట్టొద్దని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈస్ట్ బైపాస్ అలైన్‌మెంట్‌ను మార్చితే సరిపోతుందని సూచిస్తున్నారు. ఆప్షన్-1లో భాగంగా ఈస్ట్ బైపాస్‌ను తీసుకొచ్చి ఐఆర్‌ఆర్‌లో కలపొచ్చని, దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని హితవు పలుకుతున్నారు. లేదంటే ఎనికేపాడు-తాడిగడప 100 అడుగుల రోడ్డునూ పరిశీలించవచ్చునని, నిడమానూరు-పోరంకి- పెదపులిపాక రోడ్డును విస్తరించవచ్చుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

- మంజూరైన ప్రాజెక్టును కాలదన్నుకోవద్దంటున్న నగర వాసులు
- ఓఆర్‌ఆర్‌కు దగ్గరగా ఉండటం వల్లనే వీలుకానపుడు..
- ఈస్ట్ బైపాస్ అలైన్‌మెంట్‌ను మార్చితే సరిపోతుందని సూచన
- ఆప్షన్-1లో భాగంగా ఈస్ట్ బైపాస్‌ను తీసుకొచ్చి ఐఆర్‌ఆర్‌లో కలపొచ్చని సలహా
- దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని హితవు
- లేదంటే ఎనికేపాడు-తాడిగడప 100 అడుగుల రోడ్డునూ పరిశీలించవచ్చు!
- నిడమానూరు-పోరంకి- పెదపులిపాక రోడ్డును విస్తరించవచ్చు!
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)కు అతి సమీపంలో వెళుతుందన్న కారణంతో మంజూరైన విజయవాడ ఈస్ట్ బైపాస్ ప్రాజెక్టుకు సమాధి కట్టొద్దని నగర ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈస్ట్ బైపాస్ అలైన్‌మెంట్‌ను మార్చితే సరిపోతుందని సూచిస్తున్నారు. ఆప్షన్-1లో భాగంగా ఈస్ట్ బైపాస్‌ను తీసుకొచ్చి ఐఆర్‌ఆర్‌లో కలపొచ్చని, దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఖర్చు తగ్గుతుందని హితవు పలుకుతున్నారు. లేదంటే ఎనికేపాడు-తాడిగడప 100 అడుగుల రోడ్డునూ పరిశీలించవచ్చునని, నిడమానూరు-పోరంకి- పెదపులిపాక రోడ్డును విస్తరించవచ్చుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
అమరావతి అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్)కు అతి సమీపంలో వెళుతుందన్న ఒకే ఒక్క కారణంతో మంజూరైన విజయవాడ ఈస్ట్ బైపాస్ ప్రాజెక్టును వదులుకోవాల్సిన అవసరం లేదన్న అభిప్రాయం నగర ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఈస్ట్ బైపాస్ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టును ఓఆర్‌ఆర్ పేరుతో వదులుకోవటం కంటే కూడా దీని అలైన్‌మెం ట్‌ను సవరించటం ద్వారా విజయవాడ నగరం, గ్రేటర్ విలీన ప్రతిపాదిత ప్రాంతాల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. ఓఆర్‌ఆర్ అలైన్‌మెంట్ దగ్గరగా ఉండటమే విజయవాడ ఈస్ట్ బైపాస్‌కు సమస్య అయితే దీని అలైన్‌మెంట్‌ను మార్చటానికి తగిన ప్రత్యామ్నాయం ఉంది. దీనిపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వం దృష్టి సారిస్తే విజయవాడ తూర్పు బైపాస్‌ను కూడా సాకారం చేసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. ఓఆర్‌ఆర్‌కు భూసేకరణ, తదుపరి ప్రక్రియ పూర్తయ్య పనులు మొదలు కావటానికి మరింత సమయం పడుతుంది. ఈ ప్రాజెక్టులో అతి పెద్ద టన్నెల్స్ వంటివి పూర్తి కావటానికి మరింత సమయం అవసరమవుతుంది. ఓఆర్‌ఆర్ పూర్తి అయ్యే నాటికి విజయవాడలో అంతర్గతంగా నెలకొనే ట్రాఫిక్ సమస్యలు ఎంత భయంకరంగా ఉంటాయో ఒక్కసారి ఊహిస్తేనే భయం వేస్తోంది. కాబట్టి ఈస్ట్ బైపాస్ అలైన్‌మెంట్‌ను ఓఆర్‌ఆర్‌కు దూరంగా విజయవాడ ప్రజలకు సౌకర్యంగా ఉండేలా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ఈస్ట్ బైపాస్ 3 ఆప్షన్లలో మిగిలిన వాటి సంగతేమిటి ?
