Public Apology: కేటీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలి: సురేఖ
ABN, Publish Date - Aug 17 , 2024 | 04:54 AM
నోటికొచ్చినట్టు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ ‘ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేసినంత మాత్రాన సరిపోదని, కేటీఆర్ అహంకారపు మాటలను తెలంగాణ మహిళా సమాజం మర్చిపోదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): నోటికొచ్చినట్టు దుర్భాషలాడి యథాలాపంగా చేసిన వ్యాఖ్యలంటూ ‘ఎక్స్’ వేదికగా విచారం వ్యక్తం చేసినంత మాత్రాన సరిపోదని, కేటీఆర్ అహంకారపు మాటలను తెలంగాణ మహిళా సమాజం మర్చిపోదని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నేతల ముందు బహిరంగంగా చేసిన వ్యాఖ్యలకు బహిరంగంగానే క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్ చేశారు.
ఉచిత ప్రయాణ పథకంపై బీఆర్‌ఎస్ నాయకులకు మొదటి నుంచీ చిన్నచూపే ఉందని ధ్వజమెత్తారు. కాగా, ఆంధ్రాలో చదువుకున్న కేటీఆర్‌కు అక్కడి రికార్డింగ్ డ్యాన్స్‌ల సంస్కృతి ఒంటపట్టినట్టుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి ధ్వజమెత్తారు. ఫ్రస్టేషన్‌లో ఉన్న కేటీఆర్, హరీశ్.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ మంచి పని చేసినా విషం చిమ్ముతూనే ఉన్నారని దుయ్యబట్టారు.
మహిళలకు కేటీఆర్.. బహిరంగ క్షమాపణ చెప్పకుంటే.. వారు చీపుర్లతో ఆయనకు సమాధానం చెబుతారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య హెచ్చరించారు. మహిళలపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి తెలిపారు. బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ ఇకనైనా పద్ధతి మార్చుకోకపోతే మహిళా సమాజమే ఆయనతో బ్రేక్ డ్యాన్స్ చేయిస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ పేర్కొన్నారు.
Updated Date - Aug 17 , 2024 | 05:15 AM