ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Nagarjuna: ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత..

ABN, Publish Date - Aug 25 , 2024 | 03:36 AM

చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు ఏర్పాటైన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ మానిటరింగ్‌ ఏజెన్సీ (హైడ్రా) మరో కీలక చర్య చేపట్టింది.

  • సినీనటుడు నాగార్జునకు చెందిన నిర్మాణం నేలమట్టం

  • తెల్లవారుజామునే అనూహ్యంగా రంగంలోకి హైడ్రా

  • ఉదయం నుంచి కూల్చివేతలు.. ఐదు గంటల్లో పూర్తి

  • హైకోర్టులో నాగార్జున పిటిషన్‌.. మధ్యంతర స్టే జారీ

  • అప్పటికే సింహభాగం పూర్తయిన కూల్చివేత

  • 14 ఏళ్ల క్రితం నిర్మాణం.. తమ్మిడికుంట చెరువు

  • ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌ పరిధిలో 3.30 ఎకరాలు

  • నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ అనుమతులు లేవు

  • గతంలో కోర్టు స్టే ఆర్డర్లూ లేవు: హైడ్రా

హైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం/మాదాపూర్‌, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): చెరువులు, పార్కుల్లో అక్రమ నిర్మాణాల తొలగింపు, ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించేందుకు ఏర్పాటైన హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అసెట్స్‌ ప్రొటెక్షన్‌ మానిటరింగ్‌ ఏజెన్సీ (హైడ్రా) మరో కీలక చర్య చేపట్టింది. ప్రముఖ సినీనటుడు నాగార్జునకు చెందిన హైదరాబాద్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను శనివారం కూల్చివేసింది. ఎన్‌ కన్వెన్షన్‌.. ఖానామెట్‌ గ్రామంలోని తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌లో ఉందంటూ దానిని నేలమట్టం చేసింది. హైడ్రా అధికారులు.. జీహెచ్‌ఎంసీ, ఇరిగేషన్‌, రెవెన్యూ తదితర విభాగాల అధికారులతో కలిసి శనివారం తెల్లవారుజామున 4.30 గంటలకు భారీగా పోలీసులు, యంత్రాలతో కన్వెన్షన్‌ సెంటర్‌ వద్దకు వెళ్లారు.


ఉదయం 6 గంటల సమయంలో కూల్చివేతలు మొదలుపెట్టి 11 గంటల వరకు సింహభాగం పూర్తి చేశారు. ఆక్రమణల తొలగింపు నేపథ్యంలో మాదాపూర్‌ నుంచి కూకట్‌పల్లి వైపు వెళ్లే రహదారులను మూసివేసి వాహనాల రాకపోకలను మళ్లించారు. కూల్చివేతలు జరుగుతున్న సమయంలోనే నాగార్జున హైకోర్టును ఆశ్రయించారు. చట్టవిరుద్ధంగా కూల్చివేతలు చేపట్టారని, తమకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని తెలిపారు. దీంతో కూల్చివేతలను వెంటనే నిలిపివేయాలంటూ న్యాయస్థానం మధ్యంతర స్టే ఇచ్చింది. అయితే అప్పటికే కూల్చివేతలు దాదాపుగా పూర్తయ్యాయి.


కన్వెన్షన్‌ సెంటర్‌తోపాటు చుట్టుపక్కల ఉన్న ఇతర షెడ్లనూ నేలమట్టం చేశారు. ఈ చర్య ద్వారా అందరి సందేహాలను హైడ్రా పటాపంచలు చేసినట్లయింది. ప్రముఖవ్యక్తికి చెందిన కట్టడాన్ని కూల్చివేయడంతో హైడ్రా పేరుతో సామాన్యులపైనే ప్రతాపం చూపిస్తున్నారన్న విమర్శలకు చెక్‌ పెట్టినట్లయింది. కాగా, ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత అంశం తెలుగు రాష్ట్రాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది.


  • కన్వెన్షన్‌ కథా కమామిషు ఇదీ..

ఖానామెట్‌ గ్రామం సర్వే నెంబర్‌ 36లో 29.06 ఎకరాల విస్తీర్ణంలో తమ్మిడికుంట చెరువు ఉంది. పక్కనే ఉన్న సర్వే నెంబర్‌ 11/2లో సినీనటుడు నాగార్జునకు ఎనిమిది ఎకరాల భూమి ఉంది. ఈ భూమిలో 2010లో ఎన్‌ కన్వెన్షన్‌, ఇతర నిర్మాణాలను చేపట్టారు. అయితే సర్వే నెంబర్‌ 11/2లోని మూడు ఎకరాలు తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉందని అధికారులు చెబుతున్నారు. ఇందులోని నిర్మాణాలనే కూల్చివేశారు. కాగా, ఎన్‌ కన్వెన్షన్‌.. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉందంటూ ఉమ్మడి రాష్ట్రంలోనే జీహెచ్‌ఎంసీకి, రెవెన్యూ విభాగాలకు ఫిర్యాదులందాయి.


