Dharani Issues: బాబోయ్ ‘ధరణి’.. ఇలాగైతే కష్టమే ఇక..!
ABN, Publish Date - Aug 14 , 2024 | 02:48 PM
కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లుంది తెలంగాణ రాష్ట్రంలో ధరణి పరిస్థితి. కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకొచ్చి ఇక సమస్యలే లేకుండా చేస్తామని రేవంత్ ప్రభుత్వం ప్రకటన చేసింది. పెండింగ్ అప్లికేషన్లను మాత్రం పరిష్కరించడం లేదు.
హైదరాబాద్, ఆగస్టు 14: కొండ నాలుకకు మందేస్తే.. ఉన్న నాలుక ఊడినట్లుంది తెలంగాణ రాష్ట్రంలో ధరణి పరిస్థితి. కొత్త ఆర్వోఆర్ చట్టం తీసుకొచ్చి సమస్యలే లేకుండా చేస్తామని రేవంత్ ప్రభుత్వం చెబుతున్నా.. పెండింగ్ అప్లికేషన్లు పరిష్కరించడం లేదు. ఈ క్రమంలో ప్రభుత్వం కొత్తగా భూమాత పోర్టల్ తీసుకొస్తామనే ప్రకటన చేసింది. ధరణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న అప్లికేషన్లను పరిష్కరిస్తే చాలని దరఖాస్తుదారులు అంటున్నారు. నెలల తరబడి గ్రివెన్సీలు పెండింగ్‌లో పెట్టి అవినీతికి కొత్త దారులు చూపిస్తున్నారు కొందరు అధికారులు.
ఎకరానికి ఇంత అని రేట్ ఫిక్స్
ధరణి స్థానంలో భూమాత పోర్టల్ తీసుకువచ్చి అవినీతికి ఆస్కారం లేకుండా భూ సమస్యలకు పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు నీరుగారుతున్నాయి. ప్రభుత్వం మారి 9 నెలలవుతున్నా ధరణి సమస్యలు ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గత ప్రభుత్వం ధరణి తీసుకొచ్చి అధికారుల మెడమీద కత్తి పెట్టినట్లు పనిచేయించింది. స్పీడ్‌గా అప్లికేషన్లు పరిష్కరించారు. కొంత మేర ఫలితాలను ఇచ్చినా.. కొన్ని సాంకేతిక సమస్యలు, పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలతో ధరణి వివాదాస్పదంగా మారింది. దీంతో ధరణిని ఎన్నికల ప్రచారాస్త్రంగా కాంగ్రెస్ పార్టీ వాడుకుని సక్సెస్ అయ్యింది. ప్రస్తుతం ధరణి ప్రక్షాళన చేసే విషయంలో రెవెన్యూ శాఖ ఉదాసీనంగా వ్యవహరిస్తోందనే విమర్శలు వస్తోన్నాయి. ధరణి దరఖాస్తుల పరిష్కారాన్ని కొందరు అధికారులు కాస్ట్లీగా మార్చేశారు. ఎకరానికి ఇంత అని ధర కూడా ఫిక్స్ చేశారనే ప్రచారం జరుగుతోంది.
ఏసీబీకి చిక్కిన అడిషనల్ కలెక్టర్ భూపాల్ రెడ్డి
రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎంవీ భూపాల్‌రెడ్డి ఏసీబీ అధికారులకు చిక్కాడు. బాలాపూర్ మండలం గుర్రంగూడకు చెందిన జక్కిడి ముత్యంరెడ్డికి 14 గుంటల పట్టా భూమి ఉంది. ధరణి పోర్టల్‌లో నిషేధిత జాబితా నుంచి తొలగించాలని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. కలెక్టర్‌ను కలిసి అనేకసార్లు విన్నవించినా ఫలితం లేకపోవడంతో ఇ–సెక్షన్‌లో పనిచేసే సీనియర్ అసిస్టెంట్ మదన్‌మోహన్‌రెడ్డిని సంప్రదించారు. అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన రూ.10 లక్షలు డిమాండ్ చేయగా, రూ.8 లక్షలు ఇస్తానని ఒప్పుకున్నాడు. తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. అతడిని పట్టుకునేందుకు అధికారులు రంగంలోకి దిగారు. సోమవారం సాయంత్రం మదన్‌మోహన్‌రెడ్డిని గుర్రంగూడ ఎక్స్‌రోడ్‌కు ముత్యంరెడ్డి పిలిపించి, ఏసీబీ అధికారులకు పట్టించాడు. ఇదిలా ఉంటే మరోవైపు ఒక్క రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ పేషీలో ఏడు వేలకు పైగా అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. తహశీల్దార్, ఆర్డీవో రికమండ్ చేసి, అప్రూవ్ చేసినప్పటికీ అడిషనల్ కలెక్టర్లు, కలెక్టర్లు వాటిని పరిష్కరించడం లేదు. అప్లికేషన్లు పెండింగ్‌లో పెట్టడంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు.
