Hydra Agency: చుక్క పెట్టి.. చక్కబెట్టారు..
ABN, Publish Date - Aug 30 , 2024 | 03:10 AM
ఇప్పటివరకు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలోని నిర్మాణాల కూల్చివేతలు చేపట్టిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్- అసెట్ ప్రొటెక్షన్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా).. ఇప్పుడు ఈ అక్రమానికి ఊతం ఇచ్చిన ప్రభుత్వ అధికారుల పాత్రపైనా దృష్టిసారించింది.
‘ఈ స్థలం చెరువులో ఉంది. సాగు నీటి శాఖ అధికారులు అభ్యంతరం చెబుతున్నారు’ అని పట్టణ ప్రణాళిక విభాగం అధికారిణి (టీపీవో) స్పష్టంగా రాసి అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ)కు నివేదిక పంపారు. కానీ, ఆయన తన అభిప్రాయం చెప్పకుండా.. కేవలం చుక్క (డాట్) పెట్టి మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ (ఎండీసీ)కు చేరవేశారు. అంతే.. ఎండీసీ స్థాయిలో భారీ భవనాల నిర్మాణానికి అనుమతులొచ్చేశాయ్.
హైదరాబాద్‌లో చెరువుల చెర వెనుక అధికారుల లీలలు
టీపీవో అభ్యంతరాన్ని తొక్కిపెట్టిన అసిస్టెంట్ సిటీ ప్లానర్
ఆపై మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్థాయిలో అనుమతి!
ప్రభుత్వ స్థలం.. ప్రైవేట్ అని ఒకే భూమికి 2 నివేదికలు
ఉన్నతాధికారులకు మాత్రం ‘ప్రైవేట్’ అని పంపిన ఏడీ
వేరే దగ్గరి సర్వే నంబరును చెరువుకు వేసిన తహసీల్దార్
క్షేత్రస్థాయిలో పరిశీలించకుండానే ఆమోదించిన ఏపీవో
భవనాలకు అడ్డగోలుగా ఓకే చెప్పిన సూపరింటెండెంట్
ఆరుగురు అధికార్లపై క్రిమినల్ కేసులు.. హైడ్రా సిఫారసు
శాఖాపర చర్యలకు నివేదన.. ఉద్యోగ వర్గాల్లో కలకలం
హైదరాబాద్ సిటీ, మేడ్చల్, ఆగస్టు 29(ఆంధ్రజ్యోతి): ఇప్పటివరకు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లలోని నిర్మాణాల కూల్చివేతలు చేపట్టిన హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్- అసెట్ ప్రొటెక్షన్ మానిటరింగ్ ఏజెన్సీ (హైడ్రా).. ఇప్పుడు ఈ అక్రమానికి ఊతం ఇచ్చిన ప్రభుత్వ అధికారుల పాత్రపైనా దృష్టిసారించింది.
ద్విముఖ వ్యూహంలో భాగంగా.. ఓవైపు కూల్చివేతలు చేపడుతూనే మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు జారీ చేసినవారిపై కొరడా ఝళిపించేందుకు సిద్ధమవుతోంది. తెరవెనుక ఉంటూ తతంగం నడిపించినవారిని బయటకు లాగుతోంది. ఆయా విభాగాల్లో బాధ్యులపైనా చర్యలకు ఉపక్రమించింది. దరఖాస్తు దశ నుంచి అనుమతుల వరకు నిర్మాణదారులు సమర్పించిన డాక్యుమెంట్లు, ప్రభుత్వ విభాగాలు ఇచ్చిన నివేదికలను పరిశీలిస్తోంది. పాత్రధారులను తేల్చేందుకు పోలీస్ శాఖ తరహాలో సమగ్ర విచారణ సాగిస్తోంది. ఈ క్రమంలో హైడ్రాకు విస్తుపోయే విషయాలు తెలిశాయి. అన్నీ అవగాహన ఉండి కూడా కొందరు అధికారులు నిర్మాణాలకు ఆమోదం తెలిపారని అంచనాకు వచ్చింది.