2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన అనంతరం అప్పటి ప్రభుత్వం ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌కు నోటీసులు జారీ చేసింది. అనుమతి పత్రాలు, స్థల యజమాన్యపు హక్కు వివరాలు ఇవ్వాలని పేర్కొంది. కానీ, యజమానుల నుంచి సమాధానం రాకపోవడంతో.. దానిని అనుమతి లేని నిర్మాణంగా పరిగణించి కూల్చివేతకు రంగం సిద్ధం చేసింది. దీంతో ఎన్‌ కన్వెన్షన్‌ యాజమాన్యం కోర్టుకు వెళ్లింది. పట్టా భూమిలో నిర్మాణం ఉందని, చెరువు/ప్రభుత్వ భూమి కాదని పేర్కొంటూ పిటిషన్‌ దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ, ఇరిగేషన్‌ విభాగాలు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఎన్‌ కన్వెన్షన్‌.. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లోనే ఉన్నట్లు నిర్ధారించారు. అయితే ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ సక్రమంగా లేదంటూ కన్వెన్షన్‌ యాజమాన్యం 2017లో మరోసారి మియాపూర్‌లోని అదనపు జిల్లా జడ్జి కోర్టును ఆశ్రయించింది. అప్పటి నుంచి కేసు పెండింగ్‌లో ఉంది. దీంతో ప్రభుత్వ విభాగాలు కూడా కూల్చివేతల దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.


  • కూల్చివేతకు భారీ కసరత్తు!

ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతకు ముందు హైడ్రా భారీగానే కసరత్తు చేసినట్లు సమాచారం. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఎన్‌ కన్వెన్షన్‌ నిర్మాణం జరిగినట్లు ‘జనం కోసం’ అనే స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఈ నెల 20న హైడ్రాకు ఫిర్యాదు చేశారు. మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా ఎన్‌ కన్వెన్షన్‌పై చర్యలు తీసుకోవాలంటూ లేఖ రాశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలోనే హైడ్రా రంగంలోకి దిగింది. అయితే ప్రముఖ వ్యక్తికి చెందిన ఆస్తి కావడంతో ఈ విషయంపై పట్టణ ప్రణాళికా విభాగం నుంచి పూర్తి వివరాలను హైడ్రా సేకరించినట్లు సమాచారం. హెచ్‌ఎండీఏ నిర్ధారించిన మేరకు నిర్మాణం ఎఫ్‌టీఎల్‌లో ఉందా? బఫర్‌ జోన్‌లోనా? అన్నది కూడా పరిశీలించారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నాక.. నిర్మాణంపై చర్యలు తీసుకోవద్దంటూ కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని నిర్ధారించుకున్నారు. అనంతరం ‘ఆపరేషన్‌ ఎన్‌ కన్వెన్షన్‌’కు శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయమే భారీ యంత్రాలు, సిబ్బందితో వెళ్లిన హైడ్రా అధికారులు.. కన్వెన్షన్‌ సెంటర్‌ కూల్చివేత ప్రారంభించారు. మొత్తం వ్యవహారాన్ని హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ స్వయంగా పరిశీలించినట్లు తెలిసింది.


  • ఇతర నిర్మాణదారుల్లో గుబులు!

29.6 ఎకరాల విస్తీర్ణంలో ఉండాల్సిన తమ్మిడికుంట చెరువు 10 ఎకరాలకు కుచించుకుపోయింది. సుమారు 19ఎకరాల చెరువు స్థలం కబ్జాకు గురైంది. ఇళ్లు, ఇతర నిర్మాణాలు వెలిశాయి. ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేతతో వారిలో గుబులు మొదలైంది. ఏం జరుగుతుందో అని ఆందోళన చెందుతున్నారు.


  • నెక్స్ట్‌ టార్గెట్‌ మల్లారెడ్డి?

