Boddemma: బొడ్డెమ్మ ప్రత్యేకత ఇదే.. ఎన్ని రోజులు ఈ పండుగను చేసుకుంటారంటే..
ABN, Publish Date - Sep 27 , 2024 | 10:35 PM
తెలంగాణలో సంప్రదాయబద్ధంగా చేసుకునే వాటిలో ప్రధానమైనవి బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు. వీటిని మహిళలు ఎంతో ఇష్టంతో చేసుకుంటారు. తెలంగాణలోని ఆడపడుచులు ఎంతో సందడిగా బొడ్డెమ్మ పండుగను జరుపుకొంటారు.
తెలంగాణలో సంప్రదాయబద్ధంగా జరుపుకునే వేడుకల్లో ప్రధానమైనవి బొడ్డెమ్మ, బతుకమ్మ పండుగలు. బతుకమ్మ ఉత్సవాలకు ముందు వచ్చేది బొడ్డెమ్మ. ఈ బొడ్డెమ్మ సంబరాలను ఆడపడుచులు ఎంతో సందడిగా జరుపుకొంటారు. బొడ్డెమ్మ పండుగ బతుకమ్మ పండుగకు ముందు వస్తుంది. ఈ పండుగను వివిధ ప్రాంతాల్లో పలు రకాలుగా చేసుకుంటారు. బాధ్రపద మాసంలో వచ్చే మహాలయ అమావాస్యకు ముందు, బహుళపంచమి నుంచి 9 రోజుల పాటు ఈ పండుగను కొంతమంది జరుపుకుంటారు. మరికొంతమంది అయితే 5 రోజులు, మూడు రోజులు దశమి, ద్వాదశి నుంచి జరుపుకుంటారు. ఈ పండుగను బొడ్డెమ్మల పున్నమి అని కూడా పిలుస్తారు. ప్రధానంగా ఈ పండుగను బాలికలు, పెండ్లి కాని అమ్మాయిలు చేస్తుంటారు. ఈ పండుగను భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. అమ్మాయిలు అయితే మంచి భర్త రావాలని దేవుడిని కోరుకుంటారు.
బొడ్డెమ్మ పండుగ ప్రకృతి పండుగ. మట్టితో ప్రకృతిలోని పూలతో చాలా విడదీయరాని అనుబంధం ఉంది. మనిషికి, మట్టికి, ప్రకృతికి ఉన్న గొప్పతనాన్ని వివరిస్తుంది. ఇక ఆయా ప్రాంతాలను బట్టి బొడ్డెమ్మ నిర్మాణం మారుతుంది. బొడ్డెమ్మను తయారుచేసే విధానాల్లో ప్రధానంగా ఐదు రకాలుంటాయి. వాటిని పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ, పందిరి బొడ్డెమ్మ, బాయి బొడ్డెమ్మ, అంతరాల బొడ్డెమ్మ అని ఐదు రకాల బొడ్డెమ్మలు అని పిలుస్తారు.
బొడ్డెమ్మ ప్రత్యేకత: బొడ్డెమ్మలో బొడ్డ అనే పదానికి అత్తి చెట్టు/ లేదా మేడిచెట్టు/ ఔదుంబర వృక్షం అని కూడా పేరు. ఈ చెట్టును పూజించడానికి కారణం ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉంటాయి. వివిధ రకాల అనారోగ్య సమస్యలను ఇది క్రమంగా దూరం చేస్తుంది. ప్రధానంగా సంతాన సాఫల్యానికి, మహిళల్లో వచ్చే పలు రోగాలకు ఇది దివ్యౌషధం. ప్రకృతికి, స్త్రీ జీవితానికి గల సంబంధాన్ని వివరించేలా ఈ పండుగ నిర్వహిస్తారు.
ఈ పండుగను ఏయే ప్రాంతాల్లో చేసుకుంటారంటే..
