CPI Narayana: ఆ హక్కు సమంతకు మాత్రమే ఉంది: సీపీఐ నారాయణ..
ABN, Publish Date - Oct 12 , 2024 | 07:53 PM
అక్కినేని నాగార్జున, బిగ్ బాస్ షోపై సీపీఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: అక్కినేని నాగచైతన్య, సమంత విడాకులపై తెలంగాణ దేవాదాయ, పర్యాటక శాఖ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ వల్లే వారిద్దరూ విడాకులు తీసుకున్నారంటూ మంత్రి చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించాయి. దీనిపై అక్కినేని నాగార్జున తన కుటుంబం పరువు పోయేలా మంత్రి సురేఖ మాట్లాడారంటూ నాంపల్లి కోర్టులో పరువునష్టం దావా వేశారు. మరోవైపు కేటీఆర్ కూడా మంత్రిపై పరువు నష్టం దావా వేశారు. పలువురు సినీ ప్రముఖులు సైతం కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. దీంతో ఆమె తన మాటలు వెనక్కి తీసుకున్నప్పటికీ వివాదం మాత్రం చల్లారలేదు.
అయితే తాజాగా ఈ వివాదంలోకి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఎంట్రీ ఇచ్చారు. అక్కినేని నాగార్జున, బిగ్ బాస్ షోపై సంచలన ఆరోపణలు చేశారు. పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేయడం హాస్యాస్పదం అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సీపీఐ నారాయణ మాట్లాడుతూ.." పరువు లేని వ్యక్తి పరువు నష్టం దావా వేస్తారా?. బిగ్ బాస్ ద్వారా పరువు పోగొట్టుకున్న నాగార్జున.. కొండా సురేఖపై కోర్టులో దావా వేశారు. ఏదైనా ఉంటే కోర్టును సమంత ఆశ్రయించిన అర్థం ఉంటుంది గానీ.. బిగ్ బాస్ ద్వారా అన్ పాపులరైన నాగార్జున దావా వేయడమంటే దానికి అర్థమే లేదు. మంత్రి కొండా సురేఖ తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పారు. ఇంకా దాని గురించి కోర్టుకు పోవాల్సిన పని లేదు. అయినా సరే బిగ్ బాస్ ద్వారా అత్యంత అన్ పాపులరైన, పరువు పోగొట్టుకున్న నాగార్జున పరువు నష్టం దావా వేయడమంటే అదొక జోక్ తప్ప మరొకటి కానే కాదు" అని అన్నారు.
Updated Date - Oct 12 , 2024 | 07:54 PM