ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hydra: 262 నిర్మాణాల కూల్చివేత.. 111 ఎకరాల స్వాధీనం!

ABN, Publish Date - Sep 12 , 2024 | 04:43 AM

చెరువులను చెరబట్టిన వారిపై ‘హైదరాబాద్‌ విపత్తుల నిర్వహణ, ఆస్తుల రక్షణ సంస్థ (హైడ్రా)’ ప్రత్యేకంగా దృష్టి సారించింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తోంది.

  • ఆక్రమణల తొలగింపుపై హైడ్రా నివేదిక

  • నవరాత్రులు ముగియగానే మళ్లీ కూల్చివేతలు!

  • అమీన్‌పూర్‌ పెద్దచెరువులో అత్యధికంగా 51.78 ఎకరాలు స్వాధీనం

  • వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆక్రమణల తొలగింపు

  • సున్నం చెరువులో

  • 10 ఎకరాల్లోని 42 నిర్మాణాల కూల్చివేత

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): చెరువులను చెరబట్టిన వారిపై ‘హైదరాబాద్‌ విపత్తుల నిర్వహణ, ఆస్తుల రక్షణ సంస్థ (హైడ్రా)’ ప్రత్యేకంగా దృష్టి సారించింది. చెరువులు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణలో దూకుడుగా వ్యవహరిస్తోంది. ఆక్రమణల తొలగింపు, స్థలాల స్వాధీనమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. రెండున్నర నెలల వ్యవధిలో పలు ప్రాంతాల్లోని చెరువులు, పార్కుల్లో 262 నిర్మాణాలను నేలమట్టం చేసింది. 111.72 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు హైడ్రా బుధవారం ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. జూన్‌ 27 నుంచి సెప్టెంబరు 8 వరకు చెరువులు, పార్కులు, రోడ్లపై ఆక్రమణలను తొలగించారు. తాజాగా అమీన్‌పూర్‌లోని పెద్ద చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న ఏపీలోని పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డికి చెందిన ఆక్రమణలను తొలగించివేశారు.


51.78 ఎకరాల స్థలంలో లే అవుట్‌ అభివృద్ధి, చిన్న గదులు, ఇతరత్రా 24 నిర్మాణాలను 24 కూల్చివేశారు. సున్నం చెరువులో 40 షెడ్లు, రెండు ఆర్‌సీసీ నిర్మాణాలు, గ్రౌండ్‌ ప్లస్‌ నాలుగంతస్తుల భవనం 1, గ్రౌండ్‌ ప్లస్‌ మూడంతస్తుల భవనాలు రెండింటిని నేలమట్టం చేశారు. ఆయా నిర్మాణాలు 10 ఎకరాల స్థలంలో విస్తరించి ఉన్నాయి. మల్లంపేటలోని కత్వ చెరువులో 2.50 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన 13 విల్లాలు కూల్చారు. మరో ఐదు నిర్మాణాల కూల్చివేతపై ఉన్నత స్థాయిలో అధికారులు చర్చలు జరుపుతున్నారు. అంతకుముందు రాజేంద్రనగర్‌ అప్పా చెరువులో 14 భారీ షెడ్లను నేలమట్టం చేసి 3.2 ఎకరాల స్థలం స్వాధీనం చేసుకున్నారు. తుమ్మిడికుంటలో సినీనటుడు నాగార్జునకు చెందిన ఎన్‌ కన్వెన్షన్‌ను గత నెలలో కూల్చిన విషయం తెలిసిందే. గండిపేట, రాజేంద్రనగర్‌ బుమ్‌రుఖ్‌ దౌల, ఈర్ల, ఎర్రకుంట, చింతల్‌ చెరువు తదితర ప్రాంతాల్లోనూ ఆక్రమణలు తొలగించారు. అత్యధికంగా చింతల్‌ చెరువులో 54, బుమ్‌రుఖ్‌ దౌల చెరువులో 45 అక్రమ నిర్మాణాలు నేలమట్టం చేశారు. గండిపేట చెరువు ఎఫ్‌టీఎల్‌ పరిధిలో 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆక్రమణలు తొలగించినట్టు హైడ్రా పేర్కొంది.


  • ఎత్తు పరిశీలించి.. ఆక్రమణలు గుర్తించి..

చెరువుల్లో ఆక్రమణల గుర్తింపునకు భిన్న అంశాలను హైడ్రా పరిశీలిస్తోంది. శాటిలైట్‌ చిత్రాల ద్వారా చెరువుల కబ్జాలను ప్రాథమికంగా గుర్తిస్తున్న సంస్థ.. అవి ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉన్నాయా? లేదా? అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. ఇందుకోసం బుధవారం హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌.. షాద్‌నగర్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎ్‌సఏ)కి వెళ్లారు. 20 ఏళ్ల క్రితం చెరువు, పరిసర ప్రాంతాలు ఎంత ఎత్తులో ఉండేవి? ప్రస్తుతం ఎంత ఎత్తు ఉందన్నది తెలిసేలా వివరాలు ఇవ్వాలని కోరారు. చాలా ప్రాంతాల్లో చెరువుల్లో మట్టి పోసి చదును చేస్తున్న కబ్జాదారులు అనంతరం నిర్మాణాలు చేపడుతున్నారు. గండిపేట, ఎర్రకుంట, ఈర్ల చెరువుల్లో నిర్మాణాల విషయంలో అదే జరిగింది. సాధారణం కంటే ఎనిమిది నుంచి 15 అడుగుల మేర ఎత్తు పెంచి నిర్మాణాలు చేపట్టారు. ఎక్కువ ఎత్తులో ఉన్నందున ఆ నిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌ పరిధిలోకి రావన్నది వారి వాదన. ఇలాంటి వారికి చెక్‌ పెట్టేలా చెరువుల అడుగు భాగం ఎంత ఎత్తులో ఉండేది? ఇప్పుడు ఎంత ఉందన్నది తెలుసుకోనున్నారు. దీని ద్వారా చెరువుల్లో పూడికతీసి, విపత్తుల నిర్వహణ చర్యలూ చేపట్టవచ్చని రంగనాథ్‌ తెలిపారు.


  • గణపతి నవరాత్రుల నేపథ్యంలో..

మరో దఫా కూల్చివేతలకు హైడ్రా రంగం సిద్ధం చేసింది. పలు చెరువుల్లో ఆక్రమణలపై నిర్ధారణకు వచ్చినా గణేశ్‌ నవరాత్రుల నేపథ్యంలో కాస్త స్పీడు తగ్గించారు. పోలీసులు బందోబస్తులో ఉన్నందున అవసరమైన మేర సిబ్బంది అందుబాటులో ఉంటారా? లేదా? అన్నది తెలుసుకుంటున్నారు. ఈ విషయంపై పోలీస్‌ అధికారులతో మాట్లాడుతున్నట్లు హైడ్రా వర్గాలు తెలిపాయి. సిబ్బంది అందుబాటులో ఉంటే వారాంతంలో కూల్చివేతలు ఉండే అవకాశం ఉంది. లేకపోతే నిమజ్జనాలు ముగిసిన తర్వాత ఆక్రమణలను తొలగించనున్నారు.

Updated Date - Sep 12 , 2024 | 05:42 AM

Advertising
Advertising