Share News

Blue Flag certification: రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రద్దు!

ABN , Publish Date - Mar 03 , 2025 | 04:48 AM

చ్‌ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.

 Blue Flag certification: రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపు రద్దు!

  • నిర్వహణ అధ్వానంగా ఉందని ఎఫ్‌ఈఈకు ఫిర్యాదులు

  • ఇది తాత్కాలికమేనంటున్న జిల్లా అధికారులు

  • రేపు భద్రతా ఆడిట్‌.. తర్వాత పునరుద్ధరణ అవకాశం

విశాఖపట్నం, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): విశాఖలోని రుషికొండ బీచ్‌ ప్రతిష్ఠాత్మకమైన ‘బ్లూ ఫ్లాగ్‌’ గుర్తింపు కోల్పోయింది. బీచ్‌ నిర్వహణ అధ్వానంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదుల మేరకు డెన్మార్క్‌కు చెందిన ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ (ఎఫ్‌ఈఈ) సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అయితే ఈ సర్టిఫికెట్‌ ఉపసంహరణ తాత్కాలికమేనని, 4న భద్రతా ఆడిట్‌ తర్వాత బ్లూఫ్లాగ్‌ను పునరుద్ధరించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. బీచ్‌ నిర్వహణను ప్రైవేటు సంస్థ గాలికొదిలేయడం, పర్యాటక శాఖ అధికారుల మధ్య సమన్వయలోపం కారణంగానే ఇది జరిగినట్లు తెలుస్తోంది. రుషికొండ బీచ్‌కు ఎఫ్‌ఈఈ సంస్థ 2020లో ‘బ్లూ ఫ్లాగ్‌’ గుర్తింపు ఇచ్చింది. రాష్ట్రంలో ఈ గుర్తింపు పొందిన ఏకైక బీచ్‌ ఇదే! బ్లూఫ్లాగ్‌ గుర్తింపు ఇచ్చే క్రమంలో ఎఫ్‌ఈఈ కొన్ని నిబంధనలు విధించింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా బీచ్‌ను నిర్వహించాలని సూచించింది. భద్రత, పర్యావరణ నిర్వహణ, నీటి నాణ్యతను పక్కాగా పాటించడంతోపాటు బీచ్‌ను శుభ్రంగా ఉంచుతూ, మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించింది. 2024-25కు సంబంధించి బ్లూఫ్లాగ్‌ అవార్డు(గుర్తింపు) కోసం జిల్లా యంత్రాంగం గతేడాది దరఖాస్తు చేయగా ఎఫ్‌ఈఈ రెన్యువల్‌ చేసింది. అయితే బీచ్‌లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయని, కుక్కలు వస్తున్నాయని, సీసీ కెమెరాలు పనిచేయట్లేదని, వ్యర్థాలు పేరుకుపోయాయని, మూత్రశాలలు సరిగా లేవని, దుస్తులు మార్చుకునే గదులు అధ్వానంగా ఉన్నాయని కొద్దిరోజుల కిందట ఎఫ్‌ఈఈకి ఫొటోలతో సహా ఫిర్యాదులు అందాయి.


దీంతో సదరు సంస్థ బ్లూ ఫ్లాగ్‌ గుర్తింపును తాత్కాలికంగా రద్దు చేస్తూ గతనెల కలెక్టర్‌కు మెయిల్‌ ద్వారా సమాచారం పంపింది. బీచ్‌లో ఎగురవేసే జెండాలను (గుర్తింపు ఉన్నప్పుడు కొన్ని జెండాలను ఎగురవేస్తారు) దించేయాలని సూచించింది. ఈ విషయాన్ని నోటీసు బోర్డులో తెలియజేయాలని పేర్కొంది. జిల్లా అధికారులు విషయం బయటకు రాకుండా శనివారం వరకు జాగ్రత్త పడ్డారు. జెండాలను సైతం కిందకు దించలేదు. బ్లూఫ్లాగ్‌ గుర్తింపు రద్దువిషయం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. దీనికి కారణాలను తెలియజేయాలని సీఎస్‌ ఆదేశించడంతో కలెక్టర్‌ ఆ వివరాలు పంపినట్లు తెలిసింది. అధికారులు బీచ్‌ నిర్వహణ బాధ్యతను ప్రైవేటు సంస్థకు అప్పగించారు. ఆ సంస్థ నిర్వహణను గాలికి వదిలేయడం, సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడంతో బీచ్‌ అధ్వానంగా తయారైంది. బ్లూఫ్లాగ్‌ సర్టిఫికెట్‌ను తాత్కాలికంగా ఉపసంహరిస్తున్నట్లు ఎఫ్‌ఈఈ నుంచి గతనెల 13న సమాచారం రావడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Mar 03 , 2025 | 10:55 AM