Harish Rao: గురుకుల పాఠశాలల్లో పరిస్థితులపై హరీష్‌రావు ఫైర్
ABN, Publish Date - Nov 05 , 2024 | 03:15 PM
Telangana: రాష్ట్రంలో గురుకుల పాఠశాలల్లో పరిస్థితిపై మాజీ మంత్రి హరీష్‌రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమ్స్‌లో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల విద్యార్థినిలను మాజీ మంత్రి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 5: నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గురుకుల పాఠశాల బాలికలను మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) మంగళవారం పరామర్శించారు. కొమరం భీం జిల్లా వాంకిడి మండల గిరిజన బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో ఫుడ్‌పాయిజన్‌తో 60 మంది బాలికలు అస్వస్థతకు గురవగా.. వారిలో ముగ్గురు విద్యార్థినిల పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా బాలికలను పరామర్శించారు మాజీ మంత్రి. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చికిత్స పొందుతున్న విద్యార్థినిల్లో ఒకరు వెంటీలేటర్‌పై చావుబతుకుల మధ్య కొట్టమిట్టాడుతున్నారని అన్నారు. ధైర్యంగా ఉండాలని విద్యార్థినిల తల్లిదండ్రులకు చెప్పానన్నారు. గత పదకొండు నెలల కాంగ్రెస్ పాలనలో తల్లిదండ్రుల నమ్మకాన్ని పోగొట్టే విధంగా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో పరిస్థితులు దిగజారిపోయాయని మండిపడ్డారు. గురుకుల పాఠశాలల్లో మౌలిక సదుపాయాలన కల్పనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లలో 36 మంది విద్యార్ధులు వివిధ కారణాలతో చనిపోయారన్నారు.
TG NEWS: కొనసాగుతున్న ఎమ్మెల్యే హరీష్ బాబు నిరాహార దీక్ష
ఆ తీరిక ప్రభుత్వానికి లేదు..
36 మంది విద్యార్థుల మరణాలు అంటే చిన్న విషయం కాదన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవాలన్నారు. దాదాపు 600 మంది విద్యార్థులు ఈ ఏడు నెలల్లో ఫుడ్ ఫాయిజనింగ్ బారిన పడ్డారని.. అంతేకాకుండా పాములు, ఎలుకల కాట్లకు గురవుతున్నారన్నారు. కరెంట్ షాక్‌లు కూడా కామన్ అయిపోయాయన్నారు. ఇటీవలనే మెదక్ హవేలీ ఘన్ పూర్ బాలికల రెసిడెన్షియల్ స్కూల్‌లో పిల్లలకు కరెంట్ షాక్ తగిలి హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చిందన్నారు. ఈ విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినప్పటికీ దున్నపోతు మీద వాన పడ్డట్లు సర్కార్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం, మంత్రులు మహారాష్ట్ర ,ఝార్ఖండ్ ఎన్నికల బిజీగా ఉన్నారని.. రెసిడెన్షియల్ స్కూళ్ల పై పట్టించుకునే తీరిక వారికి లేదన్నారు. రెసిడెన్షియల్ ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితిపై అప్పటికప్పుడు చర్యలు తీసుకోవడం కాదు.. శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. 36 మంది రెసిడెన్షియల్ విద్యార్థుల మరణాలు ప్రభుత్వం చేసిన హత్యలే అని ఆరోపించారు. ఈ మరణాలపై ప్రభుత్వంలో ఏ స్థాయిలోనూ సమీక్షలు జరగడం లేదన్నారు.
కేసీఆర్ హయాంలో ఇలా..
కేసీఆర్ హాయాంలో 1023 ప్రభుత్వ గురుకులాలు ఏర్పాటు అయ్యాయని తెలిపారు. ప్రతి విద్యార్ధిపై సంవత్సారానికి లక్షా 20 వేల రూపాయలు కేసీఆర్ వెచ్చించారని తెలిపారు. కేసీఆర్ హయాంలో రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివిన విద్యార్థులు అత్యున్నత సంస్థల్లో అడ్మిషన్లు పొందారన్నారు. డాక్టర్లు, ఇంజినీర్లు పైలట్‌లు, ఐఏఎస్, ఐపీఎస్‌లు అయ్యారన్నారు. ఎవరెస్టుతో పాటు ప్రపంచంలో ఉన్న పేరు ప్రఖ్యాతులు ఉన్న పర్వత శిఖరాలను అధిరోహించారని చెప్పుకొచ్చారు. కేసీఆర్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఎవరెస్టు స్థాయికి పెంచితే.. రేవంత్ రెడ్డి రెసిడెన్షియల్ స్కూళ్లలో ఎలుకలు విద్యార్థులను కరిచే స్థాయికి తీసుకుపోయారని ఎద్దేవా చేశారు. రెసిడెన్షియల్ స్కూళ్లకు కూడా రేవంత్ రెడ్డి రాజకీయ రంగు పులిమారని విమర్శించారు.
YS Sharmila: విద్యుత్ చార్జీలపై వైఎస్ షర్మిల ఫైర్
ఇదేనా మీ విధానం..
‘‘ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు శంఖుస్థాపనలు చేశారని.. వాటిని కట్టేదాకా ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లను గాలికి వదిలేయడం మీ విధానమా’’ అని ప్రశ్నించారు. ప్రభుత్వం ప్రతీ విద్యార్ధిపై పెట్టే పెట్టుబడి రాష్ట్ర భవిష్యత్‌పై పెట్టే పెట్టుబడిగా ఈ ప్రభుత్వం భావించాలన్నారు. గురుకులాలను నడపడం గురుతర భాద్యతగా భావించాలే తప్ప గుడ్డెద్దు చేలో పడ్డట్టు వ్యవహరించొద్దంటూ హితవుపలికారు. గురుకులాలను సమీక్షించేందుకు గతంలో సెంట్రల్ కమాండ్ సిస్టం ఉండేదని.. ఇప్పుడు అలాంటి కమాండ్ సిస్టం లేదన్నారు. విద్యార్థులు జబ్బు పడితే కనీస మందులు అందుబాటులో లేవన్నారు. విద్యార్థులు పడుకునేందుకు కనీసం మంచాలు లేవన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కి రెసిడెన్షియల్ స్కూళ్లపై సదభిప్రాయం లేదని ఇటీవల చేసిన వ్యాఖ్యలను భట్టి తెలుస్తోందన్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్లను మూసివేసే కుట్ర జరుగుతోందనే అనుమానం వస్తోందన్నారు. రాజకీయాల జోలికి పోకుండా ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని.. భేషజాలకు పోకుండా రెసిడెన్షియల్ స్కూళ్లకున్న పేరును పాడు చేయొద్దని మాజీ మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao: రాహుల్.. అశోక నగరానికి వెళ్లండి
Read Latest Telangana News And Telugu News
Updated Date - Nov 05 , 2024 | 03:31 PM