CS Shanti Kumari: మరో మూడ్రోజులపాటు వర్షాలు.. అప్రమత్తమైన అధికారులు..
ABN, Publish Date - Jul 22 , 2024 | 09:08 PM
తెలంగాణ రాష్ట్రంలో మరో మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం సమీక్షిస్తున్నారని, జిల్లాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మరో మూడ్రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అప్రమత్తం చేశారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరంతరం సమీక్షిస్తున్నారని, జిల్లాల్లో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్లను ఆమె ఆదేశించారు. ముందుగానే పునరావాస కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, అగ్నిమాపక శాఖ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ తదితర శాఖలు సమన్వయంతో పని చేసేలా చూడాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. డీజీపీ జితేందర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా సైతం సమీక్షలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండాయని అవి తెగకుండా తగు ముందస్తు చర్యలు చేపట్టాలని సీఎస్ ఆదేశించారు. ఇప్పటికే భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో NDRF బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పుకొచ్చారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. ఏదైనా అత్యవసర సహాయం కావాలంటే ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలని జిల్లా కలెక్టర్లకు శాంతి కుమారి తెలిపారు. ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, చెరువు కట్టలు తదితర ప్రాంతాల వద్ద అప్రమత్తంగా ఉండాలన్నారు. పారే వాగులను ఎవ్వరూ దాటకుండా ఆయా ప్రాంతాలలో తగు బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పారు. ఇప్పటికే జిల్లాల్లో దెబ్బతిన్న నివాస గృహాలు, ఇతర నష్టాలపై ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు.
రాష్ట్రంలోని పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు జిల్లా కలెక్టర్లతోపాటు ఇతర ప్రభుత్వ అధికారులతో సమన్వయంతో పనిచేస్తున్నట్లు సీఎస్‌కు డీజీపీ జితేందర్ తెలిపారు. ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని, పోలీస్ అధికారులందరూ క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు. ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మరో మూడ్రోజులపాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. అలాగే గంటకు 30నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు. భద్రాచలం వద్ద ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక ప్రకటించామని, 53అడుగులకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ సీఎస్‌కు చెప్పారు.
Updated Date - Jul 22 , 2024 | 09:08 PM