Nagendra Rao: 2021లోనే బ్యారేజీల్లో లోపాలు గుర్తించాం..
ABN, Publish Date - Oct 24 , 2024 | 04:14 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలను గుర్తించి, 2021 అక్టోబరు, నవంబరులోనే రామగుండం ఈఎన్‌సీగా ఉన్న నల్లా వెంకటేశ్వర్లుకు నివేదికలు ఇచ్చినా... నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని ఈఎన్‌సీ(ఓ అండ్ ఎం) బి.నాగేంద్రరావు వెల్లడించారు.
అప్పుడే నివేదికలిచ్చినా చర్యలు తీసుకోలేదు
కాళేశ్వరం కమిషన్ ఎదుట ఓఅండ్‌ఎం ఈఎన్‌సీ
120 ప్రశ్నలు.. మూడున్నర గంటల పాటు విచారణ
ఈ పోస్టు అలంకారానికేనా? అని ప్రశ్నించిన కమిషన్
హైదరాబాద్, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో లోపాలను గుర్తించి, 2021 అక్టోబరు, నవంబరులోనే రామగుండం ఈఎన్‌సీగా ఉన్న నల్లా వెంకటేశ్వర్లుకు నివేదికలు ఇచ్చినా... నష్ట నివారణ చర్యలు తీసుకోలేదని ఈఎన్‌సీ(ఓ అండ్ ఎం) బి.నాగేంద్రరావు వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణలో భాగంగా బుధవారం ఈఎన్‌సీ నాగేంద్రరావును కమిషన్ విచారించింది. దాదాపు మూడున్నర గంటల పాటు 120కి పైగా ప్రశ్నలు వేసి.. సమాధానాలు రాబట్టింది.
బ్యారేజీల వైఫల్యానికి ఓ అండ్ ఎం కూడా ఒక కారణమేనా?
ఈఎన్‌సీ(ఓఅండ్‌ఎం)కి క్షేత్ర స్థాయిలో అధికారుల వ్యవస్థ లేదు. ఏమైనా సమస్యలున్నాయని క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందితే.. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. అయితే, కాళేశ్వరంలోని మూడు బ్యారేజీల్లో సమస్యలు/లోపాలు ఉన్నట్లు రామగుండం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు నుంచి మాకు ఎప్పుడూ రిపోర్టులు రాలేదు. కానీ, 2021అక్టోబరు 25, మళ్లీ నవంబరు 24న బ్యారేజీలను పరిశీలించినప్పుడు.. ఎగువ, దిగువ భాగంలో సీసీ బ్లాకులు చెల్లాచెదురైనట్లు, వేరింగ్ కోట్ దెబ్బతిన్నట్లు గుర్తించి, ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లుకు నివేదికలు ఇచ్చాం. వాటి ఆధారంగా బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఆ పని చే యలేదు.
తనిఖీ నివేదికలు మీ వద్ద ఉన్నాయా?
ఉన్నాయి. ఇవిగో నివేదికలు అని కమిషన్‌కు రెండు రిపోర్టులు ఇచ్చారు.
డిఫెక్ట్ లయబుల్టీ కాలంలో మరమ్మతులు చేయాలని నిబంధనల్లో ఉందా?
నిర్మాణం పూర్తయ్యాక రెండేళ్లపాటు డిఫెక్ట్ లయబుల్టీ కాలం(డీఎల్‌పీ)ఉంటుంది. ఆ కాలంలో బ్యారేజీ దెబ్బతింటే... మరమ్మతుల బాధ్యత నిర్మాణ సంస్థదే. డీఎల్‌పీలో బ్యారేజీల రక్షణకు చర్యలు తీసుకోవాలని, వానాకాలానికి ముందు, తర్వాత, మధ్యలో తనిఖీలు చేసి, నివేదికలు అందించాలని కోరినా.. వాళ్లు పట్టించుకోలేదు. ఐఎస్ కోడ్‌ను, సీడబ్ల్యూసీ మ్యానువల్‌ను పాటించలేదు.
బ్యారేజీల నిర్మాణం, డీఎల్‌పీ పూర్తయినట్లు సర్టిఫికెట్లు ఇచ్చారా? బ్యారేజీలు డ్యామ్ సేఫ్టీ చట్టం పరిధిలోకి వచ్చాయా?
బ్యారేజీల నిర్మాణం, డీఎల్‌పీ పూర్తయినట్లు ఎటువంటి సమాచారం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు ఇవ్వలేదు. 2021లో డ్యామ్‌సేఫ్టీ చట్టం అమల్లోకి వచ్చింది. ఆ తర్వాత 2023లో కొన్ని సవరణలు చేశారు. ఆ సవరణల ప్రకారం స్పెసిఫైడ్ ప్రాజెక్టుల జాబితాలో బ్యారేజీలను చేర్చారు. గేట్ల ఆపరేషన్ ప్రొటోకాల్‌ను పాటించినట్లు సమాచారం లేదు. దాంతో వరద ఉధృతికి దిగువన నిర్మాణాలన్నీ దెబ్బతిన్నాయి.
బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయాలని ఆదేశించింది ఎవరు?
నీటి నిల్వలు పెంచాలని మేము ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. రామగుండం ఈఎన్‌సీకి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లున్నాయి.
