Janagama : సరయూలో జనగామ బాలిక గల్లంతు
ABN, Publish Date - Jul 31 , 2024 | 04:36 AM
ఆధ్యాత్మిక యాత్ర ఆ కుటుంబానికి పెను విషాదం మిగిల్చింది. అయోధ్యలోని సరయూ నదిలో స్నానం చేస్తుండగా నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఆ ఉధృతికి 17 ఏళ్ల బాలిక గల్లంతైంది.
ఘాట్ వద్ద స్నానం చేస్తుండగా పెరిగిన నదీ ప్రవాహం
కొట్టుకుపోతున్న నలుగురిని ఒడ్డుకు చేర్చిన సహాయక సిబ్బంది
17 ఏళ్ల బాలిక గల్లంతు.. రెండ్రోజులైనా దొరకని ఆచూకీ
యూపీ అధికారులకు లేఖ రాసిన కేంద్రమంత్రి బండి
జనగామ, జూలై 30 (ఆంధ్రజ్యోతి): ఆధ్యాత్మిక యాత్ర ఆ కుటుంబానికి పెను విషాదం మిగిల్చింది. అయోధ్యలోని సరయూ నదిలో స్నానం చేస్తుండగా నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఆ ఉధృతికి 17 ఏళ్ల బాలిక గల్లంతైంది.
జనగామకు చెందిన తాళ్లపల్లి నాగరాజు జిల్లా కేంద్రంలో వాటర్ ప్లాంటు నడుపుతున్నాడు. నాగరాజు, ఆయన సోదరులు చంద్రశేఖర్, చందు కుటుంబసభ్యులు, 12 మంది కలిసి యూపీలోని అయోధ్య, కాశీ యాత్ర చేయాలని సంకల్పించారు.
ఆదివారం రాత్రి హైదరాబాద్ నుంచి విమానంలో అయోధ్య చేరుకున్నారు. సోమవారం అయోధ్యలో బాలరాముడిని దర్శించుకొని.. సరయూ నది ఒడ్డున ఉన్న లక్ష్మణ ఘాట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నాగరాజు కూతుళ్లు తేజశ్రీ (17), తరుణి, భార్య జయసుధ, నాగరాజు అక్క, వదిన కలిసి ఘాట్ లోపలికి దిగారు.
వారు స్నానం చేస్తుండగా ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో ఐదుగురూ ప్రవాహంలో కొట్టుకుపోతూ హాహాకారాలు చేశారు. అక్కడే ఉన్న సహాయక బృందం నలుగురిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. తేజశ్రీ ఆచూకీ మాత్రం దొరకలేదు. మంగళవారం రాత్రి దాకా తేజశ్రీ ఆచూకీ లభ్యం కాలేదు. కాగా బాలిక ఆచూకీని త్వరగా కనుక్కోవాలంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ అయోధ్య కలెక్టర్, ఎస్పీ నాయక్‌కు సూచించారు.
Updated Date - Jul 31 , 2024 | 04:37 AM