సీబీఐ కస్టడీకి కవిత
ABN , Publish Date - Apr 13 , 2024 | 02:48 AM
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న కవితను మూడు రోజులు కస్డడీకి తీసుకుని విచారించేందుకు సీబీఐకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది....
3 రోజులు విచారించేందుకు కోర్టు అనుమతి
15న తిరిగి హాజరు పరచాలని ఆదేశం
సీబీఐ కస్టడీలోనూ ఆమెకు ప్రత్యేక వసతులు
సోదరుడు కేటీఆర్‌ను కలిసేందుకు అనుమతి
కేసే లేదు.. విచారణేం చేస్తారన్న కవిత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి తిహాడ్ జైలులో ఉన్న కవితను మూడు రోజులు కస్డడీకి తీసుకుని విచారించేందుకు సీబీఐకి న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను గురువారం అరెస్టు చేస్తున్నట్టు సీబీఐ తెలిపింది. ఈ మేరకు కవిత భర్త అనిల్‌కు సమాచారం అందించింది. శుక్రవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను సీబీఐ ప్రవేశ పెట్టింది. కవితను ఈ నెల 6న తిహాడ్ జైలులోనే విచారించామని, ఆమె విచారణకు సహకరించలేదని సీబీఐ తరఫున ప్రత్యేక న్యాయవాది కోర్టుకు తెలిపారు. మద్యం వ్యాపారులను, అరవింద్ కేజ్రీవాల్‌కు కలిపిందే కవిత అని, కేసులో కవిత కీలక సూత్రధారి, పాత్రధారి అని, అందుకే కవిత స్టేట్‌మెంట్ రికార్డు చేయాల్సి ఉందని చెప్పారు. కవితను 5 రోజుల కస్టడీకి అనుమతి ఇవ్వాలని కోరారు. కవిత తరఫున న్యాయవాది విక్రమ్ చౌదరి వర్చువల్‌గా వాదనలు వినిపించారు. కవితను సీబీఐ విచారణకు అనుమతి ఇవ్వడంపై పిటిషన్ పెండింగ్‌లో ఉందని, అటువంటి సమయంలో ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. కవితను విచారించాలనుకుంటే ముందే సమాచారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు ఉన్నాయని, వాటిని సీబీఐ పట్టించుకోలేదని చెప్పారు. దీనికి సీబీఐ తరఫున న్యాయవాది అభ్యంతరం తెలిపారు. ఒకరోజు ముందే సమాచారం ఇచ్చామని చెప్పారు. కవితను అరెస్టు చేసిన విషయం భర్తకు గురువారం మధ్యాహ్నం మెసేజ్ చేశామని వెల్లడించారు. కోర్టు అనుమతితోనే కవితను అరెస్టు చేసినట్టు సీబీఐ తరఫు న్యాయవాది తెలిపారు. సీబీఐ రిమాండ్ రిపోర్టులు, ప్రస్తావించిన విషయాలు చాలా పాతవని, వాటి ఆధారంగా అరెస్టు చేయాల్సిన అవసరం విక్రమ్ చౌదరి ఏముందని ప్రశ్నించారు. వాదనలు విన్న న్యాయమూర్తి కావేరి భవేజా సీబీఐ ప్రశ్నించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌తో పాటు, అరె్‌స్టను సవాల్ చేస్తూ దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేశారు. కవితను 3 రోజలు సీబీఐ కస్టడీకి అనుమతి ఇస్తూ తీర్పు వెల్లడించారు. ఆమెను ఈ నెల 15న కోర్టులో హాజరుపరచాలని సీబీఐని ఆదేశించారు.
అసలు కేసే లేదు... విచారణ ఏం చేస్తారు?
కోర్టు హాలు లోపలికి వచ్చేటప్పుడు, బయటికి వెళ్లేటప్పుడు కవిత మీడియాతో మాట్లాడారు. ‘‘సీబీఐ అరెస్టు అక్రమం. సీబీఐ చేస్తున్నది తప్పు. అసలు కేసే లేదు. విచారణేం చేస్తారు?’’ అన్నారు. కోర్టు లోపల కూడా కవిత తన వాదనను న్యాయమూర్తి ఎదుట వినిపించారు. నిబంధనలను అనుసరించే కవితను అరెస్టు చేశామని సీబీఐ తరఫున న్యాయవాది కోర్టులో తెలిపినప్పుడు కవిత అభ్యంతరం తెలిపారు. సీబీఐ చెబుతున్నట్టు తన అరెస్టుపై ముందస్తు సమాచారం ఇవ్వలేదన్నారు. బుధవారం రాత్రి 10.30 నిమిషాలకు సీబీఐ తనను అరెస్టు చేసే అవకాశం ఉందని జైలు సిబ్బంది ద్వారా చూచాయగా సమాచారం అందిందని పేర్కొన్నారు. గురువారం ఉదయం తనను సీబీఐ అరెస్టు చేసిందని, దీనిపై న్యాయ సలహా తీసుకుంటానని, తన న్యాయవాదులతో మాట్లాడేందుకు అనుమతివ్వాలని జైలు అధికారులను కోరారనని తెలిపారు. రోజూ తన భర్తతో 5 నిమిషాలు మాట్లాడేందుకు కోర్టు అనుమతి ఉందని, అందుకే గురువారం ఈ విషయాన్ని తన భర్తకు తెలియజేశానని వెల్లడించారు.
అనిల్, కేటీఆర్‌లకు అనుమతి
కవితను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నుంచి సాయంత్రం నేరుగా సీబీఐ కార్యాలయానికి తీసుకెళ్లారు. మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీలో ఉండనున్న కవితను రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య నలుగురు కలిసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత న్యాయవాది మోహిత్‌రావుతో ప్రతి రోజూ 30 నిమిషాలు భేటీ కావొచ్చని ఉత్తర్వుల్లో న్యాయమూర్తి తెలిపారు. కవిత భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, వ్యక్తిగత సహాయకుడు శరత్ రోజూ 15 నిమిషాల పాటు కవితను కలిసి మాట్లాడవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రోజూ ఇంటి భోజనం చేసేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత కోరిక మేరకు సీబీఐ కస్టడీలో ఉండే మూడు రోజులు జపమాల, దుస్తులు, పరుపు, దుప్పట్లు, దిండు, టవల్స్ ఉంచుకొనేందుకు అనుమతి ఇచ్చింది. ప్రతి 48 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు నిర్వహించాలని చెప్పింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం సీసీ కెమెరాల పర్యవేక్షణలోనే కవితను విచారించాలని సీబీఐని కోర్టు ఆదేశించింది.