KTR: దేనికి విజయోత్సవాలు.. కాంగ్రెస్‌పై కేటీఆర్ ఫైర్...
ABN, Publish Date - Nov 28 , 2024 | 08:18 AM
దేనికి విజయోత్సవాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్, మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రైతును నిండా ముంచినందుకా.. వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా.. ప్రభుత్వం గుడ్డి గుర్తులు, కాకి లెక్కలు, కల్లబొల్లి కబుర్లతో ఎల్లకాలం కాలం వెళ్లదీయలేదని.. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ (BRR Working President), మాజీ మంత్రి కేటీఆర్ (Ex Minister KTR) సోషల్ మీడియా ఎక్స్ (X) వేదికగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం (Revanth Reddy Govt.,)పై ఫైర్ (Fire) అయ్యారు. ‘సిగ్గు లేదా జీడిగింజా అంటే-నల్లగున్న నాకేం సిగ్గు అన్నదంట’.. రైతు భరోసాకు ఎగనామం పెట్టి.. రుణమాఫీ పేరుతో పంగనామాలు పెట్టి.. పంటల కొనుగోళ్లకు శఠగోపం పెట్టి.. ధాన్యానికి క్వింటాలుకు రూ.500 బోనస్ ఎగ్గొట్టిందని ఆరోపించారు. దిలావర్ పూర్‌లో దమనకాండ సృష్టించి.. రామన్నపేటను రావణకాష్టం చేసి.. లగచర్ల రైతులను జైలుపాలు చేసి అల్లుడి కళ్ళలో ఆనందం చూసినందుకా.. అని ప్రశ్నించారు.
రైతు పండుగలా.. ఎందుకు.. పండుగలు మీకు-పస్తులు రైతులకని.. చెప్పింది బారాణ-చేసింది చారాణ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు. రైతులు కల్లాల్లో ధాన్యం పోసి కళ్లల్లో వత్తులు వేసుకొని కొనుగోళ్ల కోసం ఎదురుచూస్తున్నారని అన్నారు. నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి కొనుగోళ్లు చేపట్టకపోవడంతో అడ్డికి పావుశేరు లెక్కన దళారులకు అమ్ముకుంటున్నారని ఆవేదన వ్కక్తం చేశారు. అబద్దానికి అంగీ, లాగు తొడిగితే అది కాంగ్రెస్ సర్కార్ అని అన్నారు.
దేనికి విజయోత్సవాలు చేస్తున్నారని కాంగ్రెస్‌ను ఉద్దేశించి కేటీఆర్ ప్రశ్నించారు. రైతును నిండా ముంచినందుకా.. వ్యవసాయాన్ని ఆగం చేసినందుకా.. ప్రభుత్వం గుడ్డి గుర్తులు, కాకి లెక్కలు, కల్లబొల్లి కబుర్లతో ఎల్లకాలం కాలం వెళ్లదీయలేదని.. జాగో తెలంగాణ జాగో అంటూ కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు.
కాగా రాష్ట్రంలోని గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో చోటుచేసుకుంటున్న వరుస మరణాలు, విషాద ఘటనల నేపథ్యంలో అక్కడి పరిస్థితులు తెలుసుకునేందుకు గురుకుల బాట పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టనున్నట్లు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ నెల 30 నుంచి డిసెంబరు 7 వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకుగాను ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో అయిదుగురు సభ్యులతో అధ్యయన కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయనతోపాటు సభ్యులుగా ఆంజనేయులు గౌడ్, ఎర్రోళ్ల శ్రీనివాస్, రాజారామ్ యాదవ్, వాసుదేవరెడ్డి ఉంటారన్నారు.
బాలికల విద్యా సంస్థలను పార్టీ తరఫున మహిళా నాయకులు సందర్శిస్తారన్నారు. అక్కడి స్థితిగతులు, సౌకర్యాలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, చేపట్టాల్సిన చర్యలపై ఈ కమిటీ అధ్యయనం చేసి నివేదిక ఇస్తుందన్నారు. కమిటీ గుర్తించిన సమస్యలు, పరిష్కారాలను ప్రభుత్వానికి సూచిస్తామని, వెంటనే స్పందించకుంటే ఒత్తిడి తెచ్చేలా కార్యాచరణ రూపొందిస్తామన్నారు. తాము రాజకీయం చేయాలని ప్రయత్నించడం లేదని, కమిటీ నివేదికలోని అంశాలను శాసనసభలో లేవనెత్తుతామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జీజీహెచ్‌లో వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
స్థిరంగా కొనసాగుతున్న తీవ్రవాయుగుండం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News
Updated Date - Nov 28 , 2024 | 08:18 AM