Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు..
ABN , Publish Date - Apr 25 , 2024 | 11:09 AM
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై(Prabhakar Rao) రెడ్ కార్నర్ నోటీసులు(Red Corner Notice) జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు(Look Out Notice) జారీ చేశారు పోలీసులు.
హైదరాబాద్, ఏప్రిల్ 25: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక మలుపు చోటు చేసుకుంది. ఎస్ఐబి(SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై(Prabhakar Rao) రెడ్ కార్నర్ నోటీసులు(Red Corner Notice) జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుక్ అవుట్ నోటీసులు(Look Out Notice) జారీ చేశారు పోలీసులు. ఇప్పుడు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారనే ప్రచారం జరగడం ఈ కేసులో కీలకంగా మారింది. ఫోన్ టాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయాడు. దీంతో ప్రభాకర్ రావు ఆచూకీ కోసం పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. లుక్ అవుట్ నోటీసులకు స్పందన లేకపోవడంతో.. రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారని తెలుస్తోంది.
అమెరికాలోని టెక్సాస్‌లో ప్రభాకర్ రావు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆరు నెలల విజిటింగ్ వీసా మీద ప్రభాకర్ రావు అమెరికాకు వెళ్లినట్లు గుర్తించారు పోలీసులు. ఇప్పటికే రెండు నెలలు పూర్తయిన నేపథ్యంలో ప్రభాకర్ రావు నాలుగు తరువాత ఇండియాకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు కేసులో సాక్ష్యాలను బట్టి విచారణను వేగవంతం చేశారు పోలీసులు.
సంచలన కేసులు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలన పరిణామం కూడా చోటు చేసుకుంది. అరెస్ట్ అయిన పోలీసులపై సైబర్ టెర్రరిజం సెక్షన్లు నమోదు చేశారు. దేశ భద్రతకు సాఫ్ట్‌వేర్ ద్వారా ముప్పు వాటిల్లేలా చేస్తే వారిపై ఈ సైబర్ టెర్రరిజం కేసులు నమోదు చేస్తారు. అలాంటి ఐటీ యాక్ట్ 66(F)ను ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రయోగిస్తున్నారు పోలీసులు. ఐటీ యాక్ట్ సెక్షన్ 66(F) జోడీ కోర్టులో మెమో దాఖలు చేశారు. సెక్షన్ 66(F) కింద కేసు ప్రూఫ్ అయితే జీవిత ఖైదీగా శిక్ష పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఐటీ యాక్ట్ 70 కింద కేసు నమోదు చేశారు. ఐటీ యాక్ట్ 70లో 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. తాజాగా ఐటీ యాక్ట్ సెక్షన్ 66(F) కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఫోన్ ట్యాపింగ్‌తో సైబర్ టెర్రరిజానికి పాల్పడినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే, ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదుకు అనుమతించాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు.
నేడు తీర్పు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్‌పై నాంపల్లి కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావ్, తిరుపతన్న బెయిల్ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు తీర్పు ఇవ్వనుంది. బెయిల్ పిటిషన్‌పై ఇప్పటికే ఇరు పక్షాల వాదనలు ముగిశాయి. అరెస్ట్ అయిన వారి నుంచి ఇప్పటికే పూర్తి వివరాలను సేకరించారని నిందితుల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పటివరకు పోలీసులు సేకరించిన ఆధారాలను కోర్టుకు సమర్పించలేదని పిటిషనర్ కౌన్సిల్ వాదించింది. మరోవైపు.. కేస్ దర్యాప్తు కొనసాగుతున్న తరుణంలో బెయిల్ ఇస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని పీపీ వాదించారు. మరి దీనిపై కోర్టు ఎలాంటి తీర్పునిస్తుందనేది ఉత్కంఠ నెలకొంది.