Hyderabad: శ్రీతేజ్ కుటుంబానికి భారీ ఆర్థికసాయం ప్రకటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
ABN, Publish Date - Dec 21 , 2024 | 04:56 PM
సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు.
హైదరాబాద్: సంధ్యా థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న బాలుడు శ్రీతేజ్ కుటుంబానికి రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రూ.25 లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. అసెంబ్లీ సాక్షిగా తన కుమారుడు ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద రూ.25 లక్షల చెక్కును బాధిత కుటుంబానికి ఇవ్వనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి తెలియజేశారు. మరికాసేపట్లో ఆస్పత్రికి వెళ్లి బాలుడి తండ్రికి చెక్కు అందజేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి మంత్రి తెలుకోనున్నారు. అలాగే బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పనున్నారు.
సీఎం ఆగ్రహం..
కాగా, సంధ్యా థియేటర్ ఘటనపై తెలంగాణ అసెంబ్లీలో నేడు సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌పై ముఖ్యమంత్రి మండిపడ్డారు. నటుడు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ ఒక్కరోజు జైలుకు వెళ్లినందుకే సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పెద్దఎత్తున వెళ్లి పరామర్శించారని సీఎం ఆగ్రహించారు. కానీ తొక్కిసలాటలో గాయపడి మృతిచెందిన రేవతి కుటుంబాన్ని ఇంతవరకూ ఏ నేతా పరామర్శించలేదని సీఎం మండిపడ్డారు. రేవతి కుమారుడు శ్రీతేజ్ ఇప్పటికీ ప్రాణాలతో పోరాడుతున్నాడని రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అల్లు అర్జున్‌ను అరెస్టు చేస్తే విమర్శలు చేసిన వారంతా బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు ఎందుకు వెళ్లలేదని అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ఈ సందర్భంగా సినిమా ఇండస్ట్రీకి సీఎం మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇకపై టికెట్ ధరల పెంపు, బెనిఫిట్‌షోలు ఉండవని స్పష్టం చేశారు. తాను సీఎంగా ఉన్నంత కాలం అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం సినిమా వాళ్ల ఆటలు సాగనివ్వనని హెచ్చరించారు. సినిమా వాళ్లు వ్యాపారాలు చేసుకోవాలని, అంతేకాని మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడాలని చూస్తే ఊరుకోమని మండిపడ్డారు. అల్లు అర్జున్‌ను అరెస్టు చేయడంతో కొన్ని రాజకీయ పార్టీల నేతలు తనపై అనేక ఆరోపణలు చేశారని సీఎం మండిపడ్డారు. వారంతా పైశాచికత్వం ప్రదర్శించారని ఆగ్రహించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
KTR: రాజీనామా చేస్తా.. వాళ్లకు కేటీఆర్ సవాల్
Hyderabad: పుష్ప-2 హీరో, ప్రొడక్షన్ టీం, థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి..
Updated Date - Dec 21 , 2024 | 05:14 PM