Almatti Project: ఎగువన తగ్గిన వరద..
ABN, Publish Date - Aug 11 , 2024 | 03:43 AM
కృష్ణా బేసిన్ పరిధిలోని ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద గణనీయంగా పడిపోయింది. శుక్రవారం ఆల్మట్టి ప్రాజెక్టుకు 2.06 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శనివారం 87 వేలకు తగ్గింది.
ఆల్మట్టి, నారాయణపూర్‌కు గణనీయంగా తగ్గిన ప్రవాహాలు
శ్రీశైలం, సాగర్‌కు మాత్రం భారీగానే
మూడో రోజూ సాగర్ గేట్లు బార్లా..
పర్యాటకుల రద్దీ.. లాంచీ సేవలకు బ్రేక్
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): కృష్ణా బేసిన్ పరిధిలోని ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద గణనీయంగా పడిపోయింది. శుక్రవారం ఆల్మట్టి ప్రాజెక్టుకు 2.06 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. శనివారం 87 వేలకు తగ్గింది. ఇక నారాయణపూర్‌కు 1.50 లక్షల ఇన్‌ఫ్లో ఉండగా.. సగానికి తగ్గి 75 వేలకు చేరింది. దాంతో రెండు జలాశయాల్లోనూ నిల్వను పెంచుకునేందుకు ఔట్ ఫ్లోను భారీగా తగ్గించారు. ప్రస్తుతం ఆల్మట్టిలో 129.72 టీఎంసీలకు.. 118.27 టీఎంసీలు, నారాయణపూర్‌లో 37.64 టీఎంసీలకు.. 36.09 టీఎంసీల నిల్వలున్నాయి.
ఇక జూరాల, తుంగభద్ర, సుంకేసుల ప్రాజెక్టుల నుంచి ఔట్‌ఫ్లో గణనీయంగా ఉండటంతో శ్రీశైలానికి 3.41 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరింది. దాంతో రెండు వైపులా జలవిద్యుత్ ఉత్పాదన చేసి, గేట్ల ద్వారా 4.37 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలిపెట్టారు. శ్రీశైలంలో 215.80 టీఎంసీలకు 200 పైగా టీఎంసీలున్నాయి. ఇక నాగార్జున సాగర్‌కు భారీగానే వరద చేరుతోంది.
ప్రస్తుతం 4,14,128 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. మొత్తం 26 గేట్లు ఎత్తి 3,12,756 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన, కాల్వల ద్వారా కలిపి.. 3,55,549 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సాగర్‌లో 312.50 టీఎంసీలకు 306.10 టీఎంసీలున్నాయి. సాగర్ దిగువనున్న పులిచింతల ప్రాజెక్టుకు 3,29,189 క్యూసెక్కులు వస్తుండగా.. ఔట్‌ఫ్లో 3,16,504 క్యూసెక్కులుగా నమోదైంది. వర్షాలు లేకపోవడంతో గోదావరి బేసిన్‌లోని సింగూరు, శ్రీరాంసాగర్, కడెం, ఎల్లంపల్లి ప్రాజెక్టులకు చెప్పుకోదగ్గ ప్రవాహాలు రావట్లేదు.
సాగర్‌కు పోటెత్తిన పర్యాటకులు..
వరుస సెలవులు కావడంతో నాగార్జునసాగర్‌కు వివిధ ప్రాంతాల నుంచి పర్యాటకులు భారీగా తరలివచ్చారు. వరుసగా మూడో రోజూ ప్రాజెక్టుగేట్లన్నీ ఎత్తే ఉంచడంతో తిలకించడానికి బారులు తీరారు. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కూడా సాగర్‌ను సందర్శించారు. అయితే ఔట్ ఫ్లో ఎక్కువ ఉండటంతో లాంచీలు జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండకు వెళ్లకుండా అధికారులు నిలిపేశారు.
Updated Date - Aug 11 , 2024 | 03:43 AM