సైబర్ నేరగాళ్లలా.. సాంకేతిక లొసుగుల ఆసరాతో
అక్రమాలకు తెగించిన అధికారులు.. సైబర్ నేరగాళ్లను తలదన్నేలా సాంకేతిక లొసుగులను ఆసరా చేసుకున్నారని హైడ్రా నిర్ధారించింది. కిందిస్థాయి ఉద్యోగులు అభ్యంతరం తెలిపినా.. ఉన్నతాధికారులు కుమ్మక్కయి అనుమతులిచ్చారని అంచనాకు వచ్చింది. చెరువుల కబ్జాలో నిర్మాణదారులకు పలు విభాగాల అధికారులు సహకరించారని తేల్చింది. క్రిమినల్ కేసుల నమోదుకు రంగం సిద్ధం చేసిన నేపథ్యంలో.. వీరిపై స్థానిక పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని భావిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సైబరాబాద్ కమిషనర్‌కు ఈ మేరకు లేఖ రాశారు. ఇదే సమయంలో నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలకు సంబంధిత శాఖలకు సిఫారసు చేయనున్నారు.
అనుమతులు ఎలా ఇచ్చారు? ఏం జరిగింది?
ఇప్పటివరకు కూల్చివేసిన భవనాల్లో.. చందానగర్ ఈర్ల చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో జీ ప్లస్ 2 భవనాలు రెండింటికి జీహెచ్‌ఎంసీ సర్కిల్ అధికారులు అనుమతిచ్చారు. నిర్మాణం పూర్తికాక ముందే నివాసయోగ్య పత్రం (ఓసీ) కూడా జారీ చేశారు. ఫిర్యాదులు రావడంతో క్షేత్రస్థాయిలో పరిశీలించిన హైడ్రా.. ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలున్నాయని నిర్ధారించి పడగొట్టింది. తెరవెనుక ఏం జరిగిందో లోతుగా పరిశీలిస్తే.. టీఎ్‌సబీపా్‌సలో దరఖాస్తు చేయగా.. ఈ స్థలం చెరువులో ఉందని.. సాగునీటి అధికారులు అభ్యంతరం తెలుపుతున్నారని మహిళా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీవో) ఫైల్‌లో రాశారు.
అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ) దీన్ని పట్టించుకోలేదు. సాగునీటి శాఖ అభ్యంతరంపై తన అభిప్రాయం చెప్పకుండా.. ఫైల్‌లో డాట్ (చుక్క) రాసి మునిసిపల్ డిప్యూటీ కమిషనర్ (ఎండీసీ)కు పంపారు. వాస్తవానికి కింది ఉద్యోగి నుంచి వచ్చిన ఫైల్‌లో అభిప్రాయం రాస్తే తప్ప పై అధికారికి చేరవేసే అవకాశం ఉండదు. ఇక్కడ ఏసీపీ, ఎండీసీ కుమ్మక్కయ్యారు. టీపీవో అభిప్రాయాన్ని తొక్కిపెట్టి వీరు చెరువులో నిర్మాణానికి అనుమతులు ఇచ్చారని హైడ్రా గుర్తించినట్లు తెలిసింది.
ల్యాండ్, సర్వే ఏడీ సొంత నివేదిక!
