Kaleshwaram Project: ‘మేడిగడ్డ’కు టెయిల్ పాండ్!
ABN, Publish Date - Oct 31 , 2024 | 03:21 AM
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా పలువురు ఉన్నతాధికారులను పలు దఫాలుగా జస్టిస్ ఘోష్ కమిషన్ అడిగిన ప్రశ్న ఇది! జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు విడుదలయ్యే వరదలో తీవ్రమైన పీడన శక్తి ఉంటుంది.
గేట్ల నుంచి దూకే నీటికి అధిక పీడన శక్తి
టెయిల్ పాండ్ లేనందునే బ్యారేజీకి నష్టం
ఎల్ అండ్ టీ నమూనా అధ్యయనంలో స్పష్టీకరణ
అందుకే టెయిల్ పాండ్ నిర్మాణానికి నిర్ణయం
ఐఐటీ రూర్కీతో డిజైన్ల రూపకల్పన మేడిగడ్డలో ఎనర్జీ డిసిపేషన్ ఏర్పాట్లు చేశారా?
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా పలువురు ఉన్నతాధికారులను పలు దఫాలుగా జస్టిస్ ఘోష్ కమిషన్ అడిగిన ప్రశ్న ఇది! జలాశయాల గేట్లు ఎత్తినప్పుడు విడుదలయ్యే వరదలో తీవ్రమైన పీడన శక్తి ఉంటుంది. దాంతో, వరద దిగువన తాకే సమయంలో నేల కోతకు గురై గుంతలు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. దీనిని నివారించేందుకు వరద నేలను తాకే చోట తగిన పరిమాణంలో నీటి నిల్వలతో టెయిల్ పాండ్ ఉండేలా ఏర్పాట్లు చేయాలి. అప్పుడు గేట్ల నుంచి వరద ఉరికినా.. దానిలోని పీడన శక్తి నిర్వీర్యమై దిగువ ప్రాంతంలో ఎలాంటి నష్టాన్ని కలిగించదు.
మేడిగడ్డ బ్యారేజీదిగువన టెయిల్‌పాండ్ నిర్మించకపోవడంతో అక్కడ నేల కోతకు గురై భారీ గుంతలు ఏర్పడ్డాయని, క్రమ క్రమంగా అవి పెద్దవై బ్యారేజీ పునాదుల (రాఫ్ట్) కింద ఇసుక జారిపోవడానికి కారణమైందని ఎల్ అండ్ టీ నిర్వహించిన నమూనా అధ్యయనంలో తేలింది. ఈ నేపథ్యంలో అక్కడ టెయిల్ పాండ్ నిర్మించాలని నీటిపారుదల శాఖ నిర్ణయించింది. తాత్కాలిక రక్షణ చర్యల్లో భాగంగా ఏర్పాట్లు చేసేందుకు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎ్‌సఏ) నుంచి అనుమతులను ఇప్పించాలని కాళేశ్వరం ప్రాజెక్టులోని రామగుండం చీఫ్ ఇంజనీర్ కె.సుధాకర్ రెడ్డి తాజాగా నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్) జి.అనిల్‌కుమార్‌కు లేఖ రాశారు. వర్షాకాలం రావడానికి ముందే ఈ పనులు చేయాల్సి ఉందని తెలియజేశారు.
ఐఐటీ రూర్కీకి డిజైన్ల తయారీ బాధ్యత
టెయిల్‌పాండ్ పనులకు సంబంధించిన మోడల్ స్టడీ్‌సను నీటిపారుదల శాఖ ఐఐటీ రూర్కీతో చేయించింది. ఈ పనులకు డిజైన్లు, డ్రాయింగ్స్‌ను సైతం అదే సంస్థ ఇవ్వనుంది. వీటికి సీడీవో సీఈ ఆమోదం తీసుకుని పనులు ప్రారంభించేందుకు ఎన్‌డీఎ్‌సఏ నుంచి అనుమతి పొందాలని రామగుండం చీఫ్ ఇంజనీర్ విజ్ఞప్తి చేశారు. మేడిగడ్డ బ్యారేజీ శాశ్వత పునరుద్ధరణకు తీసుకోవాల్సిన చర్యలపై ఎన్డీఎ్‌సఏ తుది నివేదిక సమర్పించే వరకు వేచిచూడకుండా ఈ మేరకు పనులు చేసేందుకు ఆయన అనుమతి కోరారు
- ఆంధ్రజ్యోతి, హైదరాబాద్
Updated Date - Oct 31 , 2024 | 03:21 AM