1.34 లక్షల దరఖాస్తులు పెండింగ్
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భూ సమస్యల పరిష్కారానికి ప్రయారిటీ ఇచ్చింది. మూడు సార్లు స్పెషల్ డ్రైవ్ నిర్వహించింది. అధికారులు మాత్రం సీరియస్‌గా తీసుకోవడం లేదు. కొందరు మొక్కుబడిగా పరిష్కరిస్తే, మరికొందరు మనకెందుకులే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. నేటికి రాష్ట్ర వ్యాప్తంగా 1.34 లక్షల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో తహశీల్దార్ల వద్ద 40 వేలు, ఆర్డీవోల వద్ద 30 వేలు, అదనపు కలెక్టర్ల దగ్గర 37 వేలు, కలెక్టర్ల వద్ద 26 వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. తహశీల్దారు, ఆర్డీవో స్థాయిలో అప్లికేషన్లను అప్రూవ్ చేశారు. కలెక్టర్లు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. సీసీఎల్ఏ స్థాయిలో కలెక్టర్లపై ఒత్తిడి తీసుకొస్తే అప్లికేషన్లను పరిష్కరించాల్సింది పోయి ఉద్దేశపూర్వకంగా రిజెక్ట్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా హైదరాబాద్ పరిసరాల్లో ఉన్న రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ, జనగామ జిల్లాల్లో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య పెరిగిపోతోంది. రంగారెడ్డి జిల్లాలో 9 నెలల కాలంలో అప్రూవ్ చేసిన అప్లికేషన్లు వందల్లో ఉన్నాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
కలెక్టర్ రిజక్ట్ చేయడంతో సమస్య..
నెలల తరబడి దరఖాస్తులు పెండింగ్‌లో ఉంటున్నాయి. సమస్య పరిష్కారం కోసం డబ్బులు ఇచ్చేందుకు బాధితులు వెనకాడటం లేదు. ఇదే అదనుగా కొందరు రెవెన్యూ అధికారులు సమస్య పరిష్కారం కోసం రేట్ ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడే అసలు సమస్య వచ్చింది. కిందిస్థాయి అధికారులు అఫ్రూవ్ చేశారు. కానీ కలెక్టర్లు రిజెక్ట్ చేయడంతో అసలు సమస్య వచ్చింది. కలెక్టర్ అప్రూవ్ చేయాలంటే తహశీల్దార్లు, ఆర్డీవోలు అన్ని ఫైల్స్ జత చేసి క్లియర్‌గా రిపోర్ట్ పంపాల్సిందే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెద్ద ఎత్తున కలెక్టర్లను బదిలీ చేసింది. హైదరాబాద్‌కు సమీపంలో ఉన్న జిల్లాలు రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, నల్గొండ లాంటి జిల్లాల్లో విలువైన భూములు ఉండటం, వివాదాస్పద భూములు ఉన్నాయనే కారణంతో ధరణి అప్లికేషన్లను పరిష్కరించాలంటే కొందరు కలెక్టర్లు భయ పడుతున్నారు. ధరణి విషయంలో ప్రభుత్వం త్వరగా మేల్కొవాల్సిన అవసరం ఉంది. పెండింగ్ అప్లికేషన్ల విషయంలో కలెక్టర్లకు చొరవ చూపక పోతే భూసమస్యలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది.
పెండింగ్ వివరాలు..
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో 1.34 లక్షల దరఖాస్తులు.
తహశీల్దార్ల దగ్గర 40 వేలు.
ఆర్డీవోల దగ్గర 30 వేలు.
అదనపు కలెక్టర్ల దగ్గర 37 వేలు.
కలెక్టర్ల దగ్గర 26 వేలు.
ఏ అధికారి ఎన్ని రోజుల్లో పరిష్కరించాలి..
తహశీల్దార్ - 7 రోజులు
ఆర్డీవో - 3 రోజులు
అదనపు కలెక్టర్ - 3 రోజులు
కలెక్టర్ - 7 రోజులు
టాప్ పెండింగ్ డిస్ట్రిక్ట్స్..
కలెక్టర్ల వద్ద పెండింగ్ దరఖాస్తులు..
రంగారెడ్డి 3,930.
మెదక్ 2,758.
నాగర్ కర్నూలు 2,425.
ఖమ్మం 1,612.
నల్లగొండ 1,207.
అదనపు కలెక్టర్లు వద్ద..
రంగారెడ్డి 7,175.
సంగారెడ్డి 2,700.
మంచిర్యాల 2,118.
నల్లగొండ 1,875.
యాదాద్రి భువనగిరి 1,838.
Also Read:
మోదీ వచ్చాకే వ్యవస్థలన్నీ నిర్వీర్యం..
భార్యతో కలిసి సామాన్యుడిలా విమాన ప్రయాణం చేసిన జగన్..
నన్ను కలిసేందుకు చంద్రబాబు సిద్ధమా?
For More Telangana News and Telugu News..
Updated Date - Aug 14 , 2024 | 05:17 PM