ప్రగతినగర్ ఎర్రకుంట చెరువులో ఏకంగా స్టిల్ల్ ప్లస్ ఐదంతస్తులుగా మూడు భవనాలకు హెచ్‌ఎండీఏ అనుమతులిచ్చింది. వీటినీ హైడ్రా నేలమట్టం చేసింది. ఇక్కడ తతంగంలో ల్యాండ్ సర్వే రికార్డ్స్, రెవెన్యూ, హెచ్‌ఎండీఏ అధికారుల హస్తం ఉందని నిర్ధారణకు వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు స్థలం యజమాన్య హక్కుపై సాగునీటి, రెవెన్యూ, ల్యాండ్ సర్వే రికార్డు విభాగాల అధికారులు సంయుక్త సర్వే నిర్వహించారు. ఈ స్థలం ఎర్రకుంట చెరువులో ఉందని తేల్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ (ల్యాండ్, సర్వే) మాత్రం సంయుక్త సర్వేకు భిన్నంగా రెండు నివేదికలు సిద్ధం చేశారు. ఒకదాంట్లో ప్రభుత్వ స్థలమని, మరోదాంట్లో ప్రైవేట్ భూమి అని రాశారు. పై అధికారులకు.. ప్రైవేట్ భూమి అని రాసిన నివేదికను పంపారు. నల్లగొండలోనూ ఈ అధికారి తప్పుడు సర్వే నివేదికలు ఇచ్చినట్లు చెబుతున్నారు.
తహసీల్దార్ తెలివి..
బాచుపల్లి తహసీల్దార్ ఏకంగా ఇతర ప్రాంతంలోని ప్రైవేట్ సర్వే నంబరును ఎర్రకుంటకు చూపి ప్రైవేట్ భూమి అని నివేదిక ఇచ్చారు. వివాదాల నేపథ్యంలో ఎర్రకుంట చుట్టూ ఫెన్సింగ్, గేట్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ భూమి అని బోర్డు కూడా పెట్టారు. కాగా, ఇందులో భవన నిర్మాణ అనుమతి కోసం దరఖాస్తు వెళ్లింది. టీఎ్‌సబీపాస్ నిబంధనల ప్రకారం ప్రతి దరఖాస్తుపై సంబంధిత అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించాలి.
ఈ లెక్కన హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ అధికారి (ఏపీవో) పర్యటించాలి. కానీ, కార్యాలయంలో కూర్చుని ఆన్‌లైన్‌లో ఉన్న డాక్యుమెంట్ల ఆధారంగా అనుమతులు జారీ చేశారు. బిల్డర్‌తో కుమ్మక్కైన ఆయా విభాగాల అధికారులు.. చెరువు స్థలంలో నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసినట్లు హైడ్రా నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. కాగా, గండిపేట పరిధిలో పలు భవనాలకు సూపరింటెండెంట్ అధికారి ఆమోదం ఉన్నట్లు తేల్చారు. మాజీ సర్పంచ్ కూడా పాత తేదీతో అనుమతులిచ్చారని అంచనాకు వచ్చారు.
కేసులు వీరిపైనే.. ఈర్ల చెరువు అనుమతుల జారీలో
చందానగర్ డిప్యూటి మునిసిపల్ కమిషనర్
అసిస్టెంట్ సిటీ ప్లానర్ ప్రగతినగర్ ఎర్రకుంటలో
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా సర్వే సర్వే డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ డైరెక్టర్
బాచుపల్లి తహశీల్దార్
హెచ్‌ఎండీఏ అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్
నిజాంపేట కార్పొరేషన్ కమిషనర్
గండిపేటలో సూపరింటెండెంట్ అధికార వర్గాల్లో కలకలం..
ఆరుగురు అధికారులపై కేసుల నమోదుకు హైడ్రా సిపారసు చేయడం కలకలం రేపుతోంది. మేడ్చల్ జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో బఫర్ జోన్, ఎఫ్‌టీఎల్, చెరువు శిఖం స్థలాల్లో నిబంధనలకు విరుద్దంగా అనుమతులిచ్చిన ఐదుగురిని హైడ్రా ఇప్పటికే గుర్తించింది. తాజాగా మరో ఆరుగురిపై చర్యలకు శ్రీకారం చుట్టింది. అధికార దుర్వినియోగానికి పాల్పడిన వీరిపై కేసులు పెట్టడంతో పాటు నిర్మాణాలను కూల్చివేయడానికి నోటీసులు ఇచ్చినట్లు సమాచారం.
Updated Date - Aug 30 , 2024 | 03:10 AM