K Kavitha: రాష్ట్ర అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోంది
ABN, Publish Date - Dec 23 , 2024 | 03:34 AM
తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఈ చర్యలను తెలంగాణ సమాజం సమష్టిగా అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు.
తెలంగాణ తల్లి కోసం మరో పోరాటం: ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అస్తిత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని, ఈ చర్యలను తెలంగాణ సమాజం సమష్టిగా అడ్డుకోవాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లి నుంచి బతుకమ్మను దూరం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఈ ప్రాంత మహిళలను, పండుగలను అవమానించారని ఆరోపించారు. బీఆర్‌ఎస్, తెలంగాణ జాగృతి ఎన్‌ఆర్‌ఐ విభాగాల ప్రతినిధులతో ఆదివారం ఆమె జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్ణయించిన రూపం కాకుండా.. గతంలో రూపొందించిన విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని పలు గ్రామాల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయని తెలిపారు. కాంగ్రెస్ సర్కారు దుశ్చర్యతో.. ఉద్యమ తెలంగాణ తల్లికోసం మరో పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
నల్లగొండ ఫ్లోరైడ్ సమస్యను తీర్చిందే కేసీఆర్: బీఆర్‌ఎస్
బీఆర్‌ఎస్ పాలనలో నల్లగొండ జిల్లాకు కేసీఆర్ ఏం చేయలేదని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చేస్తున్న వ్యాఖ్యలు శుద్ధ అబద్ధాలని బీఆర్‌ఎస్ నేతలు గ్యాదరి కిషోర్‌కుమార్, కోటిరెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, బూడిద భిక్షమయ్యగౌడ్ అన్నారు. ఆదివారం తెలంగాణ భవన్‌లో వారు మీడియాతో మాట్లాడుతూ.. యాదాద్రి థర్మల్ ప్లాంటు, సాగునీటి కాళేశ్వరం నీళ్లు తేవడమే కాకుండా కేసీఆర్ మిషన్ భగీరథ పథకం చేపట్టి ఏళ్ల తరబడి నల్లగొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఫ్లోరైడ్‌ను తరిమి కొట్టారని చెప్పారు. తుంగతుర్తికి కాళేశ్వరం నీళ్లు తెచ్చిన అంశంపై కోమటిరెడ్డి చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు.
Updated Date - Dec 23 , 2024 | 03:34 AM