Kunamneni Sambasiva Rao:కేటీఆర్ మతిస్థిమితం తప్పినట్టు మాట్లాడుతున్నారు
ABN, Publish Date - Jan 21 , 2024 | 04:37 PM
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్లకుంట్ల తారక రామారావు ( KTR ) మతిస్థిమితం తప్పినట్టు మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasiva Rao ) ఎద్దేవా చేశారు.
హనుమకొండ: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్లకుంట్ల తారక రామారావు ( KTR ) మతిస్థిమితం తప్పినట్టు మాట్లాడుతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ( Kunamneni Sambasiva Rao ) ఎద్దేవా చేశారు. ఆదివారం నాడు సీపీఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికార లేకపోయినా హుందాగా ఉండాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీ ఎప్పుడూ ఒకటి కావన్నారు. బీఆర్ఎస్సే బీజేపీకి మద్దతిస్తోందని చెప్పారు. ఎప్పటికైనా బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అవుతాయని చెప్పారు. ఎంఐఎం కాంగ్రెస్‌తో కలిస్తే తమకు అభ్యంతరం లేదన్నారు. బీఆర్ఎస్ నిరంకుశ విధానాలు ఇంకా పోవట్లేదని చెప్పారు. తాము తప్పితే ఎవరికీ పరిపాలన చేసే హక్కులేదన్నట్టుగా బీఆర్ఎస్ నేతలు వ్యవహారిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్‌లో లుకలుకలు ప్రారంభమయ్యాయని చెప్పారు. గులాబీ నేతలు ప్రజలు ఇచ్చిన తీర్పును అవమాన పరుస్తున్నారని మండిపడ్డారు. తానూ ప్రతిపక్ష పార్టీ నాయకుడినే అయినా బీఆర్ఎస్ పద్ధతి సరైంది కాదన్నారు. కరెంట్ బిల్లులు కట్టొద్దని కేటీఆర్ అనడం ప్రజాస్వామ్యమా...? అని కూనంనేని సాంబశివరావు ప్రశ్నించారు
ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ స్నేహ ధర్మం పాటించాలి
బీఆర్ఎస్ నేతలు పదేళ్లు అధికారంలో ఉండి డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని హామీ ఇచ్చారని అది ఏమైందని నిలదీశారు. కాళేశ్వరం, అవినీతి నుంచి బయటపడేందుకే బీఆర్ఎస్ నేతలు ఇలా విమర్శలు చేస్తున్నారన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ స్నేహ ధర్మం పాటించాలని కోరారు. తమకు ఒకటో, రెండో ఎంపీ స్థానాలు ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామని చెప్పారు. తమతో పొత్తుపెట్టుకోకపోవడం వల్ల ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ అధికారం కోల్పోయిందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌తోనే కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ గ్యారంటీలను వందరోజుల్లో అమలు చేయడం అంటే చట్టబద్దత రావడమని.. కొంచెం ఆలస్యంమైనా తప్పకుండా అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు కాకముందే కేటీఆర్ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ రామ జపం చేస్తున్నారని.. అయోధ్య రామమందిరం విషయంలో స్వామీజీలందరినీ పక్కకుబెట్టి బీజేపీ నేతలే అంతా తామన్నట్లుగా వ్యవహారిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని ఒక మతానికి నాయకుడిగా వ్యవహరించొద్దని.. మనది సెక్యులర్ దేశం అని... అందరినీ కలుపుకొని పోకుంటే మోదీ నరకానికి వెళ్తారని కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు.
Updated Date - Jan 21 , 2024 | 04:56 PM