ఖమ్మం జిల్లాలోని గిరిజన ప్రాంతాలు ఎక్కువగా ఉన్న కొత్తగూడెం భద్రాద్రి వైపు, మహబూబాబాద్‌లో కలిసిన ఖమ్మం జిల్లా మండలాల్లో తెలంగాణ సంస్కృతితో మమేకమైన ప్రాంతాల్లో ఈ బొడ్డెమ్మ పండుగ చేసుకుంటారు.ఈ జిల్లాలో గిరిజన ప్రాంతాలన్నీ దాదాపుగా దట్టమైన అడవుల మధ్యే ఉండటం గమనార్హం. ఈ ప్రాంతాల్లో నివసించే వారికి ఏయే చెట్టు ఎలాంటి అనారోగ్యం పోగొడుతుందో తెలుసు. ఆరోగ్యపరమైన విషయాలకు, అటవీ ప్రాంతంలోని చెట్లు ఎలా ఉపయోగపడుతాయో వారికి బాగా తెలుసు. అందుకే వారిలో కొందరు ఈ పండుగను చేసుకుంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో కూడా ఈ బొడ్డెమ్మ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
బొడ్డెమ్మను ఎలా చేస్తారంటే:
ఖమ్మం జిల్లాలో అధికంగా పీట బొడ్డెమ్మను అలకరించి పూజిస్తారు. ఈ పండుగ జరుపుకునే వారికి ఓ ఆనవాయితీ ఉంటుంది. బతుకమ్మను పేర్చినట్లు ఇంటింటా బొడ్డెమ్మను పేర్చరు. కేవలం ఆనవాయితీ ఉన్న వారు మాత్రమే ఊరికి ఏ ఒక్కరో దీనిని రూపొదింస్తారు. ఆ బొడ్డెమ్మనే పెళ్లి కాని ఆడపిల్లలంతా కలిసి పూజిస్తారు.
ముఖ్యంగా పీట బొడ్డెమ్మను తయారుచేయాలంటే చతురస్రాకారంలో ఉన్న చెక్కతో చేసిన పీట కావాలి. పుట్టమన్నును తీసుకువచ్చి. పిండిలో కలిపి పీట మీద గుండ్రంగా ఐదు రకాలుగా పేర్చాలి. పై దాకా గోపురం ఆకారంలో వీటిని చేయాలి. దాని పైన ఓ చిన్న గిన్నె, అందులో పసుపు గౌరమ్మ పెట్టిన తర్వాత బొడ్డెమ్మను తయారు చేయాలి. అనంతరం ఆనవాయితీ ప్రకారం వారి ఇంటి ఆవరణలో శుభ్రం చేసి ఎర్రమట్టితో అలికి, అందమైన ముగ్గులు వేస్తారు.
మధ్యలో ఈ బొడ్డెమ్మను పెట్టి, వివిధ రకాల పూలతో అలంకరించి, కన్నెపిల్లలు బాలికలు చుట్టూ తిరుగుతూ ‘బొడ్డెమ్మ బొడ్డెమ్మా కోల్- బిడ్డాలెందరూ కోల్’ అంటూ కోలాటం ఆడుతారు. చివరలో ‘నిద్రపో బొడ్డెమ్మ నిద్ర పోవమ్మా. నిద్రాకు నూరేళ్లు-నీకు వేయ్యేళ్లు. నిను గన్న తల్లికీ నిండా నూరేళ్లు’ అంటూ పాటలు పాడిన తర్వాత బొడ్డెమ్మను చాలా జాగ్రత్తగా తీసి దేవుడి ముందు పెడతారు. ఇలా 9 రోజుల పాటు ఆట పాటలతో ఆడిన తర్వాత అందరూ కలిసి చెరువు దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ చెక్కపీట మీద నుంచి బొడ్డెమ్మను తీసి నీటిలో నిమజ్జనం గావిస్తారు. ‘పోయి రా బొడ్డెమ్మ పోయి రావమ్మా’ అంటూ బొడ్డెమ్మను నీటిలో వదులుతారు. అంతకుముందు మిగిలిపోయిన పూలు ఉంటే వాటిని కూడా చెరువు నీటిలో నిమజ్జనం చేస్తారు.
Updated Date - Sep 27 , 2024 | 10:54 PM