HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!
ABN , Publish Date - Dec 20 , 2024 | 05:41 AM
హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ(హైడ్రా) మణికొండలో అక్రమ కట్టడాలపై యాక్షన్‌లోకి దిగింది. నివాస క్యాటగిరీలో అనుమతులు తీసుకున్న ఓ అపార్ట్‌మెంట్‌లో.. వాణిజ్య పరంగా వాడుతున్న దుకాణాలను గురువారం స్థానిక మునిసిపల్ అధికారులతో కలిసి, కూల్చివేసింది.
అపార్ట్‌మెంట్‌లో దుకాణాల నేలమట్టం.. అపార్ట్‌మెంట్ వాసుల ఫిర్యాదుతో హైడ్రా యాక్షన్
హైదరాబాద్ సిటీ, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ విపత్తు ప్రతిస్పందన, ఆస్తుల పరిరక్షణ సంస్థ(హైడ్రా) మణికొండలో అక్రమ కట్టడాలపై యాక్షన్‌లోకి దిగింది. నివాస క్యాటగిరీలో అనుమతులు తీసుకున్న ఓ అపార్ట్‌మెంట్‌లో.. వాణిజ్య పరంగా వాడుతున్న దుకాణాలను గురువారం స్థానిక మునిసిపల్ అధికారులతో కలిసి, కూల్చివేసింది. స్థానిక అల్కాపురి కాలనీలో ‘అనుహర్ మార్నింగ్ రాగా అపార్ట్‌మెంట్’ గ్రౌండ్ ఫ్లోర్‌లోని మడిగెల్లో పలు వాణిజ్య దుకాణాలు కొనసాగుతున్నాయి. ఈ అపార్ట్‌మెంట్‌కు సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్, ఐదంతస్తులకు నివాస క్యాటగిరీలో హెచ్‌ఎండీఏ అనుమతులున్నాయి. అయితే.. బిల్డర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో షెట్టర్లు ఏర్పాటు చేసి, దుకాణాలకు అద్దెకిచ్చాడు. ఇలా ఈ అపార్ట్‌మెంట్ సెల్లార్‌లో ఓ బ్యాంకు, ఇతర వాణిజ్య దుకాణాలున్నాయి. వీటి ఆధునికీకరణ పనులు కొనసాగుతున్నాయి. వీటి వల్ల పార్కింగ్, ఇతర సమస్యలు ఎదురవుతున్నాయంటూ అపార్ట్‌మెంట్‌లోని 32 ప్లాట్ల యజమానులు మణికొండ మునిసిపాలిటీ, హెచ్‌ఎండీఏ, హైడ్రా అధికారులకు ఫిర్యాదు చేశారు.
విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న మునిసిపల్ అధికారులు.. బిల్డర్‌కు నోటీసులు ఇచ్చారు. వాటికి సమాధానం రాకపోగా.. మడిగెల అభివృద్ధి పనులు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో హైడ్రా, మునిసిపల్ అధికారులు గురువారం ఉదయం రంగంలోకి దిగి, వాణిజ్య దుకాణాలను కూల్చివేశారు. పాత నిర్మాణాల జోలికి వెళ్లబోమని ఇటీవలే పేర్కొన్న హైడ్రా మణికొండలో ఏకపక్షంగా వ్యవహరించిందంటూ కూల్చివేతల సమయంలో పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. కూల్చివేతకు గురైన ఓ దుకాణంలో కూరగాయలు విక్రయించే మహిళ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. దుకాణానికి ఆస్తిపన్ను, విద్యుత్తు బిల్లులను వాణిజ్య క్యాటగిరీలో చెల్లిస్తున్నట్లు తెలిపారు. తమకు నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు జరిపారని ఆరోపించారు. కాగా, మణికొండ కూల్చివేతలపై వస్తున్న ఆరోపణలపై హైడ్రా కమిషనర్ స్పందించారు. ‘‘పరిశీలన జరిపి అక్రమ నిర్మాణాలని నిర్థారించుకున్నాకే కూల్చివేశాం.’’ అని వివరించారు.
రంగనాథ్ ఇంటి సమీపంలో.. 70 ఇళ్లకు నోటీసులు
హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఇంటికి సమీపంలో (అర కిలోమీటర్) ఉన్న పలు నివాసాలకు నోటిసులు జారీ అయ్యాయి. వెంగళరావునగర్ ప్రధాన రహదారిలోని తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ కార్యాలయం, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం ఎదురుగా ఉన్న భూమిలోని నివాసాల యజమానులకు హైడ్రాలోని డిప్యూటీ సిటీ ప్లానర్ పేరిట హైడ్రా నోటిసులు అందాయి. ప్రభుత్వ స్థలం(యూస్‌ఫగూడ గ్రామం సర్వే నంబర్లు 45,46,47,48లోని 44.38 ఎకరాల భూమి)లో అక్రమంగా భవనాలు నిర్మించారన్న ఫిర్యాదుపై స్పందించిన అధికారులు 70 ఇళ్ల యజమానులకు నోటిసులిచ్చారు.