Kunamneni: తప్పు చేస్తే ఎవరైనా జైలుకు వెళ్లాల్సిందే
ABN, Publish Date - Dec 24 , 2024 | 03:56 PM
Telangana: కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, పేదవారిని హీరోగా చూపించేలా గతంలో సినిమాలు ఉండేవని... కానీ ఇప్పుడు మంచి పక్కకు పోయి విలనిజం హీరోలా చూపిస్తున్నారని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. ఇప్పుడు వచ్చే సినిమాలు సమాజాన్ని ఎటు వైపు తీసుకెళ్తుందని ప్రశ్నించారు.
హైదరాబాద్, డిసెంబర్ 24: సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటతో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్ ప్రస్తుతం కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. శ్రీతేజ్‌ను సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు (Kunamneni Sambashivarao) పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శ్రీతేజ్‌ను పరామర్శించామని.. బాలుడి ఆరోగ్యం కొంచెం క్రిటికల్‌గానే ఉందని అన్నారు. అలాగే సినిమా vs ప్రభుత్వం, సినిమా vs సమాజం, సినిమా vs జనం అనే విధంగా బయట చర్చ జరుగుతోందన్నారు. ఈ ఘటన తర్వాత విప్లవాత్మకమైన నిర్ణయాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటంతో అందరికీ నిజానిజాలు తెలిశాయన్నారు. పోలీసులు కూడా అన్ని అంశాలు క్లియర్‌గా చెప్పారన్నారు. ప్రభుత్వం, పోలీసులు చెప్పిన మాటలు వింటే, అల్లు అర్జున్ చెప్పిన వివరాలు నమ్మశక్యంగా లేవన్నారు.
Allu Arjun: ముగిసిన అల్లు అర్జున్ విచారణ.. మరోసారి..
సెన్సార్ బోర్డు పూర్తిగా ఫెయిల్
తొక్కిసలాటలో రేవతి చనిపోవడం చాలా భాధగా ఉందన్నారను. ఘటన జరిగిన వెంటనే థియేటర్ వద్ద శ్రీతేజ్‌కు పోలీసులు సీపీఆర్ చేయడమే బాబు బ్రతకడానికి కారణం అని డాక్టర్లు చెప్పారని తెలిపారు. ఒక్కప్పుడు సమాజాన్ని మార్చడానికి సినిమా ఉపయోగపడేదని.. అనేక నాట్యమండలిలో అనేక విషయం జనాలకు గతంలో కమ్యూనిస్టులు చెప్పేవారన్నారు. కమ్యూనిస్ట్ ప్రభావితం ఉన్న వారు అనేక మంచి సినిమాలు తీశారని.. అవి సమాజానికి బాగా ఉపయోగపడేవని తెలిపారు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, పేదవారిని హీరోగా చూపించేలా గతంలో సినిమాలు ఉండేవని... కానీ ఇప్పుడు మంచి పక్కకు పోయి విలనిజం హీరోలా చూపిస్తున్నారన్నారు. ఇప్పుడు వచ్చే సినిమాలు సమాజాన్ని ఎటు వైపు తీసుకెళ్తుందని ప్రశ్నించారు. ఇలాంటి సినిమాలు వస్తుంటే సెన్సార్ బోర్డు ఏం చేస్తోందని అడిగారు. సెన్సార్ బోర్డు పూర్తిగా ఫెయిల్ అయిందని విమర్శించారు. పెద్ద ప్రొడ్యూసర్స్ చేతుల్లో సెన్సార్ బోర్డు చిక్కుకుపోయిందన్నారు.
సినిమాకు వ్యతిరేకం కాదు.. కానీ
సినిమా అంటే డబ్బు అనేలా మారిందన్నారు. టికెట్ రూ.3000 లకు పెంచడం అంటే సామాన్య వ్యక్తి సినిమాకు వెళ్ళే పరిస్థితి ఉందా అని నిలదీశారు. ఇంత అధ్వానంగా సినిమాలు వస్తే, రెట్లు పెంచితే.. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని నిలదీశారు. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇస్తున్నారని.. మరి చిన్న సినిమాలకు ఎందుకు ప్రోత్సాహం ఇవ్వడం లేదని అన్నారు. సినిమా, ప్రొడ్యూసర్స్ ఒక మాఫియాలా తయారైందని వ్యాఖ్యలు చేశారు. సినిమాకు తాము వ్యతిరేకం కాదని, సినిమాకు బీజం వేసిందే కమ్యూనిస్టులని చెప్పుకొచ్చారు. చట్టాలను మార్చాలని.. అప్పుడే సామాన్యులు, చిన్న వారు బ్రతికే పరిస్థితి వస్తుందన్నారు. స్మగ్లింగ్, నేరాలు చేసే వారిని హీరోలా చూపించడం మానేయాలన్నారు. బౌన్సర్ల తీరు మరి అధ్వానంగా మారిందని... వారి వల్లే మొన్న సంధ్య థియేటర్‌లో ఈ ఘటన జరిగింది అనే చర్చ జరుగుతోందన్నారు. బౌన్సర్ల వ్యవస్థ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలను రక్షించడం పోలీసులు బాధ్యత అని అన్నారు. శ్రీతేజ్ కుటుంబానికి రూ.25 లక్షలు అల్లు అర్జున్ అనౌన్స్ చేశారని.. కానీ కేవలం రూ.10 లక్షలు ఇచ్చి, రూ.15 లక్షలు తర్వాత ఇస్తా అనడం ఏంటని ప్రశ్నించారు. ఈ సంధ్య థియేటర్ ఘటనను కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు.
రామారావును, ఇందిరా గాంధీని జైల్‌లో పెట్టారు..
ఈనెల 26 న 100వ సంవత్సరంలో కమ్యూనిస్టు పార్టీ అడుగుపెట్టబోతోందని.. 100 ఏళ్ల క్రితం కన్పూర్‌లో కమ్యూనిస్టు పార్టీ పెట్టిందని గుర్తుచేశారు. సంవత్సర కాలం కమ్యూనిస్టు పుట్టిన వేడుకలు జరపడంతో పాటు పేదవారికి ఏ విధంగా అండగా ఉంటామో, ఏ ఏ అంశాలపై పోరాటం చేయాలని అని నిర్ణయించుకుంటామన్నారు. కమ్యూనిస్టులు లేనిది భారత దేశ చరిత్ర లేదన్నారు. రెండు సీట్ల కోసం కమ్యూనిస్టులు వెంపర్లాడుతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపణలు చెయ్యడం కరెక్ట్ కాదన్నారు. ‘‘కమ్యూనిస్టులు తల్చుకుంటే మీరు ఎక్కడ ఉంటారు? మీతో పొత్తు ఉంటే కమ్యూనిస్టులు మంచి వారు, లేదు అంటే చెడ్డ వారు అంటే ఎలా?’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్టం ముందు అందరూ సమానులే అని.. అల్లు అర్జున్ అయినా.. ఇంకా ఎవరైనా అందరూ సమానమే అని అన్నారు. రామారావును, ఇందిరా గాంధీని జైల్‌లో పెట్టారని గుర్తు చేస్తూ.. తప్పు చేస్తే ఎవరైనా జైలు కు వెళ్లాల్సిందే అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
తెలంగాణ ఆత్మను వెండితెరపై ఆవిష్కరించిన దర్శకుడు
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 24 , 2024 | 03:56 PM