Congress: అస్థిరత నుంచి సుస్థిరత దాకా
ABN, Publish Date - Dec 06 , 2024 | 03:47 AM
వచ్చింది బొటాబొటీ మెజారిటీ..! అలిగి అరడజను మంది ఎమ్మెల్యేలను చీల్చుకుపోగలిగే నేతలూ ఉన్నారనే చర్చ..! పార్టీ చరిత్ర చూస్తే.. నిత్యం అసమ్మతి, అంతర్గత కుమ్ములాటలు..!
ఏడాదిలో అడ్డంకులను అధిగమించిన ప్రభుత్వం
కాంగ్రెస్ మార్క్ రాజకీయానికి దూరంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు
అధికారాన్ని నిలబెట్టుకునేందుకు ప్రాధాన్యం
కలిసికట్టుగా వ్యవహరిస్తున్న పార్టీ నాయకులు
‘టీపీసీసీ చీఫ్’తో సామాజిక సమతుల్యత సాధన
కొలిక్కిరాని మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ భర్తీ
రెండో ఏడాది మొదట్లోనే స్థానిక ఎన్నికల సవాల్
గేరు మార్చి వేగం పెంచుతామంటున్న హస్తం
మళ్లీ రాజకీయ కార్యక్షేత్రంలోకి దిగనున్న కేసీఆర్
మహారాష్ట్రలో భారీ విజయం ఇచ్చిన జోష్‌లో బీజేపీ
వచ్చే ఏడాది కాలమంతా సంకుల సమరమే!
హైదరాబాద్, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): వచ్చింది బొటాబొటీ మెజారిటీ..! అలిగి అరడజను మంది ఎమ్మెల్యేలను చీల్చుకుపోగలిగే నేతలూ ఉన్నారనే చర్చ..! పార్టీ చరిత్ర చూస్తే.. నిత్యం అసమ్మతి, అంతర్గత కుమ్ములాటలు..! సీనియారిటీ ఉన్నా.. సీఎం కుర్చీ దక్కలేదన్న అసంతృప్తితో రగులుతున్న నాయకులు..! రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి మించి గ్యారెంటీలను ప్రకటించి అధికారంలోకి వచ్చిన నేపథ్యం..! ప్రధాన ప్రతిపక్షం ఏమో.. పదేళ్ల పాలనా అనుభవం, సమృద్ధిగా ఆర్థిక వనరులు, పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలతో బలంగా ఉంది..! దీనికితోడు సర్కారు త్వరలోనే కూలిపోతుందంటూ ఆ పార్టీ అగ్ర నాయకుల ప్రకటనలు..! సరిగ్గా నిరుడు డిసెంబరు 7న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో ఉన్న పరిస్థితి ఇది. కానీ, ఏడాది తిరిగేసరికి అంతా మారిపోయింది. వ్యూహాత్మకంగా అడ్డంకులను అధిగమిస్తూ సుస్థిర స్థానానికి చేరుకుంది. పార్టీలో అసమ్మతి స్వరాలు లేవు.. ప్రభుత్వంలో వ్యతిరేక గళాలు లేవు.. ప్రధాన ప్రత్యర్థి డీలాపడింది.. ప్రజలు కూడా వ్యతిరేకతతో లేరు..! వెరసి రేవంత్ సర్కారు తొలి ఏడాది సంతృప్తికరంగా ముగిసింది..! అంతమాత్రాన అంతా సర్దుకుందని కాదు..! మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉంది.. నామినేటెడ్ పదవుల పంపిణీని ముగించాల్సి ఉంది.. స్థానిక ఎన్నికల సంగ్రామాన్ని ఎదుర్కొనాల్సి ఉంది..! రాజకీయంగానూ దీటుగా నిలవాల్సి ఉంది..! అంటే.. రెండో ఏడాదిలో ఉన్నాయి అసలు సవాళ్లు..! ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ సీటు కైవసం, ఆ పార్టీ నుంచి వచ్చి చేరిన ఎమ్మెల్యేల మద్దతు, ఎంఐఎం శాసనసభ్యుల దన్నుతో రేవంత్ సర్కారు పటిష్ఠమైంది.
బలహీన పడ్డ గులాబీ..
