Congress: సీఎం రేవంత్ చేతుల మీదుగా సీతారామ ప్రాజెక్టు ప్రారంభోత్సవం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
ABN, Publish Date - Aug 07 , 2024 | 06:45 PM
ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు(Seetharama Project) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సీతారామ ప్రాజెక్టు(Seetharama Project) ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఆగస్టు 15న ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని జలసౌధలో అధికారులతో కలిసి ఆయన నీటిపారుదల శాఖపై సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో నిర్మించిన సీతారామ ప్రాజెక్ట్ ను ఈ నెల 15న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నట్లు ఉత్తమ్ పేర్కొన్నారు. నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జ,సహాయ కార్యదర్శి ప్రశాంత్ జీవన్ పాటిల్, ఈఎన్సీలు అనిల్ కుమార్, నాగేందర్ రావు, డిప్యూటీ ఈఎన్సీ శ్రీనివాస్ తదితరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
స్వాతంత్ర్యదినోత్సవం రోజు గోల్కొండ కోటలో సీఎం రేవంత్ జెండా ఎగరేశాక హెలికాప్టర్ ద్వారా నేరుగా ఖమ్మం జిల్లా వైరాకు ముఖ్యమంత్రి చేరుకుంటారని ఉత్తమ్ తెలిపారు. అక్కడే భోజనాలు చేసి వైరాలో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొంటారని అన్నారు. అంతకుముందే సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్‌లను రేవంత్ ప్రారంభిస్తారని చెప్పారు. కార్యక్రమ పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించనున్నట్లు చెప్పారు. ఉమ్మడి ఖమ్మం రైతుల కల త్వరలో నెరవేరబోతోందని ఆయన స్పష్టం చేశారు.
లక్షల సంఖ్యలో రైతులతో సభ..
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన ఆగస్టు 15న ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తూ సీఎం రేవంత్‌రెడ్డి చేతులమీదుగా సీతారామ ప్రాజెక్టు పంపుహౌస్‌లను జాతికి అంకితం చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఈ సందర్భంగా వైరాలో లక్ష మంది రైతులతో బహిరంగ నిర్వహిస్తామని తెలిపారు. సభా స్థలాన్ని ఖమ్మం కలెక్టర్ ముజ్మమిల్‌ఖాన్, ఖమ్మం సీపీ సునీల్‌దత్ తదితరులతో కలిసి ఆయన ఇటీవల పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. నాగార్జున సాగర్ ప్రాజెక్టు చరిత్రలోనే తొలిసారిగా ఆగస్టు 5న సాగర్ జలాలను విడుదల చేసిన చరిత్ర కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు.
ఒకవైపు కృష్ణా జలాలు, మరోవైపు గోదావరి జలాలు వైరా రిజర్వాయర్ సహా ఖమ్మం జిల్లాలో ఆగస్టు 15 నాటికి ప్రవహించనున్నాయని తెలిపారు. అలాగే రైతు రుణమాఫీకి సంబంధించి కూడా సీఎం రేవంత్‌రెడ్డి వైరా సభలో స్పష్టమైన ప్రకటన చేస్తారని చెప్పారు. ఆగస్టు 15న రైతు దినోత్సవంగా జరుపుకోబోతున్నామని వెల్లడించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సొంత ప్రాంతంలో సీఎం బహిరంగ సభ నిర్వహించేందుకు ఆయన కూడా ప్రత్యేక చొరవ తీసుకుంటున్నారని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
Updated Date - Aug 07 , 2024 | 06:45 PM