Operation Muskaan: ఆపరేషన్ ముస్కాన్.. 326మంది చిన్నారులు సురక్షితం..
ABN, Publish Date - Aug 02 , 2024 | 03:07 PM
ఆటపాటలతో హాయిగా ఆడుకోవాల్సిన చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన వయస్సులో పనిముట్లు పట్టుకుంటూ సంతోషాలకు దూరం అవుతున్నారు. పరిశ్రమలు, హోటళ్లు, ఇటుక బట్టీల్లో పని చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి వారిని రక్షించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్‌ను చేపట్టింది. అలాగే బాల్య వివాహాలు నిర్మూలించేందుకు సైతం ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో బాధిత చిన్నారులను రక్షించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
హైదరాబాద్: ఆటపాటలతో హాయిగా ఆడుకోవాల్సిన చిన్నారులు బాల కార్మికులుగా మారుతున్నారు. పుస్తకాలు పట్టాల్సిన వయస్సులో పనిముట్లు పట్టుకుంటూ సంతోషాలకు దూరం అవుతున్నారు. పరిశ్రమలు, హోటళ్లు, ఇటుక బట్టీల్లో పని చేస్తూ శ్రమ దోపిడీకి గురవుతున్నారు. ఇలాంటి వారిని రక్షించేందుకే తెలంగాణ ప్రభుత్వం ఆపరేషన్ ముస్కాన్‌ను చేపట్టింది. అలాగే బాల్య వివాహాలు నిర్మూలించేందుకు సైతం ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీంతో బాధిత చిన్నారులను రక్షించి వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది.
326మంది చిన్నారులు సురక్షితం..
అయితే తాజాగా రాచకొండ పోలీస్ కమిషరేట్ స్టేషన్ పరిధిలో పోలీసులు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, విద్యాశాఖ, కార్మిక, వైద్యారోగ్య శాఖల ఆధ్వర్యంలో ఆపరేషన్ ముస్కాన్-10ని నిర్వహించారు. హోటళ్లు, బేకరీలు, ఇటుక బట్టీలు, కిరాణ దుకాణాలు, మెకానిక్ షెడ్లు సహా పలు ప్రాంతాల్లో దాడులు చేసిన తొమ్మిది బృందాలు చిన్నారులను రక్షించాయి. జులై 1నుంచి 31వరకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి 326మందిని బాల కార్మిక వ్యవస్థ నుంచి బయటపడేశారు. పనికి పెట్టుకున్న యజమానులపై 155కేసులు నమోదు చేశారు.
చిన్నారులంతా ఈ రాష్ట్రాల వారే..
అయితే చిన్నారులంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, బిహార్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, మేఘాలయ రాష్ట్రాల చెందిన వారిగా అధికారులు గుర్తించారు. పేదరికం కారణంగా తల్లిదండ్రులు చిన్నారులను పనికి పెట్టినట్లు తెలుస్తోంది. ప్రతి నెలా వేతనంతోపాటు రోజూ భోజనం పెడుతుండడంతో తల్లిదండ్రులు పిల్లల్ని పనికి పంపుతున్నారు. అలాగే యజమానులు సైతం తక్కువ వేతనానికే వీరు దొరకడం, విపరీతంగా పని చేయించుకోవచ్చన్న ఉద్దేశంతో పనిలో పెట్టుకుంటారు. ఎవరి ఉద్దేశాలు ఏవైనా బలైపోతుంది మాత్రం చిట్టి హృదయాలే.
దాడులు అనంతరం సమాచారం సేకరించిన పోలీసులు చిన్నారుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. ప్రభుత్వం అందించే పథకాలు వివరించి పిల్లల్ని మంచిగా చదివించాలని విజ్ఞప్తి చేశారు. ఇక పనికి పెట్టుకున్న వారికి సైతం కౌన్సెలింగ్ నిర్వహించారు. పిల్లల్ని పనిలో పెట్టుకుంటే కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు.
Updated Date - Aug 02 , 2024 | 03:07 PM