ఇదే సమయంలో ఎమ్మెల్యేలను చేజార్చుకుని, లోక్‌సభ ఎన్నికల్లో ఖాతా తెరవని కారు బాగా బలహీనపడింది. ప్రత్యర్థి డీలాతో సహజంగానే రేవంత్ సర్కారు మరింత బలోపేతమైంది. ఇక గత ఏడాది పార్టీ కోణంలోనూ అంతా సానుకూలమే..! అసమ్మతి, అంతర్గత కుమ్ములాటల కాంగ్రెస్ సంస్కృతికి భిన్నం గా.. సీనియర్లు.. సీఎంకు అండగా నిలిచారు. మంత్రులకేమో తమ శాఖల్లో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిం ది. క్షేత్రస్థాయిలో తమ పట్టు కొనసాగాలంటే పార్టీ అధికారంలో ఉండడం ముఖ్యమన్న భావనకు వారు వచ్చారు. అక్కడక్కడా అంతర్గత విభేదాలున్నా.. వీటి కంటే బయటి శక్తులు ప్రమాదకరమనే ఆలోచనతో కలిసి నడుస్తున్నారు. పదేళ్లు అధికారానికి దూరంగా ఉండి రాజకీయంగా, ఆర్థికంగా నష్టపోయిన సీనియర్ నాయకులు.. మన ప్రభుత్వం ఉంటేనే పనులు జరుగుతాయన్న ఆలోచనతో వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం, సీఎంకు పూర్తి అండగా నిలిచారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.
కూలిపోతుందంటే.. నిలబెట్టుకున్నారు
గ్యారెంటీల బరువు, స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చిన రేవంత్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందంటూ బీఆర్‌ఎస్ టార్గెట్ చేసింది. గులాబీ పార్టీ అగ్ర నాయకులు చేసిన ఈ ప్రకటనలనే సీఎం రేవంత్ అస్త్రంగా మలుచుకున్నారు. బీఆర్‌ఎ్‌సకు చెందిన పదిమంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా తమ ప్రభుత్వానికి మద్దతు పలికేలా చేశారు. సర్కారు మనుగడపై కారు పార్టీ నాయకుల వ్యాఖ్యలతోనే.. వారి ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సి వచ్చిందన్న సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా పంపారు. మరోవైపు మజ్లి్‌సతో స్నేహం గా ఉంటూ ఆ పార్టీ మద్దతునూ సాధించారు. తద్వారా సర్కారు సుస్థిరతకు ఢోకా లేదనే సందేశాన్ని ఇచ్చారు.
ఆర్థికంపై శ్వేతపత్రంతో సమాధానం
ఎన్నికల గ్యారెంటీలే ప్రభుత్వానికి మొదటి సవాల్‌గా నిలిచాయి. దీంతో రేవంత్ సర్కారు వ్యూహాత్మకంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. పదేళ్ల పాలనలో కేసీఆర్ రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల మేరకు అప్పుల్లో ముంచేశారని, అసలు, వడ్డీలకే నెలకు రూ.6,500 కోట్లు చెల్లించాల్సి వస్తున్నదంటూ శ్వేతపత్రం ప్రకటించిం ది. హామీలను సకాలంలో అమలు చేయాలని ఉన్నా.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదన్న అభిప్రాయాన్ని ప్రజల్లోకి గట్టిగా తీసుకెళ్లింది. ఇక పంద్రాగస్టు కల్లా రైతులకు రూ.2 లక్షల మేరకు రుణమాఫీ చేస్తామం టూ సీఎం ప్రకటించి ఆ మేరకు కచ్చితంగా అమలు చేయడంతో.. ఆలస్యంగానైనా మిగతా హామీలనూ నెరవేరుస్తారన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడిందని నేతలు చెబుతున్నారు.
‘సామాజిక’ అసంతృప్తికి అధిష్ఠానం చెక్!
అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల టికెట్లలో న్యాయం జరగలేదని, కాంగ్రె్‌సలో బీసీలకు ప్రాధాన్యం దక్కట్లేదని ఆ వర్గం నేతల్లో నెలకొన్న అసంతృప్తిని అధిష్ఠానం చల్లార్చింది. సీఎం తర్వాత అంతటి ప్రాధాన్యమైనదిగా భావించే టీపీసీసీ అధ్యక్ష పదవిలో బీసీ వర్గానికి చెందిన మహే్‌షకుమార్‌గౌడ్‌ను నియమించింది. టిక్కెట్లు దక్కని బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఇతర వర్గాల నాయకులను నామినేటెడ్ పదవుల్లో నియమించేలా చూసింది. స్థానిక ఎన్నికలు, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నవారికే జిల్లా, రాష్ట్ర స్థాయిలో నామినేటెడ్ పదవులు దక్కుతాయని రేవంత్, మహే్‌షకుమార్‌గౌడ్ స్పష్టం చేయడంతో ఆశావహులంతా ప్రజల్లో తిరుగుతున్నారు. అయితే, పదేళ్లు పార్టీకోసం పోరాటాలు చేసి.. కేసు లు ఎదుర్కొన్న నేతలకు న్యాయం చేయడం.. నాయకత్వం ముందున్న సవాల్‌గా కాంగ్రెస్‌వర్గాలు పేర్కొంటున్నాయి.