ఈస్ట్ బైపాస్ అలైన్‌మెంట్‌కు ఇచ్చిన డీపీఆర్‌లో మూడు ఆప్షన్స్ ఇచ్చారు. మూడు ఆప్షన్స్‌లో రెండో ఆప్షన్‌ను ఎంపిక చేశారు. మొదటి ఆప్షన్‌ను వదిలేశారు. మొదటి ఆప్షన్‌లో ఎక్కువ నిర్మాణాలు ఉన్నాయన్నది జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్) అధికారుల వాదనగా ఉంది. రెండో ఆప్షన్‌లో మాత్రం వ్యవసాయ భూములు ఎక్కువుగా ఉండటం వల్ల భూ సేకరణ వ్యవహారాలు తేలిగ్గా ఉంటాయని ఎన్‌హెచ్ చెబుతోంది. మొదటి ఆప్షన్ కంటే రెండో ఆప్షన్‌లోనే ఎక్కువ భూసేకరణ వ్యయం అవుతుంది. అయినప్పటికీ ఎన్‌హెచ్ అధికారులు ఆప్షన్ - 2ను ఎంపిక చేశారు. మిగిలిన ఆప్షన్లను గమనిస్తే ఆప్షన్ - 3 అనేది పూర్తిగా అవుటర్ రింగ్ రోడ్డుకు సమాంతరంగా అలైన్‌మెంట్ సాగుతుంది కాబట్టి దీనిని వదిలివేయవచ్చు. ఆప్షన్- 1లో పరిశీలించదగిన ప్రత్యామ్నాయంతో పాటు మరో సమస్య కూడా ఉంది. ఆప్షన్ - 1 అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్)కు సమాంతరంగా ఉంది. అందువల్ల ఆప్షన్ - 1ను పరిశీలించాల్సిన అవసరం లేదన్న వాదనలు కూడా వస్తున్నాయి.
- ఇన్నర్ రింగ్ రోడ్డులో.. ఈస్ట్ బైపాస్ ఆప్షన్ - 1ను అంతర్భాగం చేయవచ్చు :
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్‌ఆర్)ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టాలనుకుంటున్న ప్రాజెక్టు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుతో దీనిని నిర్మించాల్సి ఉంటుంది. అమరావతి ఐఆర్‌ఆర్.. ఈస్ట్ బైపాస్ ఆప్షన్ - 1 కు సమాంతరంగా ఉంటుంది కాబట్టి విజయవాడ ఈస్ట్ బైపాస్‌ను అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డులో భాగంగా సగం భాగానికి ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి ఐఆర్‌ఆర్‌లో సగం ఖర్చు తగ్గుతుంది. మిగిలిన సగం పనులకు సంబంధించి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే సరిపోతుంది. ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తే ఈస్ట్ బైపాస్ కారణంగా చాలా వరకు ఐఆర్‌ఆర్‌పై భారం తగ్గుతుంది. దీనికి అనుగుణంగా మిగిలిన సగభాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించుకోవచ్చు.
