Krishna Basin: కృష్ణా బేసిన్‌లో హై అలెర్ట్..
ABN, Publish Date - Sep 01 , 2024 | 03:56 AM
కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలానికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తోంది.
అధికారులూ.. అప్రమత్తం: సీఎం
శ్రీశైలానికి 3.85 లక్షల క్యూసెక్కుల వరద
శనివారం రాత్రి 5లక్షల క్యూసెక్కుల విడుదల
నాగార్జున సాగర్‌కు పోటెత్తుతున్న కృష్ణమ్మ
నీటి పారుదల శాఖ ఇంజనీర్లకు సెలవులు రద్దు
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. ఎగువన భారీ వర్షాలు కురుస్తుండడంతో శ్రీశైలానికి ప్రమాదకర స్థాయిలో వరద వస్తోంది. శనివారం రాత్రి 9:53 గంటల సమయంలో అత్యధికంగా 3.85లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దీంతో అధికారులు అప్రమత్తమై 10 గేట్లను ఎత్తడం ద్వారా ఏకంగా 5.01 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం సామర్థ్యం 215.81 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 213.88 టీఎంసీల మేర నీరు నిల్వ ఉంది. మరింత వరద వచ్చే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలతో రిజర్వాయర్‌ను సాధ్యమైనంత మేర ఖాళీ చేసే పనిలో అధికారులు ఉన్నారు. రిజర్వాయర్ ఖాళీగా ఉంటే.. అత్యవసర పరిస్థితిలో నిర్వహణ సులభమవుతుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
మరోవైపు.. రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తుండడంతో నీటి పారుదల శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రంలోని ఆయా ప్రాజెక్టుల వద్ద శనివారం హైఅలెర్ట్ ప్రకటించింది. ఇటీవలి వరదలకు ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు ప్రాజెక్టు కొట్టుకుపోయిన ఘటనను దృష్టిలో పెట్టుకొని.. అధికారులు, ఇంజనీర్ల సెలవులను రద్దు చేసింది. అన్ని ప్రభుత్వ విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చూడాలని సీఎస్ శాంతికుమారికి సూచించారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్‌ను విడిచి పోవద్దని, ఇంజనీర్లందరూ అందుబాటులో ఉండాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
రిజర్వాయర్లు, చెరువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని సూచించారు. కాగా, ఎగువన ఉన్న ఆల్మట్టి నుంచి పులిచింతల దాకా బేసిన్ పరిధిలోని ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తడంతో కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి 4,74,359 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. ఈ సీజన్‌లోనే ఇదే అత్యధికం కావడం గమనార్హం. దీంతో ప్రాజెక్టు 26 క్రస్ట్‌గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 4,12,078 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జల విద్యుదుత్పత్తితో కలిపి మొత్తం 4,53,700 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. మూసీ ప్రాజెక్టుకు శనివారం రాత్రి 5,500క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కావడంతో నాలుగు గేట్లను ఎత్తి 3,500 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
ఇక..గోదావరి బేసిన్‌లో ఎగువన ఉన్న ప్రాజెక్టులకు వరద నిరాశజనకంగానే ఉంది. శ్రీరామ్‌సాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు స్వల్పంగా వరద పెరిగింది. ఎగువ గోదావరిపై మహారాష్ట్రలోని పైఠన్ వద్ద ఉన్న జైక్వాడి ప్రాజెక్టు నిండితేనే దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. 13,318 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో నాలుగు గేట్లు ఎత్తి 27,296 క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద కొనసాగుతోంది. బ్యారేజీలోకి 1.40లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 85గేట్లను ఎత్తి, అంతే నీటిని దిగువకు పంపిస్తున్నారు.
Updated Date - Sep 01 , 2024 | 03:56 AM