నిర్ణయాల్లోనూ హై కమాండ్ అండ..
పార్టీ అధికారంలోకి రావడానికి పూర్తి సహకారాన్ని అందించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. ప్రభుత్వంలో ఏర్పడిన అడ్డంకులను అధిగమించడంలోనూ తోడ్పాటునిచ్చింది. రేవంత్ సర్కారు ఒక్కో అడుగు వ్యూహాత్మకంగా వేస్తున్నా.. హైడ్రా కూల్చివేతలు, మూసీ ప్రక్షాళన, లగచర్ల భూసేకరణలో స్థానికుల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంది. పర్యావరణవేత్తలు, మేధావుల నుంచి ఈ కార్యక్రమాలకు మద్దతు లభించింది. కానీ, కొందరు బాధితులతో కలిసి ప్రతిపక్షాల ఆందోళనలు చేయడంతో సర్కారు కాస్త వెనక్కుతగ్గాల్సి వచ్చింది. అయితే, ఈ అంశంలోనూ ప్రభుత్వానికి కాంగ్రెస్ అధిష్ఠానం మద్దతుగా నిలిచింది.
కొత్త ఏడాదిలో స్థానిక ఎన్నికల సవాల్
పదేళ్లుగా బీఆర్‌ఎస్ కనుసన్నల్లో మెలిగిన రాజకీయ వ్యవస్థపై పట్టు సాఽధించేందుకు, ఆధిక్యతను సుస్థిరం చేసుకునేందుకు రేవంత్ సర్కార్‌కు ఏడాది పట్టింది. అయితే, రెండో ఏడాదిలో అడుగిడుతుండగానే ప్రభుత్వం ముందు స్థానిక ఎన్నికల సవాల్ నిలవనుంది. జనవరిలో స్థానిక ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చి, ఫిబ్రవరిలో ఎన్నికలకు వెళ్లే అవకాశాలున్నాయి. పంచాయతీ ఎన్నికలు పార్టీల గుర్తులు లేకుండా జరిగినా, ఎంపీటీసీలు, జట్పీటీసీలకు పార్టీ గుర్తులను వినియోగిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకునే రేవంత్ సర్కారు వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. రూ.2 లక్షల లోపు రుణాలున్న రైతులకు మాఫీని పూర్తిచేసింది. రైతు భరోసాను సంక్రాంతి తర్వాత ఇస్తామని ప్రకటించింది.
మాసాలు పోయాయి.. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడో?
ఆషాఢం అడ్డంకి దాటి శ్రావణం పూర్తయి.. కార్తీక మాసమూ గడిచిపోయినా రేవంత్ ప్రభుత్వంలో పూర్తిస్థాయి మంత్రివర్గం ఏర్పాటు కాలేదు. వాస్తవానికి టీపీసీసీ అధ్యక్ష పదవి భర్తీ, మంత్రివర్గ విస్తరణ ఒకేసారి జరుగుతాయని భావించారు. మహేష్ గౌడ్ నియామకమై రెండు నెలలైంది. మంత్రివర్గంలో మరో ఆరు ఖాళీలు మాత్రం అలాగే ఉన్నాయి. హైదరాబాద్, కీలకమైన రంగారెడ్డి సహా ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు కేబినెట్‌లో ఇంకా ప్రాతినిధ్యం లేదు. ఈ పరిస్థితి ఆశావహు ల్లో అసంతృప్తికి దారితీస్తోంది. సామాజిక సమతూకం కుదరకపోవడం, పదవులు ఆశిస్తున్నవారిలో ఆర్థికంగా, ఇతరత్రా బలమైన నాయకులు ఉండడంతో అధిష్ఠానం తుది నిర్ణయానికి రాలేకపోతోం ది. నామినేటెడ్ పోస్టులు, మంత్రి పదవు లు ఆశిస్తున్న నాయకులనూ సంతృప్తిపరచడం కాంగ్రెస్ నాయకత్వం ముందున్న పెద్ద సవాలు అని పరిశీలకులు చెబుతున్నారు. ఈ విషయాల్లో అటు అధిష్ఠానం, ఇటు ముఖ్యమంత్రి సమన్వయం చేసుకుంటేనే.. కాంగ్రెస్ మార్క్ అసంతృప్తి మళ్లీ తలెత్తకుండా ఉంటుందని పేర్కొంటున్నారు.
