రేషన్ కార్డుల జారీ ఎప్పుడో?
ABN , Publish Date - Jul 14 , 2024 | 01:46 AM
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు లేకపోవడం నిరుపేద కుటుంబాలకు ఆటం కంగా మారింది. గత ప్రభుత్వ కాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా కార్డుల్లో చేర్పులు, మార్పులకు కూడా నోచుకోని పరిస్థితి. దాదాపు ఆరు సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు రేషన్ కార్డు లేకపోవడం నిరుపేద కుటుంబాలకు ఆటం కంగా మారింది. గత ప్రభుత్వ కాలం నుంచి కొత్త కార్డులు అందించకపోగా కార్డుల్లో చేర్పులు, మార్పులకు కూడా నోచుకోని పరిస్థితి. దాదాపు ఆరు సంవత్సరాలుగా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి హామీ ఇచ్చినా ఇటీవల పార్లమెంట్ ఎన్నికల కోడ్‌తో ఇంకా ప్రక్రియ మొదలు కాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆరు గ్యారంటీల దరఖాస్తుల సమయంలోనే 40 వేల మంది రేషన్ కార్డుల కోసం అర్జీ పెట్టుకున్నారు. చేర్పులు, మార్పుల కోసం దరఖాస్తు చేసుకొని 20,606 మంది నీరిక్షిస్తున్నారు. తరచూ ప్రకటనలతో అయోమయానికి గురవుతున్నా తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పౌరసరఫరా అధికారులు నిర్వహించిన సమావేశంలో కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు చెప్పడంతో లబ్ధిదారుల్లో రేషన్ కార్డులపై ఆశలు చిగురించాయి. మళ్లీ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు జారీ చేస్తారోనని ఎదురు చూపుల్లో మొదలయ్యాయి. కానీ కొత్త రేషన్ కార్డుల జారీ విషయంలో ఇప్పటికి ప్రకటనలే తప్ప సరైన స్పష్టత మాత్రం రావడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి.
చేర్పులు, మార్పులకు ఎదురు చూపులు
జిల్లాలో రేషన్ కార్డుల దరఖాస్తుల మాట ఎలా ఉన్నా చేర్పులు, మార్పులకు సంబంధించి 20,606 మంది దరఖాస్తు చేసుకొని నిరీక్షిస్తున్నారు. ఇందులో కొంత మేరకు పరిశీలన జరిగినా మార్పులు మాత్రం లేవు. పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల్లో బోయినపల్లి మండలంలో 1321, చందుర్తి 1760, గంభీరావుపేట 2125, ఇల్లంతకుంట 1760, కోనరావుపేట 1403, ముస్తాబాద్ 1914, రుద్రంగి 948, సిరిసిల్ల 2689, తంగళ్లపల్లి 1333, వీర్నపల్లి 481, వేములవాడ రూరల్ 1105, వేములవాడ 2105, ఎల్లారెడ్డిపేటలో 2032 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.
ప్రజా పాలనలో దరఖాస్తులు
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజాపాలనలోనూ దరఖాస్తు చేసుకుంటున్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీ అయినా ఆరు గ్యారంటీల్లో భాగంగా స్వీకరించిన దరఖాస్తుల్లో రేషన్ కార్డు సంబంధించిన కాలం లేకపోయినా ప్రభుత్వ ఆదేశాల మేరకు విడిగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లాలో ఆరు గ్యారంటీల దరఖాస్తుల్లో 1.92 లక్షలు వివిధ ఆప్షన్లలో దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 40 వేల మంది వరకు రేషన్ కార్డులు, చేర్పులు, మార్పుల కోసం అర్జీలు ఇచ్చారు. గతంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను రేషన్ కార్డులు లేకపోవడంతో అందుకోలేకపోయారు. రేషన్ కార్డుల్లో నమోదైన కుటుంబ సభ్యులకే సంక్షేమ పథకాలు అందిన నేపథ్యంలో తెల్లరేషన్‌కార్డు లేకపోవడంతో అనేకమంది డబుల్ బెడ్‌రూం ఇళ్లు, ప్రభుత్వం ఇచ్చే ఇళ్ల స్థలాలు అందుకోలేకపోయారు. మరోవైపు వివిధ ధ్రువీకరణ పత్రాలు పొందే సమయంలో కూడా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆరు గ్యారంటీల్లో ఆన్‌లైన్ చేసిన దరఖాస్తుల్లో బోయినపల్లి మండలంలో 12,808 మంది, చందుర్తి 11,737, ఇల్లంతకుంట 16,598, గంభీరావుపేట 15,567, కోనరావుపేట 14,802, ముస్తాబాద్ 16,127, రుద్రంగి 5404, తంగళ్లపల్లి 16,766, వీర్నపల్లి 4741, వేములవాడ 7854, వేములవాడ రూరల్‌లో 8050, ఎల్లారెడ్డిపేట 17,030, సిరిసిల్ల మున్సిపాలిటీ 30,146, వేములవాడ మున్సిపాలిటీలో 14,987 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో చాలా మంది తెల్ల రేషన్ కార్డు లేని వారు ఉన్నారు. ఆరు గ్యారంటీల్లో మహాలక్ష్మీ (రూ.2500) 1,28,549 మంది, మహాలక్ష్మీ (గ్యాస్ సిలెండర్) 1,65,278 మంది, రైతు భరోసా రైతులు 69,723 మంది, కౌలు రైతులు 5642 మంది, వ్యవసాయ కూలీలు 76,953, అమరవీరులకు ఇంటి స్థలం 338 మంది, ఉద్యమ కారులు 2130, ఉచిత విద్యుత్ 1,42,966 మంది, దివ్యాంగుల పింఛన్లు 4824, ఇతర పింఛన్లు 71,677, ఇందిరమ్మ ఇళ్లు 1,10,198 మంది దరఖాస్తు చేసుకున్నారు.
జిల్లాలో రేషన్ కార్డులు
జిల్లాలో ప్రస్తుతం లక్షా 73 వేల 745 రేషన్ కార్డులు ఉన్నాయి. లబ్ధిదారులు 4,97,103 మంది ఉన్నారు. ఇందులో ఆహార భద్రత కార్డులు 1,59,854, అంత్యోదయ కార్డులు 13,684, అన్నపూర్ణ కార్డులు 207 ఉన్నాయి. జిల్లాలో గత ప్రభుత్వ హయాంలో కొత్త కార్డులు రాకపోగా కనీసం ఉన్న కార్డుల్లో కొత్త సభ్యులను చేర్చకపోవడం. చేర్పులు, మార్పులు కూడా జర గలేదు. జిల్లాలో చేర్పులు, మార్పులకు సంబంధించిన దరఖాస్తులు 20,606 పెండింగ్‌లో ఉన్నాయి. రేషన్ కార్డుల్లో పిల్లల పేర్లు, కోడళ్ల పేర్లు చేర్చాలంటూ వేలాది మంది కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నారు. ప్రజావాణిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వీటితోపాటు గతంలోనే రేషన్ కార్డు కోసం 40 వేల మంది వరకు అర్హులు దరఖాస్తు చేసుకున్నారు. 2018 సంవత్సరానికి ముందు రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో 2021 ఆగస్టులో 2271 మందికి రేషన్ కార్డులు అందించారు. ఆ తరువాత కనీసం మీ సేవ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా అందించలేకపోయారు. ప్రస్తుతం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామనే ప్రభుత్వ ప్రకటనలతో లబ్ధిదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.