Power bill Payment: స్కాన్ చెయ్.. కరెంట్ బిల్లు కట్టెయ్!
ABN, Publish Date - Jul 06 , 2024 | 09:24 AM
ఇకపై కరెంటు బిల్లులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కట్టొచ్చు. ఈ మేరకు వినియోగదారులకు కొత్త సదుపాయం కల్పిస్తూ తెలంగాణ డిస్కమ్‌లు నిర్ణయం తీసుకున్నాయి. థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపును నిలిపివేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో గూగుల్/ఫోన్‌పే/అమేజాన్ పే లేదా పేటీఎంల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించేందుకు బాగా అలవాటు పడ్డవారు కొంత ఇబ్బందుల్లో పడ్డారు.
ఆగస్టు నుంచి క్యూఆర్ కోడ్ ఆధారిత కరెంట్ బిల్లుల జారీ
గూగుల్/ఫోన్‌పే, పేటీఎం ఆధారంగా స్కాన్‌చేసి కట్టేయొచ్చు
హైదరాబాద్, హైదరాబాద్ సిటీ, జూలై 5 (ఆంధ్రజ్యోతి): ఇకపై కరెంటు బిల్లులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కట్టొచ్చు. ఈ మేరకు వినియోగదారులకు కొత్త సదుపాయం కల్పిస్తూ తెలంగాణ డిస్కమ్‌లు నిర్ణయం తీసుకున్నాయి. థర్డ్‌పార్టీ యాప్‌ల ద్వారా చెల్లింపును నిలిపివేస్తూ ఆర్బీఐ నిర్ణయం తీసుకోవడంతో గూగుల్/ఫోన్‌పే/అమేజాన్ పే లేదా పేటీఎంల ద్వారా కరెంటు బిల్లులు చెల్లించేందుకు బాగా అలవాటు పడ్డవారు కొంత ఇబ్బందుల్లో పడ్డారు. ఈ తరహా వినియోగదారుల కోసమే అన్నట్టుగా డిస్కమ్‌లు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి.
ఆగస్టు నుంచి వినియోగదారులకు క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్‌తో కూడిన బిల్లును జారీ చేయాలని నిర్ణయించాయి. ఈ కోడ్‌ను గూగుల్‌పే/ ఫోన్‌పే/ఆమేజాన్‌పే, పేటీఎం ద్వారా స్కాన్ చేసి బిల్లులు కట్టొచ్చు. అంటే.. ఏదైనా షాపింగ్ మాల్, హోటల్‌లో బిల్లు చెల్లించేటప్పుడు నిర్వాహకులు బిల్లుతో కూడిన క్యూఆర్ కోడ్‌ను చూపితే, దాన్ని స్కాన్ చేసి బిల్లు చెల్లించినట్టుగానే అన్నమాట! ఆగస్టులో జారీ చేసే బిల్లులన్నీ కూడా క్యూఆర్ కోడ్ ఆధారంగా జారీ చేయనుండటంతో వినియోగదారులకు ఇబ్బందులు తీరనున్నాయి.
ప్రస్తుతం రెండునెలలుగా ఉత్తర డిస్కమ్(ఎన్పీడీసీఎల్–వరంగల్)లో పలు ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ ఆధారిత బిల్లులు జారీ చేస్తున్నామని, ఆగస్టు నుంచి పూర్తిస్థాయిలో డిస్కమ్‌లో జారీ చేస్తామని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి తెలిపారు. అయితే అధికార యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని వాటి ద్వారానూ బిల్లులు చెల్లించే విధంగా సర్కారు అవకాశమిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ మేరకు టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకొని, కరెంట్ బిల్లులు చెల్లించే అవకాశం ఉంది. అంతేకాకుండా https://tgsouthpower.org లేదా https://tgnpdcl.comలలోకి వెళ్లి... paybillను క్లిక్ చేసి, యూనిక్ సర్వీస్‌నెంబర్(usc)ను ఎంటర్‌చేసి, బిల్లులు కట్టే అవకాశం ఉంది. గురువారం ఉదయం 10 గంటల దాకా 1.20 లక్షల మంది వినియోగదారులు యాప్‌లు లేదా వెబ్‌సైట్‌లో చెల్లింపులు చేసినట్లు దక్షిణ డిస్కమ్ ప్రకటించింది.
Updated Date - Jul 06 , 2024 | 09:25 AM