Kishan Reddy: శిల్పకళావేదికలో 21 నుంచి లోక్‌మంథన్
ABN, Publish Date - Nov 16 , 2024 | 04:52 AM
ఈనెల 21వ తేదీ నుంచి హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో లోక్‌మంథన్-2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
దక్షిణ భారతదేశంలో తొలిసారి నిర్వహణ
హాజరుకానున్న రాష్ట్రపతి, కేంద్రమంత్రులు
దేశ విదేశాల నుంచి వెయ్యిమందికి పైగా కళాకారులు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఈనెల 21వ తేదీ నుంచి హైటెక్ సిటీలోని శిల్పకళావేదికలో లోక్‌మంథన్-2024 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాతీయ సాంస్కృతిక మహోత్సవాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 22న ప్రారంభిస్తారని చెప్పారు. అంతకుముందురోజు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎగ్జిబిషన్, సాంస్కృతిక ఉత్సవాలను ప్రారంభిస్తారని తెలిపారు. శుక్రవారం టూరిజం ప్లాజాలో మీడియా సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడారు.
ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చలు జరపడం, వాటి పరిష్కారం కోసం ఆలోచన విధానాన్ని రూపొందించి అందుకు అనుగుణంగా వ్యవస్థ ఏర్పాటు చేయడం లోక్‌మంథన్ ముఖ్య ఉద్దేశం అని వివరించారు. ఈ కార్యక్రమంలో వందకుపైగా కళారూపాలు ప్రదర్శిస్తారని, వెయ్యి మందికి పైగా కళాకారులు పాల్గొంటారని చెప్పారు. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా లోక్‌మంథన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వనవాసీ, గ్రామవాసీ, నగరవాసీ.. కలిస్తేనే భారతవాసీ.. అని పేర్కొన్నారు. కులం, భాష పేరిట విభజన రాజకీయాలు చేస్తున్న సందర్భంలో లోక్‌మంథన్ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్, కేంద్రమంత్రులు, జాతీయ, అంతర్జాతీయ విద్యావేత్తలు హాజరవుతారని తెలిపారు.
Updated Date - Nov 16 , 2024 | 04:52 AM