- ఇవిగో ప్రత్యామ్నాయాలు.. పరిశీలించండి
మంజూరైన తూర్పు బైపాస్ రోడ్డు ప్రాజెక్టును కాలదన్నుకోకుండా ఉండాలంటే అనేక ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. విజయవాడ ఈస్ట్ బైపాస్‌కు కేంద్ర ప్రభుత్వం మీద కూడా భారం తగ్గించుకునే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
ఎనికేపాడు- తాడిగడప 100 అడుగుల రోడ్డు :
ఈ రోడ్డును విజయవాడ తూర్పు బైపాస్‌లో అంతర్భాగంగా విస్తరించవచ్చు. ప్రస్తుతం ఎనికేపాడు దగ్గర ఎన్‌హెచ్ - 16కు అనుసంధానంగా విజయవాడ నగరం బయట నుంచి తాడిగడప వరకు ఎన్‌హెచ్ - 65కు అనుసంధానంగా ఉంది. ఈ రోడ్డు ప్రస్తుతం రెండు వరసలుగా ఉంది. దీనిని నాలుగు వరసలుగా విస్తరించవచ్చు. విస్తరించటానికి వీలుగా భూములు ఉన్నాయి. నిర్మాణాలు కూడా తక్కువ సంఖ్యలో ఎఫెక్ట్ అవుతాయి. ఎనికేపాడు - తాడిగడప చివర పాయింట్ దగ్గర ఫ్లై ఓవర్ నిర్మించటం ద్వారా నేరుగా పంట పొలాల మీదుగా చిన్న కాకాని సమీపంలోని కాజ దగ్గర వెస్ట్ బైపాస్ రోడ్డుకు అనుసంధానించవచ్చు. అలాగే ప్రారంభం భాగం దగ్గర బాటిల్ నెక్ ఉంది. ఇక్కడ ఉన్న చిన్న సమస్యను పరిష్కరించగలిగితే దీనికి అభిముఖంగా ఎన్‌హెచ్-16 నుంచి నేరుగా విజయవాడ వెస్ట్ బైపాస్ రోడ్డుకు అనుసంధానం అవుతుంది. ఎనికేపాడు - తాడిగడప రోడ్డును కనుక విజయవాడ ఈస్ట్ బైపాస్ అలైన్‌మెంట్ పరిధిలోకి తీసుకు రాగలిగితే.. విజయవాడ పశ్చిమ బైపాస్‌కు కూడా అనుసంధానం ఏర్పడుతుంది. ఇప్పటికే రెండు వరసలుగా ఉండటం వల్ల దీనిని నాలుగు వరసలుగా విస్తరించటానికి కేంద్ర ప్రభుత్వానికి వ్యయం కూడా తక్కువ అవుతుంది. భూ సేకరణ భారం కూడా చాలా వరకు తగ్గుతుంది. కేంద్ర ప్రభుత్వం ఈస్ట్ బైపాస్‌ను ముందుకు తీసుకు వెళ్లటానికి ఇదో ప్రత్యామ్నాయంగా ఉంది.
నిడమానూరు - పోరంకి - పెదపులిపాక రోడ్డు
ఈ రోడ్డు కూడా విజయవాడ ఈస్ట్ బైపాస్‌గా అతి తక్కువ ఖర్చుతో కేంద్ర ప్రభుత్వం చేపట్టడానికి అవకాశం ఉంది. నిడమానూరు గ్రామం నుంచి నేరుగా ఈ రోడ్డు పోరంకి దగ్గర ఎన్‌హెచ్ - 65కు అనుసంధానమవుతుంది. ఈ రోడ్డును అక్కడ నుంచి పెదపులిపాక మీదుగా కాజ దగ్గరకు తీసుకువెళ్లటానికి అవకాశం ఉంటుంది. నిడమానూరుకు ముందు భాగంలో అలైన్‌మెంట్ తీసుకువెళుతూ విజయవాడ వెస్ట్ బైపాస్‌కు అనుసంధానం చేయవచ్చు. ఈ రోడ్డుకు కూడా పెద్దగా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. అలాగే ఈ రోడ్డును విజయవాడ వెస్ట్ బైపాస్‌కు నిడమానూరు నుంచి పంట పొలాల మీదుగా తీసుకువెళ్లవచ్చు.