Share News

Raghunandan: కాంగ్రెస్ సర్కార్‌పై ఎంపీ రఘునందన్ ఫైర్

ABN , Publish Date - Oct 30 , 2024 | 01:21 PM

Telangana: తెలంగాణ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పల్లె ప్రగతి నిధులను దారి మళ్లించారని మండిపడ్డారు. కేంద్రం నుంచి నిధులు కావాలని కానీ.. కేంద్ర పేరు చెప్పేందుకు మాత్రం మనసు రాదంటూ వ్యాఖ్యలు చేశారు.

Raghunandan: కాంగ్రెస్ సర్కార్‌పై ఎంపీ రఘునందన్ ఫైర్
MP Raghunandan Rao

హైదరాబాద్, అక్టోబర్ 30: రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా గ్రామాలు బాగుండాలని కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) అన్నారు. ఆరునెలల క్రితం 1200 కోట్ల రూపాయలు విడుదల చేసిందని తెలిపారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. గ్రామాల్లో పనులు పూర్తి చేసి బిల్లుల కో‌సం ఎదురు చూస్తున్నారని.. కేవలం 200 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేసి మిగిలిన నిధులు దారి మళ్లించారని మండిపడ్డారు. ఆ బిల్లులు ఇవ్వకపోవడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన రూ.600 కోట్లు పెండింగ్‌లో పడ్డాయన్నారు. పల్లె ప్రగతి నిధులు విడుదల చేయకుండా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకంతో పంచాయతీ సెక్రటరీలు కూడా సొంత డబ్బుతో పనులు చేయించారన్నారు.

CM Revanth: గిరిజన బాలికకు సీఎం రేవంత్ సాయం.. ఎందుకంటే


నిధులు కావాలి.. పేరు మాత్రం చెప్పరు

కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం రెకమండేషన్ మేరకు రూ.500 కోట్లు విడుదల చేసిందని.. నేషనల్ హెల్త్ మిషన్ కోసం 300 కోట్ల రూపాయలు విడుదల చేసిందని చెప్పారు. 5 - 6 వందల మందికి ఒక హెల్త్ సెంటర్ నిర్మాణం చేయాలని చెప్పిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్వాకంతో గ్రామాలలో జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం రెండు వేల కోట్ల రూపాయలు విడుదల చేసినా తెలంగాణ సర్కార్ వాటిని దారి మళ్లించిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు కావాలి కానీ కేంద్రం పేరు చెప్పేందుకు మనసు రాదంటూ మండిపడ్డారు. నియోజకవర్గానికి 3,500 ఇల్లు కట్టిస్తామని చెప్పిందని.. వాటిని కట్టేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు లేవని.. ఆ నిధులను కూడా అర్బన్ మిషన్ కింద సేకరిస్తోందన్నారు. వాటిని ఎవరు పంచాలనేది దానిపై కొట్లాట మొదలైందన్నారు. కలెక్టర్‌లతో కాకుండా గ్రామాల్లో కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదుగా ఆ నిధులు అందజేస్తామని చెబుతున్నారన్నారు.

Petrol Prices: ఆయిల్ కంపెనీలు కీలక నిర్ణయం.. తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు


ఏ బాంబు పేలుస్తారో చూస్తాం

మునిసిపాలిటీలలో 250 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం తాగునీటి కోసం విడుదల చేసిందన్నారు. ‘‘మా పైసలు తీసుకుని మా భాగస్వామ్యం లేకుండా ఇళ్లను పంచిపెడితే కచ్చితంగా అడ్డుకుంటాం. ఇందిరమ్మ కమిటీలు చెల్లుబాటు కావు. ప్రతి స్కీంకు ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు పెట్టే భావదారిద్ర్యం ఉంది. మూసీ శుద్ధి, సుందరీకరణకు మేం వ్యతిరేకం కాదు . అభివృద్ధి పేరుతో కార్పోరేట్ కంపెనీలకు పనులు అప్పజెబితే మాత్రం వ్యతిరేకిస్తాం. మూసీకి కొండ పోచమ్మ సాగర్ నుంచి నీరు తెస్తే 1500 కోట్ల రూపాయలు ఖర్చవుతాయి. మల్లన్న సాగర్ నుంచి నీరు తెస్తే 7వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. పేదోళ్లు కట్టిన ఇంటి వద్ద 50 మీటర్ల దూరం అభివృద్ధి చేస్తాం అంటున్నారు. మూసీ అభివృద్ధిలో క్విడ్ ప్రోక్రో ఉన్నట్లు అనుమానం ఉంది. ప్రజలు బీఆర్ఎస్‌కు సీఆర్ఎస్ ఇచ్చారు.. వారిని ఫాం హౌస్‌లకు పరిమితం చేశారు. పేదోళ్లకు కట్టించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులైనా ఇస్తుంది. కుక్కతోక పటాకులు పేలుస్తారా .. సుతీల్ బాంబు పేలుస్తారా చూడాలి. అదిపేలుస్తాం ఇది పేలుస్తాం అని బ్రేకింగ్ ప్లేట్ల కోసం మాట్లాడకుండా అవినీతిపరులను అరెస్టు చేస్తే మేం స్వాగతిస్తాం’’ అని ఎంపీ రఘునందర్ రావు వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

నాకు బిర్యానీ పెట్టండి

Penny Stock: లక్ష పెట్టుబడితో 4 నెలల్లోనే రూ. 670 కోట్లు.. దేశంలోనే ఖరీదైన స్టాక్‌గా రికార్డ్

Read Latet Telangana News And Telugu News

Updated Date - Oct 30 , 2024 | 01:26 PM