KTR: సరైన సమయంలో ప్రజల్లోకి కేసీఆర్.. అందుకే కాంగ్రెస్‌కి వణుకు: కేటీఆర్
ABN, Publish Date - Aug 22 , 2024 | 04:22 PM
కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు. సర్కార్ వైఫల్యాలను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని.. సరైన సమయంలో ఆయన ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్: కాంగ్రెస్ సర్కార్ అన్ని రంగాల్లో విఫలమవుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు(KTR) విమర్శించారు. సర్కార్ వైఫల్యాలను మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత ఎప్పటికప్పుడు గమనిస్తున్నారని.. సరైన సమయంలో ఆయన ప్రజల్లోకి వస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఆయన మాట్లాడుతూ.. రుణమాఫీ చేయకుండా ప్రభుత్వం పంచాయితీ ఎన్నికలకు వెళ్తుందని అనుకోవడం లేదని అన్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.
"బీసీ కులగణన చేసిన తర్వాత ఎన్నికలకు వెళ్తామని కాంగ్రెస్ చెప్పింది. సెప్టెంబర్ రెండో వారం నుంచి హామీ అమలుచేయాలని నిరసనలు తెలుపుతాం. సంపూర్ణ రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మేం అడగకపోతే ప్రభుత్వం రైతు భరోసా ఇవ్వదు. రైతులు తిరగబడతారనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మధిరలో ఇవాళ జరగాల్సిన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు. భట్టి చెప్పినట్లు రైతుల ఖాతాల్లో కేవలం రూ.7 వేల 500 కోట్లు మాత్రమే జమ అయ్యాయి. బీఆర్ఎస్ సర్కార్ దిగిపోయే సమయానికి రెవెన్యూ మిగులు రూ.5 వేల 300 కోట్లు ఉంది. అసెంబ్లీ సమావేశాల్లో రెవెన్యూ మిగులుపై ప్రభుత్వాన్ని నిలదీశాం. కానీ సీఎం రేవంత్ రెడ్డి బజారు భాష మాట్లాడి విషయాన్ని పక్కదోవ పట్టించారు" అని కేటీఆర్ పేర్కొన్నారు.
అదానీని అడుగుపెట్టనివ్వని కేసీఆర్..
అదానీ సంస్థలను కేసీఆర్ తెలంగాణలో అడుగుపెట్టనివ్వలేదని కేటీఆర్ అన్నారు. "అదానీ విషయంలో రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి తేడాలు ఉన్నాయి. ఆయనపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. అదానీ కంపెనీతో పాత బస్తీలో కరెంటు బిల్లులు వసూలు చేయిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట అదానీ కంపెనీకి అవకాశం కల్పిస్తున్నారు. తెలంగాణ తల్లి అంటే అందరికి రోల్ మోడల్. సెక్రటేరియట్ ముందు రాష్ట్ర ప్రజలకు ఆమోదయోగ్యమైన తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నిర్ణయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ బిడ్డ అంజయ్యను అవమానించిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయం ముందు ఎలా పెడతారు. తెలంగాణ చరిత్రలోంచి కేసీఆర్‌ని ఎవరూ చెరిపేయలేరు. ముఖ్యమంత్రిగా రేవంత్ సాధించిన రికార్డ్ ఏదైనా ఉందా అంటే అది ఢిల్లీకి వెళ్లడమే. సీఎంగా ఇప్పటివరకు ఆయన 20 సార్లు దేశరాజధానికి వెళ్లారు. ఇదొక్కటే రేవంత్ సాధించిన ఘనత" అని కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు.
స్వరాష్ట్రంలో పరాయి వాసనలు..
రాష్ట్రం సిద్ధించినా.. కాంగ్రెస్ పాలనలో పరాయి పాలకుల ఛాయలు కనిపిస్తున్నాయని కేటీఆర్ విమర్శించారు. "అసెంబ్లీ మీడియా సలహాదారు ప్రసన్న కుమార్, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ మను సింఘ్వి, తెలంగాణ ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట్ర అధ్యక్షుడు.. వీళ్లందరు ఏ రాష్ట్రానికి చెందిన వారు? కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ఒక్క రాజ్యసభ సభ్యుడు దొరకలేదా? అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ గురించి మాట్లాడితే ఎనిమిది మంది ఎంపీలు ఏం చేస్తారు? మూడు ఎస్సీ పార్లమెంట్ స్థానాల్లో కాంగ్రెస్ ఒక్క సీటూ మాదిగలకు ఇవ్వలేదు" అని కేటీరామారావు విమర్శించారు.
ఇవి కూడా చదవండి...
TG News:10 ఐ ఫోన్లను ఆ కొరియర్ బాయ్ ఏం చేశాడో తెలుసా!
Konda muarali: బస్వరాజు సారయ్యపై కొండా మురళి ఫైర్
Read Latest Telangana News And Telugu News
Updated Date - Aug 22 , 2024 | 04:23 PM