Hyderabad: కొడంగల్ ప్రజలను నేనెప్పుడూ ఇబ్బంది పెట్టను: సీఎం రేవంత్ రెడ్డి..
ABN, Publish Date - Nov 23 , 2024 | 08:04 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కలిశారు. వారితోపాటు పలువురు వామపక్ష పార్టీల నేతలు సైతం సచివాలయంలో రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు.
హైదరాబాద్: కొడంగల్లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తేల్చి చెప్పారు. ఆ ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ నియోజకవర్గంలో యువత, మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమని సీఎం ఉద్ఘాటించారు. కొడంగల్ ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధి తన బాధ్యతని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. సొంత నియోజకవర్గ ప్రజలను తానేందుకు ఇబ్బంది పెడతానంటూ చెప్పుకొచ్చారు. కాలుష్య రహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. భూసేకరణ పరిహారం పెంపును పరిశీలిస్తామని వెల్లడించారు. లగచర్ల ఘటనపై తనకు వినతిపత్రం ఇచ్చేందుకు సచివాలయానికి వచ్చిన వామపక్ష నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
సీఎంతో భేటీ..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు కలిశారు. వారితోపాటు పలువురు వామపక్ష పార్టీల నేతలు సైతం సచివాలయంలో రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు. ఇటీవల లగచర్ల గ్రామంలో లెఫ్ట్ పార్టీల నిజనిర్ధారణ కమిటీ బృందం పర్యటించింది. గ్రామస్థులతో మాట్లాడిన నేతలు దాడి ఘటనపై వివరాలు సేకరించారు. ముఖ్యమంత్రితో భేటీ సందర్భంగా నిజనిర్ధారణ రిపోర్టును రేవంత్ రెడ్డికి వామపక్షాల నేతలు వివరించారు. గ్రామస్థులతో మాట్లాడిన వివరాలు, అక్కడి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, దాడికి దారి తీసిన అంశాలు తదితర విషయాలపై రిపోర్టును సీఎంకు వివరించారు. ఈ సందర్భంగా వారికి రేవంత్ రెడ్డి ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం బయటకు వచ్చిన వామపక్షాల నేతలు మీడియాతో మాట్లాడారు.
భూములు లాక్కోవద్దు..
ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. "లగచర్ల గ్రామాన్ని సందర్శించాం. రైతులతో మాట్లాడాం. వాస్తవాలు, పరిస్థితులను తెలుసుకున్నాం. సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ఘటనకు సంబంధించి నిజాలు వివరించాం. రైతుల భూములు లాక్కోవద్దని, పరిస్థితులు చక్కదిద్దాలని సీఎంకు చెప్పాం. గ్రామంలో పోలీస్ క్యాంపులు ఎత్తివేయాలని కోరాం. ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. మా ముందే కలెక్టర్‌కు ఫోన్ చేసి ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు ఆయనకు ధన్యవాదాలు. ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారు. అది కాలుష్యం వెదజల్లే ఫార్మా కంపెనీ కాదని తెలిపారు. అక్కడ భూములు బలవంతంగా తీసుకోవద్దని మేము కోరాం. సీలింగ్ లేదా ఇతర భూములు తీసుకోవాలని చెప్పాం. దానికి సీఎం సానుకూలంగా స్పందించారు. కమ్యూనిస్టులం మరోసారి అక్కడ పర్యటిస్తాం. ప్రజలకు భరోసా ఇస్తాం" అన్నారు.
కొత్త పాలసీ ప్రకటించాలి..
లెఫ్ట్ పార్టీలు లగచర్ల గ్రామానికి వెళ్లేందుకు అవకాశం ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ధన్యవాదాలు తెలిపారు. సీఎం కిందిస్థాయి నుంచి వచ్చిన నేత కాబట్టి తమ మాటలకు సానుకూలంగా స్పందించారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా కూనంనేని మాట్లాడుతూ.. "అక్కడ ఫార్మా కంపెనీ పెట్టడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అందుకోసం భూములు తీసుకోవడం లేదనీ చెప్పారు. రైతులు అంగీకరిస్తేనే భూములు సేకరించాలి. మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇప్పటికీ న్యాయం జరగలేదు. నిర్వాసితుల పాలసీని మార్చాలి. భూమికి భూమి ఇచ్చే విధంగా పాలసీ ఉండాలి. అసెంబ్లీ సమావేశాలలో పాలసీ ప్రకటించాలని కోరుతున్నాం" అని చెప్పారు.
Updated Date - Nov 23 , 2024 | 09:56 PM