CM Revanth Reddy: గరిష్ఠ పరిహారం!
ABN, Publish Date - Jul 11 , 2024 | 04:54 AM
జాతీయ రహదారులకు భూమి సేకరించే విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. తరతరాలుగా భూమినే నమ్ముకొని బతుకుతున్న రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు.
జాతీయ రహదారులకు భూసేకరణలో మానవీయ కోణంతో వ్యవహరించండి
రైతులకు వీలైనంత ఎక్కువ మొత్తం దక్కేలా చూడండి
వారితో కలెక్టర్లే మాట్లాడాలి.. ఆర్‌ఆర్‌ఆర్ మొత్తానికీ ఒకే నంబరు
కేంద్రం, ఎన్‌హెచ్‌ఏఐతో వెంటనే త్రైపాక్షిక ఒప్పందం చేసుకోండి
ప్రత్యామ్నాయ భూములిచ్చి అటవీ భూములు తీసుకోండి
జాతీయ రహదారులపై సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌లో సర్వీస్ రోడ్లు,
అండర్‌పా్‌సలు నిర్మించాలి: డిప్యూటీ సీఎం భట్టి
2 నెలల్లో ‘హైదరాబాద్-విజయవాడ’ విస్తరణ: ఎన్‌హెచ్‌ఏఐ
పద్మశ్రీ గ్రహీతలకు సీఎం సన్మానం
ఒక్కొక్కరికి రూ.25 లక్షల చెక్కు అందజేత
హైదరాబాద్, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జాతీయ రహదారులకు భూమి సేకరించే విషయంలో మానవీయ కోణంతో వ్యవహరించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. తరతరాలుగా భూమినే నమ్ముకొని బతుకుతున్న రైతులకు అన్యాయం జరగకుండా చూడాలన్నారు. పరిహారం విషయంలో రాజీ పడొద్దని సూచించారు. భూ సేకరణలో నిబంధనల ప్రకారం పరిహారం ఎంత ఎక్కువగా వస్తే, అంతమొత్తం రైతులకు దక్కేలా చూడాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. భూములు కోల్పోయే రైతులతో కలెక్టర్లే నేరుగా మాట్లాడి, వారిని ఒప్పించాలని చెప్పారు. తెలంగాణలో ‘జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ)’ పరిధిలో రహదారుల నిర్మాణానికి ఎదురవుతున్న సమస్యలపై బుధవారం సచివాలయంలో రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అధికారులతో సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి మంజూరైన జాతీయ రహదారులకు భూ సేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని సీఎం ప్రశ్నించారు.
ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగా ఉండడం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండడంతో భూములిచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని కలెక్టర్లు తెలిపారు. రీజినల్ రింగు రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) దక్షిణ భాగం, ఉత్తర భాగాలకు ఒకే నంబరు కేటాయించాలని కేంద్ర మంత్రి గడ్కరీని కోరగా, సూత్రప్రాయంగా అంగీకరించారని రేవంత్ చెప్పారు. దానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ విషయంలో తొలుత రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం, ఎన్‌హెచ్‌ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పగా.. వెంటనే ఆ పని పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు. ఇక ఆర్‌ఆర్‌ఆర్ ఉత్తర భాగం భూ సేకరణలో ఉన్న ఆటంకాలపైనా రేవంత్ ఆరా తీశారు. అలైన్‌మెంట్ విషయంలో కొందరు రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చిందని యాదాద్రి కలెక్టర్ హన్మంత్ తెలపగా.. స్టే తొలగింపునకు వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని సీఎం సూచించారు. నాగ్‌పూర్- విజయవాడ కారిడార్‌లో ఖమ్మం జిల్లాలో భూసేకరణ పరిస్థితి ఏ దశలో ఉందని రేవంత్ అధికారులను అడిగారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ అంశంపై మాట్లాడుతూ.. ఖమ్మం సమీపంలోని విలువైన భూముల గుండా రహదారి వెళ్తోందని, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని తెలిపారు. తల్లాడ-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్ రహదారి పనులు సాగుతున్నందున, ప్రస్తుతం ఖమ్మం-అశ్వారావుపేట జాతీయ రహదారిని రాష్ట్ర రహదారిగా మార్చుకోవాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు సూచిస్తున్నారని.. దానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించవద్దని తుమ్మల చెప్పారు. అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. నాగ్‌పూర్-విజయవాడ కారిడార్‌లో భాగంగా నిర్మిస్తున్న రహదారిలో పెద్ద గ్రామాలున్న చోట సర్వీసు రోడ్లు నిర్మించాలని, రైతులు పొలాలకు వెళ్లేందుకు వీలుగా అండర్ పాస్‌లు నిర్మించాలని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను కోరారు. దీంతోపాటు జాతీయ రహదారుల వెంట వ్యవసాయ వాహనాలు, రైతులు వినియోగించుకునేలా గ్రావెల్ రోడ్లు నిర్మించాలనే ప్రతిపాదనపై చర్చకు రాగా.. ఈ రెండు అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని ఎన్‌హెచ్‌ఏఐ ప్రాజెక్టు సభ్యుడు అనిల్ చౌదరి చెప్పారు. గ్రావెల్ రోడ్లు నిర్మించడం వల్ల రైతులకు ఉపయోగపడడంతో పాటు భవిష్యత్తులో రహదారి విస్తరణకు ఇబ్బందులు ఉండవని సీఎం అభిప్రాయపడ్డారు.
సమన్వయంతో ముందుకు సాగండి..
ఆర్మూర్- జగిత్యాల- మంచిర్యాల, విజయవాడ-నాగ్‌పూర్ కారిడార్ రహదారులకు సంబంధించి అటవీ శాఖ భూముల బదలాయింపు సమస్యపైనా సమీక్షలో చర్చ జరిగింది. దీనిపై సీఎం రేవంత్ మాట్లాడుతూ.. అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని చెప్పారు. రహదారుల నిర్మాణానికి ఉన్న ఆటంకాలను తొలగించాలన్నారు. హైదరాబాద్-మన్నెగూడ రహదారి పనులను త్వరగా ప్రారంభించాలని, విజయవాడ-నాగ్‌పూర్ రహదారి నిర్మాణానికి భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్-విజయవాడ రహదారి ఆరు వరసల విస్తరణకు భూసేకరణ పూర్తయినందున వెంటనే పనులు చేపట్టాలని మంత్రి కోమటిరెడ్డి కోరగా.. రెండు నెలల్లో ప్రారంభిస్తామని అనిల్ చెప్పారు.
Updated Date - Jul 11 , 2024 | 04:54 AM