Siddipet: మల్లన్న మనువాడె.. కొమురెల్లి పులకించె!
ABN, Publish Date - Dec 30 , 2024 | 04:31 AM
సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో కొలువైన కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం సంప్రదాయబద్ధంగా, అంగరంగ వైభవంగా జరిగింది.
వైభవంగా మల్లికార్జునుడి కల్యాణం
చేర్యాల, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి క్షేత్రంలో కొలువైన కోరమీసాల కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం ఆదివారం సంప్రదాయబద్ధంగా, అంగరంగ వైభవంగా జరిగింది. మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని ఆలయం తోటబావి ప్రాంగణంలో సర్వాంగసుందరంగా ముస్తాబు చేసిన ప్రత్యేక మండపంలో మల్లన్న.. మేడలాదేవీ, కేతలమ్మను వివాహమాడారు. ఆర్‌జేసీ రామకృష్ణారావు పర్యవేక్షణలో ఆలయ ఈవో బాలాజీశర్మ, ప్రత్యేకాధికారి సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో వీరశైవ ఆగమ పండితులు కల్యాణాన్ని కనుల పండువగా జరిపారు.
మల్లన్న కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా తరలిరావడంతో కొమురవెల్లి పరిసరాలు కిక్కిరిసిపోయాయి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి సందర్భంగా ప్రభుత్వం సంతాప దినాలు పాటిస్తున్న నేపథ్యంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కాకపోవడంతో వీర శైవార్చకులే పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు. కాగా, 10-45 గంటలకు మల్లన్న కల్యాణం జరగాల్సి ఉండగా, 2 గంటలపాటు ఆలస్యమవడం పట్ల భక్తులు అసహనం వ్యక్తం చేశారు.
Updated Date - Dec 30 , 2024 | 04:31 AM