Share News

Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు

ABN , Publish Date - Oct 03 , 2024 | 06:39 AM

మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో ఆమె అక్కినేని ఫ్యామిలీ సహా హీరోయిన్ సమంతను కూడా ఈ వివాదంలోకి లాగారు.

Konda Surekha: ఛీ ఛీ.. అసహ్యమేస్తోంది .. కొండా సురేఖపై జూ.ఎన్టీఆర్, నాని మండిపాటు

హైదరాబాద్‌: మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు (Konda Surekha Comments) తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పిస్తున్న క్రమంలో ఆమె అక్కినేని ఫ్యామిలీ సహా హీరోయిన్ సమంతను కూడా ఈ వివాదంలోకి లాగారు. నాగచైతన్య, నాగార్జున, సమంత పేర్లను ప్రస్తావించడం, వారి వ్యక్తిగత విషయాలను మీడియా ముందు మాట్లాడటం ఆ కామెంట్స్ వైరల్‌గా మారాయి. మంత్రి వ్యాఖ్యలను అక్కినేని కుటుంబం, సమంత ఖండించారు. ఇప్పటికే ప్రకాశ్ రాజ్, సింగర్ చిన్మయి, మాజీ మంత్రి రోజా తదితరులు స్పందించగా.. తాజాగా జూనియర్ ఎన్టీఆర్, నానీ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఎన్టీఆర్‌ మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోమని హెచ్చరించారు. కొండా సురేఖ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమని హీరో నాని మండిపడ్డారు.


‘‘కొండా సురేఖగారు వ్యక్తిగత జీవితాలను బయటకులాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట. ప్రజా జీవితంలో ఉన్న మీలాంటి ముఖ్యమైన వ్యక్తులు హుందాగా, గౌరవంగా గోప్యతను పాటించాలి. బాధ్యతారాహిత్యంగా చిత్ర పరిశ్రమపై నిరాధార ప్రకటనలు చేయడం నిజంగా బాధాకరం. ఇతరులు మాపై ఇలాంటి ఆరోపణలు చేస్తే చూస్తూ కూర్చొనేది లేదు. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధులు దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతంలో నిర్లక్ష్యపూరిత ప్రవర్తనను సమాజం ఎట్టి పరిస్థితుల్లో హర్షించదు’’ అని ఎన్టీఆర్ మండిపడ్డారు.konda.jpg

అసహ్యం వేస్తోంది..

‘‘రాజకీయ నాయకులు అర్థంపర్థంలేని వ్యాఖ్యలు చేయడం చూస్తుంటే అసహ్యం వేస్తోంది. బాధ్యత లేకుండా మీరు మాట్లాడుతున్న తీరు చూస్తే, మీ ప్రజల పట్ల మీకు బాధ్యత ఉందా? అనిపిస్తోంది. ఇది కేవలం సినిమా నటులు, చిత్ర పరిశ్రమ, రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం మాత్రమే కాదు. గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు. సమాజంపై చెడు ప్రభావాన్ని చూపే ఇలాంటి చర్యలను అంతా ఖండించాలి’’అని నాని పేర్కొన్నారు.


ఆమె ఓ వరం

‘‘రంగస్థలం సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్‌ గా పని చేశా. 365 డేస్ ప్రతిరోజు సమంత మేడంని దగ్గరగా చూసిన ఒక అభిమానిగా చెప్తున్నా. ఆమె సినిమా ఇండస్ట్రీ దొరికిన వరం. ఒక ఆర్టిస్ట్‌గానే కాదు , ఒక వ్యక్తి గా కూడా తను మా ఇంట్లో అక్కల అనిపించేవారు. నాకు సురేఖ గారి గురించి కానీ, సమంత మేడం గురించి కానీ మాట్లాడే అర్హత లేదు. కానీ సురేఖ గారు మాట్లాడింది మాత్రం కరెక్ట్ కాదు. గౌరవప్రదమైన పదవిలో ఉన్న వ్యక్తి నుంచి ఇలాంటి అసహ్యకరమైన కామెంట్స్‌ వినడం నిజంగా బాధగా ఉంది. పదవి, అధికారం ఉన్నా గౌరవాన్ని కొనలేరు. సినిమా ఇండస్ట్రీలో ఒక మహిళ తన కలలను సాకారం చేసకుంటూ ఎదగాలంటే చాలానే అవరోధాలు ఉంటాయి. ఇలాంటి అవమానకరవ్యాఖ్యలు ఆ భయాలను మరింత పెంచుతాయి. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమే కాదు, ప్రతి చోటా లింగ సమానత్వం ఉంది. మహిళలందరూ దీనిని ఖండించాలి. బతుకమ్మ అంటేనే ఆడది అంటారు. అలాంటి బతుకమ్మ జరుగుతున్న ఈ సమయంలో ఇలాంటి వివాదాన్ని తీసుకురావడం చాలా ఇబ్బందికరం’’ అని దసరా మూవీ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల అన్నారు.

For Latest News and Telangana News click hrere

Updated Date - Oct 03 , 2024 | 07:14 AM