Formula E race: ఫార్ములా ఈరేస్ కేసులో కీలక పరిణామం
ABN, Publish Date - Dec 25 , 2024 | 10:11 AM
Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో ఫిర్యాదుదారుడు దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణను ప్రారంభించనున్నారు. దాన కిషోర్ నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి దానకిషోర్ వివరణ ఇచ్చారు.
హైదరాబాద్, డిసెంబర్ 25: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ (Formula E Race Case) కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఫార్ములా కేసులో ఫిర్యాదుదారుడు దాన కిషోర్ స్టేట్‌మెంట్‌ను ఏసీబీ (ACB) రికార్డు చేసింది. దాదాపు ఏడు గంటల పాటు ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది ఏసీబీ. దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు విచారణను ప్రారంభించనున్నారు. దాన కిషోర్ నుంచి పలు కీలకమైన డాక్యుమెంట్లను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. ఫార్ములా ఈ రేస్ కేసుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వానికి దానకిషోర్ వివరణ ఇచ్చారు. మాజీ మంత్రి కేటీఆర్ (Former Minister KTR) ఆదేశాల మేరకే డబ్బులు బదిలీ చేసినట్లు వెల్లడించారు. తన పరిధిలో ఉన్న హెచ్ఎండీఏ ద్వారా ఎస్‌ఈఓకు డబ్బులు బదిలీ చేసినట్లు తెలిపారు. 55 కోట్ల రూపాయల నగదును ఏపీవోకు బదిలీ చేసినట్లు దానకిషోర్ పేర్కొన్నారు. ఫిర్యాదుదారుడు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా విచారణ చేయనున్న ఏసీబీ.. త్వరలో మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వనున్నారు.
కాగా.. ఫార్ములా ఈరేస్ కేసులో ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంలో ఆయా శాఖల ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించి.. నగదు బదిలీలో అవకతవకలు నిర్ధారణకు వచ్చిన ఏసీబీ ముగ్గురిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఏ1గా కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా ప్రైవేటు కంపెనీ సీఈవో పేరును చేర్చింది. ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కేసును క్వాష్ చేయాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో మాజీ మంత్రి కేటీఆర్‌కు స్వల్ప ఊరట లభించింది. ఎలాంటి అరెస్ట్ చేయవద్దంటూ గత విచారణలో న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఏసీబీ అధికారులకు చేరింది. దీంతో ఫిర్యాదుదారుడు దాన కిషోర్‌ను ఏసీబీ అధికారులు విచారించి.. ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసుకున్నారు. దాన కిషోర్ స్టేట్‌మెంట్ తరువాత తొలుత ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను, ఆ తరువాత మాజీ మంత్రి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది. మరోవైపు తమ పరిధిలో ఉన్న హెచ్‌ఎండీఏ ద్వారానే ఎస్‌ఈవోకు దాదాపు రూ.55 కోట్ల నగదును బదిలీ చేశామని ఏసీబీ ముందు దానకిషోర్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అయితే ఆర్థికశాఖ అనుమతి పొందకుండా, కేబినెట్ నిర్ణయాలు తీసుకోకుండా ఎలా డబ్బులను రిలీజ్ చేశారని దానకిషోర్‌ను ఏసీబీ క్వశ్చన్ చేయగా.. కొంత రాజకీయ ఒత్తిళ్లతో పాటు, స్వయంగా కేటీఆర్ ఆదేశాల మేరకు నగదును విడుదల చేసినట్లు దానకిషోర్ చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే ఈకేసు తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చే సమయంలో దానకిషోర్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను కోర్టు ముందు ఉంచాలని ఏసీబీ భావిస్తున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి...
హైదరాబాద్‌లో ఒక్కసారిగా మారిన వాతావరణం
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 25 , 2024 | 10:52 AM