Share News

కాంగ్రెస్‌ గూటికి కోనేరు కోనప్ప

ABN , Publish Date - Mar 07 , 2024 | 04:16 AM

మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కోనేరు కోనప్ప ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు.

కాంగ్రెస్‌ గూటికి కోనేరు కోనప్ప

ఆసిఫాబాద్‌/కాగజ్‌నగర్‌/హైదరాబాద్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత కోనేరు కోనప్ప ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. లోక్‌సభ ఎన్నికల వేళ బీఆర్‌ఎస్‌, బీఎస్పీ దోస్తీ కుదిరిన నేపథ్యంలో కాంగ్రెస్‌ గూటికి చేరాలని ఆయన నిర్ణయించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల వేళ సిర్పూరులో బీఆర్‌ఎస్‌ నుంచి కోనప్ప, బీజేపీ నుంచి హరీశ్‌బాబు, బీఎస్పీ నుంచి ప్రవీణ్‌కుమార్‌ పోటీపడగా.. స్వల్ప తేడాతో కోనప్పపై హరీశ్‌బాబు విజయం సాధించారు. ఇక్కడి నుంచి పోటీ చేసిన ప్రవీణ్‌కుమార్‌కు 40,000కుపైగా ఓట్లు రావడంతో కోనప్ప విజయావకాశాలు సన్నగిల్లాయి. ఈ క్రమంలో బుధవారం బీఎస్పీతో పొత్తు పెట్టుకున్నట్టు కేసీఆర్‌ ప్రకటించడంతో కోనప్ప అసంతృప్తికి గురయ్యారు. తన అనుచరులను హైదరాబాద్‌కు పిలిపించుకొని చర్చించారు. తొలుత మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, తర్వాత సీఎం రేవంత్‌ను కలిశారు. కాగా తమతో ఒక్క మాటైనా చెప్పకుండా బీఆర్‌ఎ్‌సతో పొత్తు ఎలా పెట్టుకుంటారని ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌పై బీఎస్పీ క్యాడర్‌ మండిపడుతోంది. ఈ మేరకు మాజీ జడ్పీ చైర్మన్‌ సిడాం గణపతి నివాసంలో ఆయా మండలాల నాయకులు, ఇతర నేతలు సమావేశమయ్యారు. పొత్తు ఎవరితో ఉన్నా ఎంపీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ టికెట్‌ను సిడాం గణపతికే కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 07 , 2024 | 09:14 AM