కేసులతో ఆత్మరక్షణలోకి బీఆర్‌ఎస్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చీ రావడంతోనే.. ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ కీలక నాయకులు కేటీఆర్, హరీశ్‌రావు దాడి ప్రారంభించారు. అయితే, కాళేశ్వరం బరాజ్‌లు కుంగడం, విద్యుత్ ఒప్పందాల్లో అవినీతి ఆరోపణలను తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్, మంత్రులు.. అసెంబ్లీలో గులాబీ పార్టీ నాయక త్వంపై ప్రతిదాడికి దిగారు. విచారణ జరిపించుకోవాలంటూ శాసనసభ వేదికగా సవాళ్లు విసిరిన కేటీఆర్, హరీశ్, బీఆర్‌ఎస్ మాజీ మంత్రులు ఉచ్చులో చిక్కుకున్నారు. వారి సవాళ్ల మేరకు రేవంత్ ప్రభుత్వం విచారణ కమిషన్లను నియమించింది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసునూ ముందుకు తెచ్చింది. దీంతో బీఆర్‌ఎస్ నాయకత్వం ఆత్మరక్షణలో పడింది. ఇక ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత అరెస్టు కావడం కూడా ఆ పార్టీ దూకుడును కొంత వెనక్కులాగింది.
అటు కేసీఆర్.. ఇటు కాషాయ దళము..
స్థానిక ఎన్నికలతో పాటు రేవంత్ సర్కారుకు రాజకీయంగా రెండో ఏడాదిలో గట్టి సవాళ్లే ఎదురవనున్నాయి. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి, కాలు విరిగి గాయపడడం, ప్రభుత్వానికి సమయం ఇవ్వాలన్న ఆలోచనతో కేసీఆర్ ఏడాదిగా రాజకీయంగా క్రియాశీలంగా లేరు. పూర్తిగా ఫామ్‌హౌ్‌సకే పరిమితమయ్యారు. కేటీఆర్, హరీశ్‌రావులను ముందుపెట్టి నడిపించారు. ఇకపై మాత్రం కేసీఆర్ బయటకు రావడంతో పాటు, ప్రతిపక్ష పార్టీగా బీఆర్‌ఎస్ గళాన్ని పెంచే అవకాశం ఉంది. కేసీఆర్ బటయకు రావాల్సిందేనని, వస్తే ఏం చేయాలో తమకు తెలుసని రేవంత్ కూడా పలు సందర్భాల్లో పేర్కొన్నారు.
తెలంగాణలో తమదే అధికారం అంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పదేపదే ప్రకటించి.. మూడో స్థానానికి పరిమితమైంది బీజేపీ. ఆపై లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 8 సీట్లు గెలుచుకుని సత్తాచాటింది. ఇప్పుడు పొరుగునున్న మహారాష్ట్ర ఎన్నికల్లో సాధించిన ఘన విజయంతో.. తెలంగాణపైనా గట్టిగా గురిపెట్టనుంది. స్వయంగా ప్రధాని మోదీనే.. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారానికి చేరువగా వచ్చినట్లు అనిపించినా, అవకాశం జారిపోయిందని, ఈసారి మాత్రం లక్ష్యం చేరాల్సిందే అన్న సంకేతాలను బీజేపీ రాష్ట్ర నేతలకు పంపించారు. దీంతో రాబోయే కాలంలో అటు కేసీఆర్, ఇటు బీజేపీతమ వ్యూహాలకు పదునుపెట్టడం, ఆందోళనల తీవ్రత పెంచడం ఖాయం. వీటిని ఎదుర్కొంటూనే తమ ఎజెండాను ముందుకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి రేవంత్ సర్కారుకు ఎదురవనుంది. తొలి ఏడాది అనేక ఆటుపోట్లను ఎదుర్కొంటూనే సుస్థిరత సాధించామని, రాబోయే కాలంలో గేర్ మార్చి వేగం పెంచుతామని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి..
Read Latest Telangana News And Telugu News
Updated Date - Dec 06 , 2024 | 11:29 AM