Bhuapalapalli: అబూజ్‌మడ్‌లో ఆర్మీ యుద్ధ అభ్యాస కేంద్రం!
ABN, Publish Date - Sep 14 , 2024 | 04:52 AM
మావోయిస్టుల ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఛత్తీ్‌సగఢ్‌లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యం పాగా వేయనుంది.
ట్యాంకులు, ఫిరంగులు తదితర ఆయుధాలు, యుద్ధ వ్యూహాలపై శిక్షణ
నక్సలిజంపై పోరులో కీలక పరిణామం
1,34,778 ఎకరాల సేకరణకు కేంద్రం ఓకే
ఛత్తీస్‌గఢ్- మహారాష్ట్ర- తెలంగాణ మధ్య మావోయిస్టులకు చెక్ పెట్టడమే లక్ష్యం
భూపాలపల్లి, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టుల ఉద్యమానికి ఆయువుపట్టుగా ఉన్న ఛత్తీ్‌సగఢ్‌లోని అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో భారత సైన్యం పాగా వేయనుంది. ఈ ప్రాంతంలో యుద్ధ అభ్యాస కేంద్రం ఏర్పాటుకు కేంద్ర సర్కారు సన్నద్ధమవుతోంది. నారాయణపూర్ జిల్లా ఓర్సా మండలం సోన్‌పూర్ గర్పా అటవీ ప్రాంతంలో ఈ అభ్యాస కేంద్రం ఏర్పాటు కానుంది. దీంతో మావోయిస్టు ఉద్యమంపై మరింత ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. 4 వేల చ.కి.మీ. మేర విస్తరించి ఉన్న అబూజ్‌మడ్ అటవీ ప్రాంతంలో ఎక్కడ ఏం ఉంటుందో ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు. ఇదో మార్మిక ప్రాంతంగా గుర్తింపు పొందింది. గోండుభాషలో అబూజ్ అంటే రహస్యమైన(మార్మిక) కొండలు కలిగిన ప్రాంతమని అర్థం. ఇలాంటి దట్టమైన అడవిని, కొండలను కేంద్ర స్థానంగా చేసుకొని మావోయిస్టు పార్టీ ఇక్కడ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది.
ఈ ప్రాంతంలో ప్రభుత్వ అధికారుల జాడ ఉండదు. అలాంటి అబూజ్‌మడ్‌లో ఈ ఏడాది ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పోలీస్ స్థావరాలను ఏర్పాటు చేసి ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులపై పైచేయి సాధిస్తూ వస్తున్నాయి. సైనిక యుద్ధ అభ్యాసన కోసం గుర్తించిన స్థలం కూడా ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర మధ్య మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతానికి మధ్యలో ఉండడం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం ఈ యుద్ధ అభ్యాస కేంద్రానికి అనుమతి ఇవ్వడం ద్వారా నక్సలైట్ల ఏరివేత ఆపరేషన్లలో దూకుడుగా వెళ్తున్న పోలీస్ బలగాలకు మరింత చేయూతనిచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారు.
సైనికులు యుద్ధ అభ్యాసం కోసం ఈ శిబిరంలో పాల్గొంటారే తప్ప నక్సలైట్ల ఏరివేతకు, దీనికి సంబంధం లేదని ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నప్పటికీ స్థావరం ఏర్పాటు వల్ల నాలుగు అంచెల రక్షణ వ్యవస్థలు అందబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. తద్వారా ఛత్తీ్‌సగఢ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లో నక్సలైట్ల ఏరివేత మరింత సులభతరం అవుతుందని పేర్కొంటున్నారు. ఇక్కడ యుద్ధ అభ్యాస కేంద్రం ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన 2017లోనే తెరపైకి వచ్చింది. అప్పట్లో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, గడ్చిరోలి తదితర జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి సర్వేలు కూడా జరిపారు. మహారాష్ట్ర, ఛతీ్‌సగఢ్‌లో ఏరియల్ సర్వేలూ చేపట్టారు. ఇటీవల కేంద్ర పర్యావరణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలోనే భూసేకరణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
యుద్ధ అభ్యాస కేంద్రానికి 1.34 లక్షల ఎకరాలు
సైనిక యుద్ధ అభ్యాస కేంద్రానికి 1,34,778 ఎకరాల స్థలాన్ని సేకరించే బాధ్యతను ఛత్తీ్‌సగఢ్ సర్కారు నారాయణపూర్ కలెక్టర్‌కు అప్పగించింది. త్వరగా స్థలాన్ని సేకరించి సైన్యానికి అందజేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. ఈ కేంద్రం వల్ల అత్యవసర పరిస్థితుల్లో సైనిక బలగాలు సిద్ధంగా ఉండేలా వివిధ ట్యాంకులు, ఫిరంగులు వంటి పలు ఆయుధాలపై శిక్షణ, యుద్ధ వ్యూహాల అమలు వంటి కీలక అంశాలపై పునశ్చరణ చేసుకునే వీలు కలుగుతుందని ఓ పోలీస్ ఉన్నతాధికారి ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు.
Updated Date - Sep 14 , 2024 | 04:52 AM