Crime News: వీడిన హరియాతండా రోడ్డుప్రమాదం కేసు మిస్టరీ..
ABN, Publish Date - Jul 14 , 2024 | 07:31 PM
రఘునాథపాలెం మండలం హరియాతండా వద్ద మృతిచెందిన ముగ్గురి అనుమానాస్పద కేసును పోలీసులు ఛేదించారు. మే 28న జరిగిన రోడ్డుప్రమాదంపై మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని డాక్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాడని విచారణలో తేల్చారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు.
ఖమ్మం: రఘునాథపాలెం మండలం హరియాతండా వద్ద మృతిచెందిన ముగ్గురి అనుమానాస్పద కేసును పోలీసులు ఛేదించారు. మే 28న జరిగిన రోడ్డుప్రమాదంపై మృతుల బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నారని డాక్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాడని విచారణలో తేల్చారు. కేసుకు సంబంధించిన వివరాలను ఏసీపీ రమణమూర్తి వెల్లడించారు.
ఈ సందర్భంగా ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ.." రఘునాథపాలెం హరియాతండా వద్ద ముగ్గురి అనుమానాస్పద మృతి కేసు విచారణలో డాక్టర్ ప్రవీణ్‌ను నిందితుడిగా గుర్తించాం. వివాహేతర సంబంధం కోసం ప్రవీణ్ తన భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేసినట్లు విచారణలో తేలింది. ముందుగా భార్యకు మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఆ తర్వాత ఇద్దరు పిల్లలను ఊపిరి ఆడకుండా చేసి చంపేశాడు. అనంతరం దాన్ని కారు ప్రమాదంగా చిత్రీకరించాడు. ప్రమాదానికి గురైన కారులో అనస్థీషియా ఇంజెక్షన్‌ను గుర్తించాం. దాని ఆధారంగానే కేసును ఛేదించాం. మత్తు ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎంతసేపటికి చనిపోతారు, చనిపోయిన తర్వాత ఎంతసేపు ఆ మందు ప్రభావం శరీరంపై ఉంటుందనే విషయాలను సైతం నిందితుడు గూగుల్‌లో వెతికాడు.
హైదరాబాద్‌లోని జర్మన్ టైన్ అనే ప్రైవేటు ఆస్పత్రిలో ప్రవీణ్ పనిచేస్తున్నాడు. అదే ఆస్పత్రిలో పని చేసే నర్సుతో అతనికి వివాహేతర సంబంధం ఏర్పడింది. వారి బంధానికి అడ్డుగా ఉన్న భార్య కుమారి, పిల్లలను చంపేందుకు నిందితుడు నిర్ణయించుకున్నాడు. పథకం ప్రకారం చంపేసి రోడ్డుప్రమాదంగా చిత్రీకరించాడు. హరియాతండా వద్ద ప్రమాదం జరిగినట్లు అతడే భార్య తరఫు బంధువులకు సమాచారం ఇచ్చాడు. ప్రమాదం కారణంగానే ముగ్గురు మృతిచెందారని ప్రవీణ్ చెప్పినప్పటికీ వారి ఒంటిపై ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో మృతుల బంధువులు అనుమానంతో ఆందోళన చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. విచారణలో ప్రవీణే వారిని హత్య చేసినట్లు తేలింది. దీనిపై నిందితుడితోపాటు నర్సుపైనా కేసు నమోదు చేశాం" అని తెలిపారు.
Updated Date - Jul 14 , 2024 | 07:33 PM