Jaggareddy: నెహ్రూ నుంచి రాహుల్ వరకు విద్యను ప్రోత్సహించిన వారే
ABN, Publish Date - Sep 06 , 2024 | 03:31 AM
దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా.. ఇప్పుడు రాహుల్ గాంధీ వరకూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యను ప్రోత్సహిస్తూనే వచ్చారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి పేర్కొన్నారు.
ఐఐటీలను తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రె్‌సదే
సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, నాతో సహా అందరం ప్రభుత్వ స్కూళ్లలో చదివినోళ్లమే
కేసీఆర్ సైతం ప్రభుత్వ స్కూల్లోనే చదివారు
ఆ సంగతి ఆయన మరిచినా మేం మరవలేదు
పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదలు విద్యకు దూరం
పాఠశాలల్లో వసతుల కల్పన కోసమే విద్యా కమిషన్
ప్రైవేటు స్కూళ్లలో ఫీజుల కట్టడికీ దోహదం: జగ్గారెడ్డి
హైదరాబాద్, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): దివంగత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ మొదలుకొని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా.. ఇప్పుడు రాహుల్ గాంధీ వరకూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యను ప్రోత్సహిస్తూనే వచ్చారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధి చెందిందంటే.. కాంగ్రెస్ ప్రభుత్వాలు వేసిన పునాదులే కారణమని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నంత కాలం.. పేదలకు విద్యను అందించే కార్యక్రమాలకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని గుర్తు చేశారు.
ఇందులో భాగంగానే సీఎం రేవంత్‌రెడ్డి సైతం రాష్ట్రంలో విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఐఐటీ వంటి విద్యాసంస్థలను తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రె్‌సదన్నారు. ఈ ఐఐటీల్లో చదివిన విద్యార్థులకు విదేశాల్లోనూ ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయని గుర్తు చేశారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. ఆ మాట నిలుపుకోలేదని దుయ్యబట్టారు. ఈ నాటికీ ప్రభుత్వ స్కూళ్లలో చదివే వారు ఉన్నారని, కానీ వసతులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. స్కూళ్లలో ప్రస్తుతం ఉన్న వసతులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కల్పించినవేనని వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తనతోపాటు మరెందరో ప్రభుత్వ స్కూళ్లలో చదువుకున్న వారిమేనని జగ్గారెడ్డి గుర్తు చేశారు. ప్రభుత్వ స్కూల్లో చదివిన ఉత్తమ్.. ఏకంగా పైలెట్ కూడా అయ్యారన్నారు. కేసీఆర్ సైతం ప్రభుత్వ స్కూల్లోనే చదివారని, కానీ ఆయన ఆ విషయాన్ని మరిచి పోయారని ఎద్దేవా చేశారు. తాము మాత్రం ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నామన్న సంగతి మరువలేదన్నారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదలు విద్యకు దూరమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే సీఎం రేవంత్ విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశారని తెలిపారు. కమిషన్ ద్వారా గ్రామాల్లోని ప్రభుత్వ స్కూళ్లలో వసతులు కల్పించనున్నట్లు చెప్పారు. పాఠశాలల్లో మళ్లీ పేరెంట్స్ కమిటీలు రానున్నాయన్నారు. ప్రైవేటు స్కూళ్ల ఫీజులనూ ఈ కమిషన్ కట్టడి చేయనుందని వివరించారు.
Updated Date - Sep 06 , 2024 | 03:31 AM