Hyderabad: హైదరాబాద్ పోలీసుల నయా రూల్స్.. మతపరమైన కార్యక్రమాల్లో డీజేలు పెడితే..
ABN, Publish Date - Oct 01 , 2024 | 02:49 PM
మతపరమైన కార్యక్రమాల్లో డీజేలను నిషేధిస్తూ హైదరాబాద్ పోలీసులు హుకుం జారీ చేశారు. అయితే సౌండ్ సిస్టమ్‌లను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్: నగరంలో డీజేలపై నిషేధం విధిస్తూ హైదరాబాద్ పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. నగర పరిధిలో ఇకపై మతపరమైన ర్యాలీల్లో ఎలాంటి డీజేలనూ ఉపయోగించకూడదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. భారీ శబ్దాలతో డీజేలు పెట్టి సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వస్తున్న ఫిర్యాదుల నేపథ్యంలో ఈ మార్గదర్శకాలు జారీ చేశారు. అయితే సౌండ్ సిస్టమ్‌లను మాత్రం పరిమిత స్థాయిలో అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. సౌండ్ సిస్టమ్ పెట్టడానికి కూడా పోలీస్ క్లియరెన్స్ తప్పనిసరని స్పష్టం చేశారు. నాలుగు జోన్లలో సౌండ్ సిస్టమ్‌లు పెట్టడానికి డెసిబిల్స్‌ను నిర్దేశిస్తూ కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు.
జనావాసాల ప్రాంతంలో ఉదయం 55 డెసిబెల్స్‌కు మించి పెట్టరాదని తెలిపారు. అలాగే రాత్రి వేళల్లో 45డెసిబెల్స్‌కు మించరాదని హుకుం జారీ చేశారు. మతపరమైన ర్యాలీల్లో బాణసంచా కాల్చడం పూర్తిగా నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎవరైనా డీజేలు పెట్టినా, సౌండ్ సిస్టమ్స్ పరిమితికి మించి పెద్దపెద్ద శబ్దాలతో హంగామా చేసినా ఐదు సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.లక్షల జరిమానా విధిస్తామని తెలిపారు. పదే పదే నిబంధనలు ఉల్లంఘిస్తే రోజుకు రూ.5వేల చొప్పున జరిమానా విధిస్తామని నగర పోలీసులు హెచ్చరించారు.
వినాయక చవితి, దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు సహా బత్తుకమ్మ వంటి పండగలకు డీజేలు పెట్టడం అనేది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. అయితే దీని వల్ల కొంత మంది ఇబ్బందులకు గురవుతున్నారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలు భారీ శబ్దాల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. ముఖ్యంగా అనారోగ్య సమస్యలు ఉన్నవారు పరిమితికి మించిన శబ్దాలతో తీవ్ర అవస్థలు పడుతున్నారని తెలిపారు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, వినికిడి సమస్యలు, అలాగే ఆస్పత్రుల్లో ఉన్న రోగులు సైతం భారీ శబ్దాలతో చాలా ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. విద్యాసంస్థలు సైతం ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. అందుకే డీజేలను నిషేధిస్తున్నట్లు తెలిపారు. సౌండ్ సిస్టమ్‌లు మాత్రం పరిమితి మించకుండా వాడుకోవచ్చని చెప్తున్నారు. నిబంధనలు అతిక్రమించకుండా ఆహ్లాదకరమైన వాతారవణంలో పండగులు నిర్వహించుకోవాలని హైదరాబాద్ పోలీసులు చెప్తున్నారు.
ఇవి కూడా చదవండి...
Hydra: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ
Musi: మూసీ పరివాహక ప్రాంతాల్లో కూల్చివేతలు షురూ
Read Latest Telangana News And Telugu News
Updated Date - Oct 01 , 2024 | 02:50 PM