గేట్ల ఆపరేషన్ షెడ్యూల్ పాటించకపోవడం వల్లే మేడిగడ్డ కుంగిందా?
మేడిగడ్డ కుంగుబాటుకు కారణాలు తెలియదు. నిర్మాణ సంస్థలు పనులు చేశాయా...? లేదా అనేది తెలియదు.
బ్యారేజీల్లో డ్యామేజీలను గుర్తించినా,
సరిచేయకుండా బిల్లులు విడుదల చేశారా?
తనిఖీలు చేసి, డ్యామేజీ జరిగినట్లు నివేదికలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదు. ప్రొటెక్షన్ వర్క్‌లు చేపట్టాలని కోరినా పట్టించుకోలేదు.
అలాంటప్పుడు ఈఎన్‌సీ ఓ అండ్ ఎం పోస్టు ఎందుకు? అలంకారానికా?
బ్యారేజీల్లో ఓ అండ్ ఎం పనులు చేసే బాధ్యత సంబంధిత చీఫ్ ఇంజనీర్‌దే. ప్రాజెక్టుల నిర్వహణ కోసం ప్రత్యేకంగా ప్రతిపాదనలు తెప్పించుకొని, వాటి ప్రకారం పనులు చేయించాలని కోరడమే మా బాధ్యత. మ్యానువల్, సర్కులర్ల జారీ, వాటిని పాటించాలని కోరడం వరకే మా బాధ్యత.
బ్యారేజీల్లో నిల్వలు తగ్గిస్తే పనులు చేస్తామని నిర్మాణ సంస్థలు కోరాయా?
బ్యారేజీల్లో నీటి నిల్వ వల్ల ఎగువ భాగంలో మరమ్మతులు చేయలేని పరిస్థితి ఉండడం వాస్తవమే. కానీ.. దిగువ భాగంలోనూ మరమ్మతులు చేయలేదు. నిర్మాణ సంస్థలు ఆ విధంగా కోరినట్లు సమాచారం లేదు.
బ్యారేజీల్లో లోపాలున్నాయని నివేదిక ఇచ్చినా చర్యలు తీసుకోని అధికారులు ఎవరు? వారిపై ఫిర్యాదు చేశారా?
ప్రాజెక్టుల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు,ఆ తర్వాత ఎస్‌ఈలు, సీఈలదే బాధ్యత. వారిపై యాక్షన్ టేకెన్ రిపోర్టును మాత్రమే కోరాం.
ఈ బ్యారేజీలు నీటి నిల్వ కోసం కాదని మీకు తెలుసా? నీటి నిల్వ వల్లే ఇసుక జారి.. బ్యారేజీ కుంగింది వాస్తవమేనా?
నిజమే. ఉన్నతస్థాయి ఆదేశాల వల్లే నీటిని నిల్వ చేశారు. నిల్వ వల్ల బ్యారేజీలపై ఒత్తిడి పెరిగి... ఇసుక జారే అవకాశాలుంటాయి.
3బ్యారేజీలు సంపూర్ణంగా పూర్తయ్యాయా? క్వాలిటీ కంట్రోల్ నిబంధనల ప్రకారం మెటీరియల్‌కు పరీక్షలు జరిగాయా?
అన్నారం, సుందిళ్లలో పనులు పూర్తయ్యాయి. మేడిగడ్డలో నిబంధనల ప్రకారం పనులు జరగలేదు. నిర్మాణ బాధ్యతలు చూసే అధికారులే పరీక్షలు చేసి, మెటీరియల్‌ను వినియోగించడానికి అనుమతించాల్సి ఉంటుంది.
మరో ఇద్దరు అధికారుల విచారణ
వరదల అనంతరం బ్యారేజీలు ఏమైనా దెబ్బతిన్నాయా? లేదా? అని పరిశీలించడానికి మనస్సాక్షిగా అంగీకరించలేదా? అని క్వాలిటీ కంట్రోల్ మాజీ చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్‌ను కమిషన్ ప్రశ్నించగా... నిర్మాణం అనంతరం బ్యారేజీల తనిఖీ బాధ్యత తమపై ఉండదని, నిర్మాణం జరిగే క్రమంలో బిల్లులు ఇచ్చే క్రమంలో క్వాలిటీ కంట్రోల్ సర్టిఫికెట్ అవసరమని అజయ్‌కుమార్ బదులిచ్చారు. డిఫెక్ట్ లయబుల్టీ కాలంలో పనులు చేయకపోతే నిర్మాణ సంస్థలపై చర్యలు తీసుకున్నారా? అని మాజీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సర్దార్ ఓంకార్ సింగ్‌ను కమిషన్ ప్రశ్నించగా.. అసంపూర్తి పనులపై నిర్మాణ సంస్థలకు నోటీసులు ఇచ్చామని ఆయన బదులిచ్చారు.
నేడు విచారణకు నల్లా వెంకటేశ్వర్లు
రామగుండం మాజీ ఈఎన్‌సీ న ల్లా వెంకటేశ్వర్లును కాళేశ్వరం విచారణ కమిషన్ గురువారం మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. ఇప్పటికే ఒకసారి విచారణ పూర్తి కాగా.. గురు, శుక్రవారాల్లో ఆయన్ను కమిషన్ ప్రశ్నించే అవకాశం ఉంది.
Updated Date - Oct 24 , 2024 | 04:14 AM