చెరువుల్లో ఆక్రమణల కూల్చివేత కొనసాగుతుందని హైడ్రా వర్గాలు చెబుతున్నాయి. అయితే, మేడ్చల్‌ జిల్లా పరిధిలోని మాజీ మంత్రి మల్లారెడ్డికి చెందిన కళాశాలలు, హాస్టళ్లూ చెరువుల ఎఫ్‌టీఎల్‌, బఫర్‌జోన్‌, ప్రభుత్వ స్థలాల్లో ఉన్నాయన్నది గత కొంత కాలంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో తదుపరి కూల్చివేతలు మల్లారెడ్డికి సంబంధించిన నిర్మాణాలేనని ప్రచారం జరుగుతోంది.


పలు ఆక్రమణలపై కోర్టు స్టేలు ఉండగా.. ఇటీవల కాప్రా సర్కిల్‌ పరిధిలోని నిర్మాణంపై స్టే వెకేట్‌ అయినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో చర్యలు తీసుకునేందుకు మేడ్చల్‌ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఘట్‌కేసర్‌ మండలం వెంకటాపూర్‌ పరిధిలోని నాదం చెరువు బఫర్‌ జోన్‌లోని 1.5ఎకరాలను ఆక్రమించి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనురాగ్‌ యూనివర్సిటీ భవనాలు నిర్మించారని ఇరిగేషన్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. ఈ నిర్మాణలపైనా చర్యలుంటాయని ప్రచారం జరుగుతోంది.


  • నిబంధనలు అతిక్రమించి కన్వెన్షన్‌

  • నిర్మాణానికి అనుమతులు లేవు: హైడ్రా

ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ను నిబంధనలు ఉల్లంఘించి నిర్మించారని హైడ్రా తెలిపింది. ఈ విషయాన్ని గతంలోనే నిర్ధారించినట్లు పేర్కొంది. ఇతర అక్రమ నిర్మాణాలను తొలగించినట్లుగానే ఎన్‌ కన్వెన్షన్‌నూ కూల్చివేసినట్లు వెల్లడించింది. కన్వెన్షన్‌ కూల్చివేత సంచలనంగా మారడం, కోర్టు కేసులు, స్టే ఆర్డర్‌లు ఉన్నాయన్న అభిప్రాయాల నేపథ్యంలో హైడ్రా శనివారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.

  • తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్‌/బఫర్‌ జోన్‌ నిర్ధారణకు సంబంధించి హెచ్‌ఎండీఏ 2014లో ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేసింది. 2016లో నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

  • ప్రాథమిక నోటిఫికేషన్‌ విడుదల అనంతరం 2014లో ఎన్‌ కన్వెన్షన్‌ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణలో నిబంధనల ప్రకారం నడుచుకోవాలని కోర్టు సూచించింది. ఈ మేరకు కన్వెన్షన్‌ యాజమాన్యం సమక్షంలోనే అధికారులు సర్వే నిర్వహించి.. నివేదికను వారికి కూడా ఇచ్చారు. అనంతరం దీనిపై ఎన్‌ కన్వెన్షన్‌ యాజమాన్యం 2017లో అదనపు జిల్లా జడ్జి కోర్టును కోర్టుకు వెళ్లింది. కేసు పెండింగ్‌లో ఉంది. ఎలాంటి స్టే ఆర్డర్‌ ఇవ్వలేదు.

  • ఎన్‌ కన్వెన్షన్‌ యాజమాన్యం స్పష్టంగా నిబంధనలు ఉల్లంఘించింది. ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉన్న అక్రమ నిర్మాణంలో వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తోంది. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని 1.12 ఎకరాలు, బఫర్‌ జోన్‌లోని 2.18 ఎకరాలను ఎన్‌ కన్వెన్షన్‌ ఆక్రమించింది.

  • నిర్మాణాన్ని క్రమబద్ధీకరించుకునేందుకు ప్రయత్నించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఉండడంతో జీహెచ్‌ఎంసీ తిరస్కరించింది.

  • తమ్మిడికుంట చెరువు చుట్టూ, నాలాల వెంట ఆక్రమణలతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆక్రమణలతో చెరువు విస్తీర్ణం 50-60 శాతం కుచించుకుపోయింది.

  • ఎన్‌ కన్వెన్షన్‌ ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ఉంది. నిర్మాణ అనుమతులు లేవు.

  • నిబంధనల ప్రకారమే ఇతర విభాగాలతో కలిసి పూర్తిగా నేలమట్టం చేశాం.

  • హైకోర్టు మధ్యాహ్నం మధ్యంతర స్టే ఇచ్చింది.

Updated Date - Aug 25 , 2024 | 03:42 AM

Advertising
Advertising
<