Harish Rao: కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టినా.. వారి ట్రాప్‌లో పడం
ABN, Publish Date - Jan 26 , 2024 | 09:00 PM
తాము అధికారంలో ఉన్నప్పుడు విచారణలు చేసి ఉంటే ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. శుక్రవారం నాడు మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు.
సిద్దిపేట: తాము అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నేతలపై విచారణలు చేసి ఉంటే.. వారిపై తాము ఎన్ని కేసులు పెట్టి ఉండేవాళ్లమని మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. శుక్రవారం నాడు మాజీ సీఎం కేసీఆర్ ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఫాం హౌస్ నుంచి ఒక్కొక్కరుగా నేతలు వెళ్లిపోతున్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, కేశవరావు, ఎంపీలు నామా నాగేశ్వరరావు, మాలోత్ కవిత, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో చర్చించిన వివరాలను నేతలు మీడియాకు వివరించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షాలు, ప్రత్యర్థులపై దాడుల గురించి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆలోచించలేదని.. ప్రజల కష్టాలు ఎలా తీర్చాలన్న విషయంపై మాత్రమే తాము ఆలోచించినట్లు తెలిపారు. ప్రతిపక్షాలపై ఎలా బురద జల్లాలి.. ప్రజల్లో వారిని ఎలా బద్నాం చేయాలన్న విషయమై కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టి సారించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు రెచ్చగొట్టినా తాము వారి ట్రాప్‌లో పడం. ప్రజల పక్షాన పోరాడుతామని హరీశ్ రావు తెలిపారు.
కేసీఆర్‌పై వారు మాట్లాడే బాష సరిగా లేదు
ప్రభుత్వానికి విపక్షాలను కలుపుకొని పోయే తత్వం ఉండాలని.. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేలా ఉండాలన్నారు. కాంగ్రెస్ నేతలు ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ అహంకార పూరిత వైఖరిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. హామీల అమలు గురించి అడిగితే తమపై విమర్శలు చేస్తున్నారని దుయ్యబట్టారు.కాంగ్రెస్ నేతలు ఇచ్చిన హామీలను గుర్తు చేస్తే కాంగ్రెస్ నేతలు అసహనాన్ని వెళ్లగక్కుతున్నారని చెప్పారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతలపై బురద జల్లాలనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తునే ఉంటారని తెలిపారు. ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడే భాష, వ్యవహరిస్తున్న తీరును సమాజం గమనిస్తోందన్నారు. కాంగ్రెస్ఇచ్చిన హామీలను పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాక ముందే నెరవేర్చాలని డిమాండ్ చేశారు. 420 హామీలు ఇచ్చారు... అమలు చేయండి, ఎప్పుడు చేస్తారో చెప్పాలని హరీశ్ రావు ప్రశ్నించారు.
Updated Date - Jan 26 , 2024 | 09:00 PM