KTR: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై కేటీఆర్ కామెంట్స్..

ABN, Publish Date - Oct 17 , 2024 | 09:19 AM

సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘పైసా పనిలేదు - రాష్ట్రానికి రూపాయి లాభం లేదు.. 10నెలలు - 25 సార్లు - 50రోజులు.. పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు కొత్తగా చేసింది అసలే లేదు..అయినను పోయి రావాలె హస్తినకు’ అంటూ కామెంట్స్ చేశారు.

KTR: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్‌పై కేటీఆర్ కామెంట్స్..

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఢిల్లీ టూర్‌ (Delhi Tour)పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ (BRS Leader KTR) సోషల్ మీడియా (Social Media) ఎక్స్ (X) వేదికగా కామెంట్స్ (Comments) చేశారు. ‘‘పైసా పనిలేదు - రాష్ట్రానికి రూపాయి లాభం లేదు.. 10నెలలు - 25 సార్లు - 50 రోజులు.. పోను 25 సార్లు, రాను 25 సార్లు, నీ ఢిల్లీ పెద్దల చుట్టూ ప్రదక్షిణలు చేసి సిల్వర్ జూబ్లీ కూడా చేస్తివి. తట్టా మట్టి తీసింది లేదు.. కొత్తగా చేసింది అసలే లేదు.. అయినను పోయి రావాలె హస్తినకు..


అన్నదాతల అరిగోసలు.. గాల్లో దీపాల్లా గురుకులాలు.. కుంటుపడ్డ వైద్యం.. గాడి తప్పిన విద్యా వ్యవస్థ.. అయినను పోయి రావాలె హస్తినకు.. మూసి పేరుతో - హైడ్రా పేరుతో పేదోళ్ల పొట్టలు కొట్టి - 420 హామీలను మడతపెట్టి మూలకు వేసి.. అయినను పోయి రావాలె హస్తినకు.. పండగలు పండగళ్ళా లేవు.. ఆడబిడ్డల చీరలు అందనేలేవు.. అవ్వా తాతలు అనుకున్న పింఛను లేదు.. తులం బంగారం జాడనే లేదు.. స్కూటీలు లేవు.. కుట్టు మిషిన్లు లేవు.. అయినను పోయి రావాలె హస్తినకు’’ అంటూ కేటీఆర్ విమర్శలు చేశారు.

కాగా పేదల ఇళ్లు కూల్చి.. బిల్డర్లు, వ్యాపారవేత్తలను భయపెట్టి డబ్బు వసూళ్ల కోసమే రేవంత్‌ సర్కార్‌ హైడ్రా తెచ్చిందని కేటీఆర్‌ ఆరోపించారు. పేదలకు తాము అండగా ఉంటామని, క్షేత్రస్థాయిలో పర్యటించి.. బస్తీలు, కాలనీల్లోని వారి భరోసా కల్పిస్తామన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో హైదరాబాద్‌కు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘అక్రమ నిర్మాణమైతే.. నా ఫాంహౌ్‌సను కూల్చేయండి.. ఉన్నవాళ్ల ఇళ్లను కూల్చండి.. తప్ప.. హైడ్రా పేరుతో పేదల ఇళ్లుకూల్చి వారిని రోడ్డుపాలు చేయొద్దు’ అని అన్నారు.


రాష్ట్రం దివాలా తీసిందని ప్రచారం చేస్తూ.. తెలంగాణ పట్ల అందరూ నమ్మకం కోల్పోయేలా.. రేవంత్‌రెడ్డి అసమర్థ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. దిక్కుమాలిన పాలనవల్ల హైదరాబాద్‌ రియల్‌ ఎస్టేట్‌ పడిపోయిందన్నారు. లక్షన్నర కోట్లతో చేపడుతున్న మూసీ సుందరీకరణ వెనుక భారీ కుంభకోణం ఉందని, దానికోసం నిధులు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. నగరంలో చాలాచోట్ల కాంగ్రెస్‌ హయాంలో అనుమతులిచ్చి.. ఇప్పుడు కూల్చుతున్నారని డిప్యూటీ సీఎం భట్టికి తెలియదా? అని ప్రశ్నించారు.

వికారాబాద్‌ జిల్లాలో రేడార్‌ స్టేషన్‌ పనులకు శంకుస్థాపన సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం రేవంత్‌ రెడ్డిచేసిన ప్రసంగం ఆశ్చర్యం కలిగించిందని కేటీఆర్‌ అన్నారు. ఆయన కాంగ్రెస్‌ ముఖ్యమంత్రేనా? లేక బీజేపీలో ఉన్నారా? అర్థం కావడంలేదన్నారు. ఉన్నట్టుండి ఆయనకు దేశరక్షణ గుర్తొచ్చిందని, గతంలో ఆయన ఆర్మీలో ఏమైనా పనిచేశారా? అంటూ ఎద్దేవా చేశారు. రేడార్‌ స్టేషన్‌తో స్థానికులకు ఒక్క ఉద్యోగం కూడా రాదని.. పర్యావరణానికి నష్టం కలిగించే ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వడం తగదన్నారు. పర్యావరణ హితం కోసమే.. నేవీ రేడార్‌ స్టేషన్‌ ఏర్పాటుకు కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా.. గతంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం స్థలం కేటాయించలేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

మోహిని అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్న చిన వెంకన్న

పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

దక్షిణకోస్తా, రాయలసీమలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Oct 17 , 2024 | 09:19 AM