Water Releases: వారంలో సాగర్ గేట్లు ఓపెన్
ABN, Publish Date - Aug 02 , 2024 | 04:28 AM
కృష్ణా ప్రవాహానికి శ్రీశైలం పూర్తిగా నిండి.. పది గేట్ల నుంచి భారీగా నీళ్లు విడుదల చేయడంతో నాగార్జునసాగర్ కూడా జలసిరితో కళకళలాడుతోంది. వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
నేడు క్రస్ట్ గేట్లకు చేరుకోనున్న ప్రాజెక్టు నీటిమట్టం
ఎడమ కాల్వకు మంత్రుల నీటి విడుదల నేడే..
శ్రీశైలం నుంచి 5.18 లక్షల క్యూసెక్కుల ఔట్‌ఫ్లో
ఆల్మట్టి, శ్రీశైలంలో నిల్వల తగ్గుదలకు నిర్ణయం
భద్రాద్రిలో తగ్గిన గోదావరి..ప్రమాద హెచ్చరిక వెనక్కి
హైదరాబాద్, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): కృష్ణా ప్రవాహానికి శ్రీశైలం పూర్తిగా నిండి.. పది గేట్ల నుంచి భారీగా నీళ్లు విడుదల చేయడంతో నాగార్జునసాగర్ కూడా జలసిరితో కళకళలాడుతోంది. వారం రోజుల్లో సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీశైలంలోకి 4.64 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. దిగువకు 5.18లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతూ రెండు వైపులా జలవిద్యుత్తు ఉత్పాదన చేస్తున్నారు. సాగర్ పూర్తి సామర్థ్యం 312.05 టీఎంసీలు కాగా ప్రాజెక్టులో ప్రస్తుతం 182.95 టీఎంసీల నీటినిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు 3.69 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా... జలవిద్యుదుత్పాదన, కుడికాల్వ అవసరాల కోసం 27 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.
శుక్రవారం ప్రాజెక్టులో నీటి మట్టం క్రస్ట్ గేట్లను తాకనుంది. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు సాగర్ ఎడమ కాల్వ నుంచి సాగు/తాగు అవసరాల కోసం నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గేట్లను ఎత్తి, నీటిని విడుదల చేయనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఉత్తమ్, మిగతా మంత్రులు కోమటిరెడ్డి, పొంగులేటి, తుమ్మల హెలికాప్టర్‌లో సాగర్‌కు వెళ్లనున్నారు. నిరుడు సాగర్ ఎడమ కాల్వ నుంచి వరద రాకపోవడంతో గత ప్రభుత్వం క్రాప్ హాలీడే ప్రకటించింది. ఫలితంగా కాల్వ పరిధిలోని 6.5 లక్షల ఎకరాలు బీళ్లుగా మారాయి. ఈ ఏడాది నీటిని విడుదల చేస్తుండటంతో అక్కడి రైతుల్లో సంతోషం వ్యక్తమవుతోంది. ప్రస్తుతం దిగువన ఉన్న పులిచింతల ఖాళీగా ఉంది. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలు కాగా... 1.12 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. సాగర్ గేట్లు ఎత్తితే పులిచింతల ఒక్కరోజులోనే నిండనుంది.
మరోవైపు.. ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చిచేరుతుండటంతో కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి, శ్రీశైలంలో రూల్‌కర్వ్( ఏసమయంలో ప్రాజెక్టులో ఏ మేరకు నిల్వలు ఉండాలని నిర్దేశించేది) ఆధారంగా నిల్వలు తగ్గించుకోవాలని అధికారులు నిర్ణయించారు. ఆల్మటిలోకి 3.41 లక్షల క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా... ప్రాజెక్టులో 68.46 టీఎంసీల నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఎగువన పుణె, కొల్హాపూర్ ప్రాంతాల్లో క్యాచ్‌మెంట్ ఏరియాలో రోజూ భారీ వర్షాలు కురుస్తుండటంతో రూల్‌కర్వ్ ఆధారంగా గణనీయంగా నిల్వలను క్రమంగా తగ్గించుకున్నారు. ఫ్లాష్ ఫ్లడ్స్‌తో 61 టీఎంసీల వరద వచ్చినా తట్టుకునేలా ప్రాజెక్టులో నిల్వలు తగ్గించుకున్నారు. గోదావరి బేసిన్‌లో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టుకు వరద పెరిగింది.
ఈ ప్రాజెక్టుకు 40,786 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రాగా... కడెం ప్రాజెక్టుకు 1768 క్యూసెక్కులు, ఎల్లంపల్లికి 8234 క్యూసెక్కుల వరద వచ్చిచేరింది. ఈ ప్రాజెక్టు నుంచి 12910 వేల క్యూసెక్కులను పంపింగ్ చేసి, మిడ్‌మానేరుకు తరలించేలా పంపింగ్ చేస్తున్నారు. మేడిగడ్డ బ్యారేజీకి 3.62 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా సమ్మక్కసాగర్(తుపాకులగూడెం) బ్యారేజీకి 6.26 లక్షలు, సీతమ్మసాగర్(దుమ్ముగూడెం) బ్యారేజీకి 8.07 లక్షల క్యూసెక్కుల వరద రికార్డయింది. ఈ బ్యారేజీలకు వచ్చిన వరదను వచ్చినట్లే కిందికి వదులుతున్నారు. భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం సాధారణ స్థితికి చేరుకుంది. ప్రస్తుతం అక్కడ 40.6 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహిస్తోంది. మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. కాగా నిజామాబాద్ జిల్లాలో గురువారం భారీ వర్షం కురిసింది. డిచ్‌పల్లిలో అత్యధికంగా 5.1 సెం.మీ వర్షపాతం నమోదైంది.
Updated Date - Aug 02 , 2024 | 04:28 AM