Share News

Jeevan Reddy-Congress: అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బంపరాఫర్.. మంత్రి పదవి ఆఫర్ చేసిన కాంగ్రెస్

ABN , Publish Date - Jun 25 , 2024 | 01:17 PM

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అలకబూని.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటన చేసిన హస్తం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ బంపరాఫర్ ఇచ్చింది.

Jeevan Reddy-Congress: అలకబూనిన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి బంపరాఫర్.. మంత్రి పదవి ఆఫర్ చేసిన కాంగ్రెస్
Jeevan Reddy

జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై అలకబూని.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటన చేసిన హస్తం పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డిని బుజ్జగించేందుకు ఏఐసీసీ బంపరాఫర్ ఇచ్చింది. ఏకంగా మంత్రి పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు కాంగ్రెస్ హైకమాండ్ నుంచి జీవన్ రెడ్డికి ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై స్వయంగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు ఇద్దరూ జీవన్ రెడ్డి నివాసానికి వెళ్లి చర్చలు జరిపారని సమాచారం.


ఎమ్మెల్సీ పదవికి జీవన్ రెడ్డి రాజీనామా చేయకుండా ఇరువురు నేతలు మంతనాలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే పార్టీ మంత్రి పదవిని ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు ఏఐసీసీ కూడా సుముఖంగా ఉంది.

కాగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి దీపాదాస్ మున్షీ కూడా రంగంలోకి దిగారు. ఫోన్ చేసి మాట్లాడారు. రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుతామని మున్షీ హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు అందుబాటులో ఉన్న పార్టీ సీనియర్లు రాజీనామా ఆలోచనను విరమించుకోవాలని జీవన్ రెడ్డిని కోరుతున్నారు.


కాగా బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ను కాంగ్రెస్‌లో చేర్చు కోవడంపై జీవన్‌రెడ్డి కినుక వహించిన విషయం తెలిసిందే. తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారు. నాలుగు దశాబ్దాలుగా క్రియాశీల రాజకీయాల్లో ఉన్న తనను మాటమాత్రంగానైనా సంప్రదించకుండా తన సొంత నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడాన్ని ఆయన ఆక్షేపించారు. ఇది తనను అగౌరవపరిచినట్లేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. జగిత్యాల కాంగ్రెస్‌ నాయకులే కాకుండా ఇతర జిల్లాలకు చెందిన వందలాది కాంగ్రెస్‌ నేతలు, ప్రజాప్రతినిధులు సైతం సోమవారం ఉదయమే జీవన్‌రెడ్డి నివాసానికి చేరుకున్నారు. రాత్రి వరకూ అక్కడే ఉండి జీవన్‌రెడ్డి ఆవేదనలో పాలుపంచుకున్నారు.

Updated Date - Jun 25 , 2024 | 01:19 PM