AV Ranganath: నివాసముంటున్న ఇళ్లు కూల్చం..
ABN, Publish Date - Sep 09 , 2024 | 04:48 AM
చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్లు ఉన్నా.. వాటిలో ఇప్పటికే పౌరులు నివాసముంటున్నట్లయితే ఆ ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు.
ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఉన్నా పడగొట్టం
వాటిపై సర్కారే నిర్ణయం తీసుకుంటుంది
నివాసేతర, నిర్మాణంలో ఉన్న వాటిపైనే మా
చర్యలు.. ఆక్రమణలు జరగకుండా చూస్తాం
హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టీకరణ
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 8 (ఆంధ్రజ్యోతి): చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో ఇళ్లు ఉన్నా.. వాటిలో ఇప్పటికే పౌరులు నివాసముంటున్నట్లయితే ఆ ఇళ్లను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్ తెలిపారు. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఆక్రమణల పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో ఆయన స్పష్టతనిచ్చారు. నివాసేతర భవనాలు, నిర్మాణంలో ఉన్న భవనాలపై మాత్రమే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పౌరులు నివాసముంటున్న ఆక్రమణల విషయంలో ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. తమకు సంబంధించినంత వరకు మున్ముందు ఆక్రమణలు రాకుండా చూడడం తక్షణ కర్తవ్యమన్నారు.
మాదాపూర్ సున్నం చెరువు, మల్లంపేట కత్వ చెరువు, అమీన్‌పూర్ చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలపై చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. సున్నం చెరువులో గతంలో తొలగించిన ఆక్రమణలు కూడా మళ్లీ వచ్చాయని, దాదాపు 10 ఎకరాల పరిధిలో ఉన్న ఆక్రమణల్ని తొలగించామని చెప్పారు. మల్లంపేటలో ఇప్పటివరకు కుటుంబాలు నివాసం లేని 13 విల్లాలను కూల్చినట్లు, ఇక్కడ రెండు ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. మరో 5 విల్లాల విషయంలో అనుమతులను పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఇక అమీన్‌పూర్‌లో 51 ఎకరాల స్థలంలో అనుమతులు లేకుండా చేపట్టిన నిర్మాణాలు, పద్మావతినగర్‌లో అక్రమ లే అవుట్ ప్రహరీ, రెండు సెక్యూరిటీ గదులను తొలగించామని వివరించారు.
ఆక్రమణల వెనుక ఉండేది వారే..
ఆక్రమణల వెనుక స్థానిక నేతలు ఉంటున్నారని రంగనాథ్ తెలిపారు. సున్నం చెరువు వద్ద ఆక్రమణల వెనుక గోపాల్ అనే వ్యక్తి ఉన్నారని, షెడ్లు వేసి నీటి వ్యాపారం చేయడంతోపాటు.. కొందరి నుంచి అద్దెలు కూడా వసూలు చేస్తున్నారని చెప్పారు. ఇతర రాష్ర్టాలు, ప్రాంతాల నుంచి ఆయన తీసుకువచ్చిన వారే గుడిసెల్లో ఉంటున్నారని, ముందు తాత్కాలిక నిర్మాణాలు.. తర్వాత అనుమతుల్లేకుండా శాశ్వ త భవనాలు నిర్మిస్తున్నారని చెప్పారు. పలు చెరువుల వద్ద ఈ తరహా విధానాన్ని గుర్తించామని తెలిపారు. అందుకే తాత్కాలిక నిర్మాణాలను తొలగిస్తున్నామన్నారు.
Updated Date - Sep 09 , 2024 | 04:48 AM